భాగ్యనగరాన్ని ముంచెత్తిన వాన

– రోడ్లపైకి రావొద్దన్న హైడ్రా
– అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశాలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 7: హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా వర్షం దంచికొడుతోంది. కుండపోత వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిలింనగర్‌, షేక్‌పేట్‌, మణికొండ, హైటెక్‌ సిటీలో వాన జోరుగా కురుస్తోంది. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ భారీగా స్తంభించిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిరది. కుండపోత వర్షంతో పంజాగుట్ట నుంచి గచ్చిబౌలి వరకు ట్రాఫిక్‌ జాం అయింది. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడిరది. గంట వ్యవధిలో పది సెంటీమీటర్ల వర్షం నమోదయింది. దీంతో నీళ్లు నిలిచిపోయి వరద పోటెత్తిన పరిస్థితి ఏర్పడిరది. అర్ధరాత్రి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైడ్రా వెల్లడిరచింది. ప్రజలు రోడ్లపైకి రావొద్దని, లోతట్టు ప్రాంతాల వైపు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌ నగరంతోపాటు రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రానున్న రెండు రోజులు వర్షాలు ఉంటాయనే సమాచారం ఉన్నందున కలెక్టర్లు జిల్లాల్లోని అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలన్నారు. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు భారీ వర్ష సూచన ఉన్నందున అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి అదేశించారు. జీహెచ్‌ఎంసీతోపాటు పోలీస్‌, ట్రాఫిక్‌, హైడ్రా విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని అదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో తగిన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్‌ సిటీలో ప్రజలు అత్యవసరమైతే తప్ప తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా, విద్యుత్‌ అంతరాయం లేకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వర్షాలు, వరదలతో ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కునేందుకు, ఎలాంటి సహాయమైనా అందించేందుకు అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కాగా, హైదరాబాద్‌ శివార్లలోని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున వరద సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదేశించారు. కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు స్వయంగా పర్యవేక్షించాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలను తరలించాలని, నీళ్లు నిలిచే ప్రాంతాలను మ్యాపింగ్‌ చేసి ట్రాఫిక్‌ ఇబ్బందులు రాకుండా చూడాలని, రేపు, ఎల్లుండి కూడా అప్రమత్తంగా ఉండాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.రాత్రంతా వర్షం పడే సూచనలున్నందున ప్రజలెవరూ బయటకు రావద్దని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *