– త్వరలో మార్గదర్శకాలు ఖరారు
– సీఎస్ అధ్యక్షతన ట్రస్ట్ సమావేశంలో నిర్ణయం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12 : పదిహేను రోజుల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సమక్షంలో ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకాన్ని ప్రారంభించాలని ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ సమావేశం నిర్ణయించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధ్యక్షతన ట్రస్ట్ సమావేశం గురువారం జరిగింది. ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ నూతన హెల్త్ స్కీమ్‌కు ఉద్యోగుల తరపున తమ బేసిక్ సాలరీలో 1.5 శాతం మొత్తాన్ని, ప్రభుత్వం తరపున కూడా 1.5 శాతం కేటాయించాలన్న ప్రతిపాదనను అంగీకరించారు. ఈ స్కీమ్‌కు సంబంధించిన మార్గదర్శకాలను మరికొద్ది రోజుల్లో ఖరారు చేసి ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిలచే ప్రకటింపచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉద్యోగ సంఘాల నాయకులకు సూచించారు. ఈ పథకం వివరాలను వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రంలో లక్షా 44 వేల మంది పెన్షనర్లు, రెగ్యులర్ ఉద్యోగులు ఉండగా 12.84 లక్షల మంది డిపెండెంట్లు ఉన్నారని తెలిపారు. ఉద్యోగులు, పెన్షనర్లలో నాలగవ తరగతి ఉద్యోగులు, నాన్ గెజిటెడ్, గెజిటెడ్, పెన్షనర్లు తమ బేసిక్-పేలో 1.5 శాతం మొత్తాన్ని చెల్లిస్తే ఏడాదికి రూ.528 కోట్లు జమ అవుతాయని, అంతే మొత్తాన్ని ప్రభుత్వం తన వాటాగా చెల్లిస్తుందని పేర్కొన్నారు. ఈ ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్‌లో ఉద్యోగ సంఘాల నుండి ఆరుగురు ప్రతినిధులు, పెన్షనర్ల నుండి ఇద్దరు సభ్యులు ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగులనుండి ఒకరిని ట్రస్టు సీఈవోగా నియమిస్తారు. ఉద్యోగులకు ఉత్తమమైన వైద్య సదుపాయాలను అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని, ప్రస్తుతం ప్రతిపాదించిన ఈ హెల్త్ స్కీమ్ ఒక ముందడుగు అని సీఎస్ అన్నారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సి.వి.ఆనంద్, మహేశ్‌దత్ ఎక్కా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, టీఎన్జీవో సెంట్రల్ యూనియన్ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, టీజీవో సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, సెక్రటేరియేట్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.శ్రీనివాస రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రేమ్దేవేందర్, పీఆర్టీయూకు చెందిన దామోదర్ రెడ్డి, యూటీఎఫ్‌కు చెందిన చావా రవి, రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డి, రిటైర్డ్ అధికారుల సంఘం జేఏసీ అధ్యక్షుడు లక్ష్మయ్య, మహిళా అధ్యక్షురాలు ఉమాదేవి, ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘానికి చెందిన నాగాంబ, 4·వ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దాస్య నాయక్, ప్రధాన కార్యదర్శి సాయి కుమార్, గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు మోహన్ నారాయణ, కార్యదర్శి నర్సరాజు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





