– ఆధునిక చికిత్సలు అందుబాటులోకి
– వైద్యం తర్వాత కోలుకున్న చాలామంది చిన్నారులు
– ముందుగా గుర్తిస్తే ప్రాణాలు కాపాడొచ్చు
– కేర్ హాస్పిటల్స్ వైద్యుల సూచనలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి11: పుట్టిన బిడ్డ పాలు తాగడంలో ఇబ్బంది పడితే, వేగంగా ఊపిరి తీసుకుంటే లేదా పెదవుల చుట్టూ నీలం రంగు కనిపిస్తే, ఇది సాధారణ సమస్య అనుకుని తల్లిదండ్రులు పట్టించుకోకపోవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో ఇవి జన్మతోనే వచ్చే గుండె లోపాల (కంజెనిటల్ హార్ట్ డిఫెక్ట్స్) లక్షణాలు కావచ్చని కేర్ హాస్పిటల్స్ వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు నిర్వహించే కంజెనిటల్ హార్ట్ అవేర్నెస్ వీక్ సందర్భంగా, కేర్ హాస్పిటల్స్ నిపుణులు కీలక విషయాలను వెల్లడించారు. ప్రతి వెయ్యి మంది శిశువుల్లో సుమారు 8 మంది పిల్లలు జన్మతోనే గుండె సమస్యలతో పుడుతున్నారు. భారత్‌లో ప్రతి ఏడాది సుమారు 2.4–2.5 కోట్ల జననాలు జరుగుతుండగా, అందులో దాదాపు 1.8 నుంచి 2 లక్షల మంది చిన్నారులు ఈ సమస్యతో ప్రభావితమవుతున్నారు. గర్భధారణ సమయంలో గుండె పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల ఈ లోపాలు ఏర్పడతాయి. గుండెలోని గదులు, వాల్వులు లేదా రక్తనాళాల్లో లోపాలు ఉండడం వల్ల రక్తప్రవాహం సరిగా జరగదు. సమస్య తీవ్రంగా ఉంటే శరీరానికి సరైన ఆక్సిజన్ అందకపోవడం, గుండె బలహీనపడటం, పిల్లల పెరుగుదల మందగించడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ విషయంపై హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లోని కేర్ హాస్పిటల్స్‌లోని ఇంటర్వెన్షనల్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ప్రశాంత్ ప్రకాశ్‌రావు పాటిల్, మాట్లాడుతూ, “మన గుండె రోజుకు దాదాపు లక్షసార్లు కొట్టుకుంటూ శరీరమంతా ఆక్సిజన్ ఉన్న రక్తాన్ని పంపిస్తుంది. గుండెలో లోపం ఉంటే ఈ ప్రక్రియలో అంతరాయం కలుగుతుంది. ముఖ్యంగా చిన్న పట్టణాలు, గ్రామాల్లో ఈ సమస్యను ఆలస్యంగా గుర్తించడం పెద్ద సవాల్‌గా మారుతోంది.
ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు
వేగంగా ఊపిరి తీసుకోవడం, పెదవులు లేదా గోళ్ల వద్ద నీలం రంగు కనిపించడం, బరువు సరిగా పెరగకపోవడం, పాలుతాగే సమయంలో ఎక్కువగా చెమట పడటం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు” అని చెప్పారు. సాధారణంగా కనిపించే గుండె లోపాల్లో ‘గుండెలో రంధ్రాలు’గా పిలిచే ఏఎస్డీ, వీఎస్డీ ముఖ్యమైనవి. చిన్న రంధ్రాలు కొన్ని సందర్భాల్లో సహజంగానే మూసుకుపోతాయి. కానీ పెద్ద లోపాలు గుండెపై, ఊపిరితిత్తులపై ఒత్తిడి పెంచి చికిత్స అవసరమయ్యే పరిస్థితిని తెస్తాయి. గుండె సమస్యలను గుర్తించడానికి వైద్య పరీక్షలతో పాటు పల్స్ ఆక్సీమీట్రీ, ఈసీజీ, ఛాతీ ఎక్స్‌రే, ఎకోకార్డియోగ్ర ఫీ వంటి పరీక్షలు ఉపయోగపడతాయి. గర్భిణులకు 18–22 వారాల మధ్య చేసే ఫీటల్ ఎకో పరీక్ష ద్వారా గర్భంలోనే శిశువు గుండె లోపాలను గుర్తించవచ్చు. గత రెండు దశాబ్దాల్లో పీడియాట్రిక్ కార్డియాక్ వైద్యంలో వచ్చిన పురోగతితో పిల్లల జీవన అవకాశాలు ఎంతో మెరుగయ్యాయి. శస్త్రచికిత్స అవసరం లేకుండా చేసే క్యాథెటర్ విధానాలు, ఆధునిక శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా చాలా మంది పిల్లలు సాధారణ జీవితం గడుపుతున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లోని కేర్ హాస్పిటల్స్‌లో పీడియాట్రిక్ కార్డియోథొరాసిక్ సర్జరీ క్లినికల్ డైరెక్టర్ మరియు విభాగాధిపతి డాక్టర్ తపన్ కుమార్ డాష్ మాట్లాడుతూ, తల్లిదండ్రుల్లో అవగాహన పెరుగుతోంది. కానీ సమస్యను తొందరగా గుర్తించి సరైన వైద్య నిపుణుల వద్దకు తీసుకెళ్లడం చాలా ముఖ్యం. సరైన సమయంలో చికిత్స అందితే పుట్టుకతో గుండె లోపం ఉన్న పిల్లలు కూడా ఆరోగ్యంగా ఎదిగి పెద్దవారవుతారని తెలిపారు. ప్రత్యేక పీడియాట్రిక్ కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ శస్త్రచికిత్స బృందాలతో కేర్ హాస్పిటల్స్ సిద్ధంగా ఉందని, ప్రతి నూతన శిశువుకు స్క్రీనింగ్ చేయించుకోవడం, అనుమానం వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా అనవసరమైన ప్రమాదాలను నివారించవచ్చని సూచిస్తున్నారు. కంజెనిటల్ హార్ట్ అవేర్నెస్ వీక్ సందర్భంగా వైద్యులు ఇస్తున్న సందేశం ఒక్కటే.. ముందుగానే గుర్తిస్తే చిన్ని గుండెలు సురక్షితం.. ప్రతి బిడ్డకు ఆరోగ్యమైన భవిష్యత్తు అందుతుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




