– విచారణకు హాజరైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
– మధ్యవర్తిత్వమే మంచిది
– తెలంగాణకు ధర్మాసనం సూచన
– కేటాయింపులకు మించి వాడరాదు
– మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జనవరి12: పోలవరం – నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణకు వచ్చింది.. ఈ విచారణకు తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీంలో తెలంగాణ సర్కార్ రిట్ పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ దాఖలు చేసుకోవాలని సీజేఐ ధర్మాసనం సూచించింది. మధ్యవర్తిత్వం ద్వారా జల వివాదాలను పరిష్కరించుకోవాలని కూడా మార్గనిర్దేశంచేసింది. కేంద్ర ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి కమిటీ వద్ద తెలంగాణ వాదనలు వినిపించుకోవచ్చనీ అభిప్రాయపడింది.అయితే.. తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి మళ్లీ తమ వాదనలు వినిపిస్తానని గత విచారణ సందర్భంగా సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మను సింఘ్వీ తెలిపారు. నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేనందున ప్రాజెక్టు పనులు ఆపాలని తెలంగాణ సర్కార్‌కు తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్రం తరఫున సీనియర్ న్యాయవాది అబిషేక్ మను సింఘ్వీ మరోసారి వాదనలు వినిపిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ లేదా నల్లమల సాగర్ జలాశయానికి లింక్ చేసేలా గోదావరిపై ఏపీ ప్రాజెక్టు నిర్మిస్తోందంటూ రిట్ పిటిషన్‌లో తెలంగాణ పేర్కొంది. ఈ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని, ఆ పనులను తక్షణమే నిలిపివేసేలా పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఆదేశించాలని అభ్యర్థించింది. కేంద్ర ప్రభుత్వం అనుమతించిన మేరకే పోలవరం ప్రాజెక్టు స్వరూపం ఉండాలని, విస్తరణ పనులు చేపట్టడం చట్టవిరుద్ధమని పిటీషన్‌లో పేర్కొంది. తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా నల్లమల సాగర్ ప్రాజెక్టు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టును కేంద్ర ప్రభుత్వం పరిశీలించడం సమంజసం కాదని చెప్పింది. ఈ ప్రాజెక్టుపై తదుపరి చర్యలు చేపట్టరాదంటూ జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర జలసంఘం, గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ రిట్ పిటిషన్‌లో పేర్కొంది. అయితే.. వరద జలాలను మాత్రమే తాము వాడుకుం టున్నామని ఆంధప్రదేశ్ బదులిచ్చింది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పునకు విరుద్ధంగా పోలవరం నుంచి గోదావరి జలాలు తరలించేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టును నిలిపివేయాలని తెలంగాణా సర్కార్ పిటిషన్‌లో ప్రస్తావించింది. గోదావరిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు నుంచి 200 టీఎంసీల నీటిని బొల్లాపల్లి రిజర్వాయర్ ద్వారా నల్లమల్ల సాగర్‌కు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం ఈ కొత్త ప్రాజెక్టును ప్రతిపాదిం చిందని చెబుతోంది. ఈ ప్రాజెక్టును నిలిపివేయాలని ఇదివరకే కేంద్ర జలశక్తి శాఖకు, జల వనరుల సంఘానికి లేఖ రాసింది. పోలవరం నల్లమల్ల సాగర్ కోసం ఏపీ ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ ప్రయోజనాలకు నష్టం కలిగించే నిబంధనలు, విభజన చట్టానికి వ్యతిరేకంగా బనకచర్ల లింకు ప్రాజెక్టు చేపట్టకుండా చూడాలని కోరింది.కేటాయింపుల కంటే ఎక్కువ నీళ్లు వాడొద్దనేది ముఖ్యమైన అంశం అని మంత్రి ఉత్తమ్ అన్నారు. ఏపీ ప్రభుత్వం అనేకసార్లు ఉల్లంఘనలకు పాల్పడింది. వాటిని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చాం. స్టాప్ వర్క్ ఆర్డర్‌ను అమలు చేయడం లేదని తెలిపాం. ఏపీకి కేటాయించింది 484.5 టీఎంసీలు.. కానీ ఎక్కువగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గోదావరి, కృష్ణా బోర్డులు, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లాం. ముందు డిజైన్ చేసినదానికంటే అదనంగా ఏ చేయడానికి వీల్లేదని వాదించాం. పోలవరం ప్రాజెక్టు ఒరిజినల్ ఫామ్‌కు అదనంగా మార్పులు చేయడానికి వీల్లేదని వాదనలు వినిపించామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు.
నల్లమల సాగర్ పిటిషన్ ఉపసంహరించుకున్న తెలంగాణ
నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ అధికారికంగా ప్రకటించారు. పిటిషన్ ఉపసంహరణ నేపథ్యంలో కేసును డిస్పోజ్ ఆఫ్ చేసినట్లుగా ధర్మాసనం వెల్లడించింది. ఈ నేపథ్యంలో తెలంగాణా ప్రభుత్వానికి సీజేఐ కీలక సూచనలు చేశారు. నల్లమల సాగర్ అంశంపై రిట్ పిటిషన్ ద్వారా ముందుకు వెళ్లడం ప్రయోజనకరం కాదని స్పష్టం చేశారు. అంతర్ రాష్ట్ర జల వివాదాలకు రిట్ పిటిషన్ సరైన మార్గం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి తమ వాదనలు, అభ్యంతరాలను వినిపించాలంటే ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ దాఖలు చేసుకోవాలని సూచించారు. అదే సరైన న్యాయపరమైన మార్గమని అభిప్రాయపడ్డారు. తెలంగాణా ప్రభుత్వం పిటిషన్ ఉపసంహరించుకోవడంతో ఈ కేసును సుప్రీంకోర్టు డిస్పోజ్ ఆఫ్ చేసినట్లు ఆయన ప్రకటించారు. దీంతో భవిష్యత్తులో సివిల్ సూట్ రూపంలో ఈ అంశం మరోసారి కోర్టు ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. పోలవరం ప్రాజెక్టు నుంచి నల్లమల సాగర్‌కు నీటిని తరలించే లింక్ ప్రాజెక్టుపై తెలంగాణా ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు లేవని, బచావత్ ట్రిబ్యునల్ తీర్పునకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తన పిటిషన్‌లో పేర్కొంది. చట్టపరంగా మరింత పటిష్ఠంగా వ్యవహరించాలనే సుప్రీంకోర్టు సూచనతో తెలంగాణా ప్రభుత్వం తన వ్యూహాన్ని మార్చుకుంది. కేవలం పాలనాపరమైన ఉత్తర్వుల కోసం కాకుండా, శాశ్వత పరిష్కారం కోసం సివిల్ సూట్ ద్వారా న్యాయపోరాటం చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనివల్ల గోదావరి జలాల తరలింపుపై ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన వాదనలు వినిపించే అవకాశం ఉంటుందని సర్కార్ భావిస్తోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





