-మంత్రి దామోదర్ రాజనర్సింహ దిశానిర్దేశం
– 6న ఉదయం నెక్లెస్ రోడ్డులో ఈట్ రైట్ వాక్
– నేచురోపతిలో మిల్లెట్ మేలా
– 7న 871 మంది డాక్టర్లకు నియామక పత్రాలు
– నిమ్స్ లో అందుబాటులోకి రానున్న లినాక్ సేవలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 6 నుంచి 11వ తేదీ వర హెల్త్ వీక్ నిర్వహించనున్నారు. హెల్త్ వీక్ లో రోజువారీగా నిర్వహించనున్న కార్యక్రమాలపై ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి దామోదర్ రాజనర్సింహ శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచేలా, ప్రభుత్వ వైద్య సేవలను మరింత చేరువ చేసేలా కార్యక్రమాలు ఉండాలని మంత్రి సూచించారు. హెల్త్ వీక్ లో ప్రతి రోజూ ప్రత్యేక థీమ్ తో నిర్వహించే కార్యక్రమాల వివరాలను సమీక్షించిన మంత్రి అన్ని శాఖల సమన్వయంతో కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. అన్ని కార్యక్రమాల్లోనూ విద్యార్థులు, మహిళలు, యువతను భాగస్వాములను చేయాలని మంత్రి సూచించారు. ఆహార నాణ్యత ప్రాముఖ్యతను తెలిపేలా ఏప్రిల్ 6న ఫుడ్ సేఫ్టీ ఫోకస్ డే నిర్వహించనున్నారు. ఆరోజు ఉదయం 6.30 గంటలకు హైదరాబాద్ నెక్లెస్ రోడ్ వద్ద ఈట్ రైట్ వాక్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3.00 నుంచి నేచురోపతి హాస్పిటల్లో 40 స్టాళ్లతో మిల్లెట్ మేళా నిర్వహించనున్నారు. ఇదే కార్యక్రమంలో ఫుడ్ హ్యాండ్లర్లకు శిక్షణ, స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులకు సర్టిఫికెట్ల పంపిణీ, హైజీన్ రేటింగ్ సర్టిఫికెట్ల పంపిణీ చేపట్టనున్నారు. జిల్లాల్లో కూడా ఉదయం ఈట్ రైట్ వాక్లు, మధ్యాహ్నం ఫుడ్ రిజిస్ట్రేషన్ మేళాలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని మంత్రి సూచించారు. కేన్సర్ పేషెంట్లకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు నిమ్స్ ఏర్పాటు చేసిన అధునాతన ‘లినాక్’యంత్రాన్ని ఉదయం 10 గంటలకు మంత్రి ప్రారంభిం చనున్నారు. అనంతరం రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు.
ఇం దులో తెలంగాణ కేన్సర్ రిజిస్ట్రీ ప్రారంభం, ట్రామా కేర్ పాలసీ, క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ పోర్టల్ పీసీ& పీఎన్డీటీ, ఏఆర్టీ సరోగసీ పోర్టల్స్ ప్రారంభం, అవార్డుల ప్రదానం వంటి కార్యక్రమాలు ఉంటాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులకు ఎంపికైన 871 మంది డాక్టర్లకు మంత్రి నియామక పత్రాలు అందజేయనున్నారు. అనంతరం, ఎర్రగడ్డలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ భవనాన్ని మంత్రి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాలు రాష్ట్ర ఆరోగ్య రంగ అభివృద్ధికి దోహదపడేలా సమర్థంగా నిర్వహించాలని మంత్రి సూచించారు. 8న సేఫ్ మదర్ డేగా నిర్వహిస్తూ ఉదయం 11 గంటలకు బోయిగూడలోని మిడ్వైఫరీ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ లో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లాల్లో ఏఎన్సీ పరీక్షలు, హైరిస్క్ కేసుల గుర్తింపు, ప్రసూతి సేవలపై వర్క్షాప్ నిర్వహణ, గ్రామస్థాయిలో మహిళలకు అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారు. ఎయిడ్స్ అవగాహన కల్పించేందుకు ఉదయం 7 గంటలకు హైదరాబాద్ లో రెడ్ రన్ నిర్వహించనున్నారు. జిల్లాల్లో కూడా ఇదే సమయానికి అవగాహన ర్యాలీలు నిర్వహించాలని మంత్రి సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



