మహిళల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం

– అక్టోబర్‌ 2 వరకు మహిళా వైద్య శిబిరాలు
– వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 17: సూపర్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్లతో ప్రతి జిల్లాలో ఒక మెగా హెల్త్‌ క్యాంప్‌ నిర్వహించాలని అధికారులను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో స్వస్థ్‌ నారీ సశక్త్‌ పరివార్‌ అభియాన్‌ను మంత్రి దామోదర, కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌లు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్‌, అంజిరెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మీడియాతో మాట్లాడుతూ సమాజ నిర్మాతలు మహిళలేనని, వారు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని, తద్వారా సమాజం ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో మహిళల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, వారి కోసం ప్రత్యేకంగా ఆరోగ్య మహిళ క్లినిక్‌లు నిర్వహిస్తున్నామని, ఈ క్లినిక్‌లలో వారికి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేయిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే 2012-2013లో మాతాశిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను ప్రారంభించామని, గర్భిణులు, బాలింతలు, పిల్లలకు వైద్య సేవలు అందిస్తున్నామని, ఇప్పుడు తెలంగాణవ్యాప్తంగా ఎంసీహెచ్‌లు విస్తరించి వైద్య సేవలందిస్తున్నామని వివరించారు. దేశవ్యాప్తంగా కేన్సర్‌ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళల్లో బ్రెస్ట్‌ కేన్సర్‌ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. చాలావరకు బ్రెస్ట్‌ కేన్సర్‌ కేసులు చివరి దశలోనే బయటపడుతున్నాయని, ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన డే కేర్‌ కేన్సర్‌ సెంటర్ల ద్వారా మహిళల్లో కేన్సర్‌ స్క్రీనింగ్‌, ఎర్లీ డిటెక్షన్‌కు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఎన్‌సీడీ క్లినిక్‌ల ద్వారా బీపీ, షుగర్‌, కిడ్నీ, గుండె, కేన్సర్‌ జబ్బుల బారిన పడిన మహిళలకు వైద్య సేవలు అందిస్తున్నాం. ట్రాన్స్‌జెండర్ల కోసం మైత్రి క్లినిక్స్‌ ఏర్పాటు చేశాం. ఆరోగ్య రంగంలో మాత్రమే కాదు.. ఉపాధి కల్పన, ఉద్యోగావకాశాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లోనూ మహిళకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ స్వస్థ్‌ నారీ సశక్త్‌ అభియాన్‌ను తీసుకున్న కేంద్ర ఆరోగ్య శాఖకు మంత్రి దామోదర అభినందనలు తెలిపారు. స్వస్థ్‌ నారీ సశక్త్‌ పరివార్‌ అభియాన్‌లో భాగంగా ఈ నెల 17 నుంచి అక్టోబర్‌ 2వ తేదీ వరకూ మహిళల కోసం రాష్ట్రవ్యాప్తంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సేవలను మహిళలు వినియోగించుకోవాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి టీచింగ్‌ హాస్పిటల్స్‌ వరకూ అన్నిచోట్లా క్యాంపులు నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రైమరీ హెల్త్‌ సెంటర్లలో స్క్రీనింగ్‌ క్యాంపులు, టీవీవీపీ హాస్పిటళ్లు, టీచింగ్‌ హాస్పిటళ్లలో స్పెషలిస్ట్‌ డాక్టర్లతో క్యాంపులు నిర్వహిస్తామన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *