ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి

హైదరాబాద్‌లో 30 ఏరియాల్లో హెల్త్‌ క్యాంపులు
జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో వైద్య శిబిరం ప్రారంభించిన మంత్రి పొన్నం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 23: హైదరాబాద్‌ నగరంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యం మెరుగు కోసం జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు బీసీ, రవాణా శాఖల, జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోని కృష్ణకాంత్‌ పార్కులో జీహెచ్‌ఎంసీ కార్మికులు, ఉద్యోగులు, పొదుపు సంఘాల సభ్యులకు ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వైద్య శిబిరంలో ఆరోగ్య పరీక్షలు చేయించుకుని మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దవాఖానకు పోకుండా ఏ పరీక్షలైనా ఇక్కడే జరిపి అవసరమైన చికిత్సకు హాస్పిటల్‌ పంపించేలా వీటిని ఏర్పాటు చేశామంటూ హైదరాబాద్‌లో ఉన్న ప్రతీ వ్యక్తి హెల్త్‌ క్యాంప్‌ వినియోగించుకోవాలని కోరారు. జిల్లా రెవెన్యూ, మున్సిపల్‌, మెడికల్‌ సిబ్బంది కలిసి నగరంలో ఉన్న 169 బస్తీ దవాఖానలు, 91 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 11 స్పెషాలిటీ హాస్పిటల్స్‌ పరిధిలోని 30 ఏరియాల్లో ఈ హెల్త్‌ క్యాంపులు నిర్వహించనున్నట్లు చెప్పారు. నిన్నటి వరకు బోనాల పండుగ అయింది.. సీజన్‌ మారుతోంది.. వాతావరణ మార్పు వల్ల జబ్బులు వచ్చే అవకాశం ఉంది.. మీ ఆరోగ్యాలు కాపాడడానికి మీ ఏరియాకు వైద్య బృందాలు వస్తున్నాయి అని పొన్నం వివరించారు. పేదలకు అండగా ఉండేందుకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని, పేద ప్రజలు కూడా సన్న బియ్యం తినాలని వాటిని పంపిణీ చేస్తున్నామని, పదేళ్ల తర్వాత రేషన్‌ కార్డులు ఇస్తున్నామని, హైదరాబాద్‌లో 53 వేల రేషన్‌ కార్డులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. మీ ఆశీర్వాదంతో ఏర్పడిన ప్రజా పాలన ప్రభుత్వం రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు తదితర అన్ని కార్యక్రమాలు చేస్తున్నదని చెప్పారు. ఆర్టీసీలో మహిళల 200 కోట్ల ఉచిత టికెట్లు మైలురాయి దాటిందంటూ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. గురుకులాల్లో నాణ్యమైన ఆహారం అందించడానికి మెస్‌ చార్జీలు పెంచామని, చదువుకున్న వారికి 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. కాగా, వైౖద్య పరీక్షల కోసం జీహెచ్‌ఎంసీ కార్మికులు భారీగా హాజరవ్వగా వారికి హెల్త్‌ కిట్స్‌ మంత్రి పొన్నం పంపిణీ చేశారు. కార్యక్రమంలో మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌, కలెక్టర్‌ దాసరి హరిచందన, కార్పొరేటర్లు, అజారుద్దీన్‌, నవీన్‌ యాదవ్‌ తదితర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page