జంపన్నపై మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ సీరియస్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 10: దేశంలో సకల సమస్యలకు మూలకారణమైన పెట్టుబడిదారీ వ్యవస్థ అంతానికి మీ శక్తియుక్తులతో నిజమైన ప్రతిదాడిని ఎక్కుపెట్టండి.. నిజమైన శత్రువులను గుర్తించి వేరు చేయండి.. అన్ని రకాల మిత్రులతో కలిసి నడవండి అంటూ జంపన్న అనే వ్యక్తి తమ పార్టీకి హితవు పలకడాన్ని సీపీఐ(మావోయిస్టు) పార్టీ అధికార ప్రతినిధి అభయ్ ఒక లేఖలో ఖండిరచారు. ఇక్కడే ఆయనకు చెందిన ప్రభుత్వ ప్రాయోజిత, స్వీయాత్మక, రాజకీయ దివాలాకోరుతనం బయటపడిరదన్నారు. భారతదేశంలో సకల సమస్యలకు మూలకారణం, జంపన్న చెబుతున్నట్లు పెట్టుబడిదారీ వ్యవస్థకాదు.. సామ్రాజ్యవాదుల కనుసన్నలలో నడుస్తున్న బ్రాహ్మణవాద హిందుత్వంతో విడదీయలేనంతగా పెనవేసుకుపోయిన అర్ధవలస-అర్ధభూస్వామ్య వ్యవస్థేనని స్పష్టం చేశారు. మూడేళ్ల క్రితమే విప్లవోద్యమం నుంచి తప్పుకున్న జంపన్న పార్టీకి సంబంధించిన విషయాలపై స్పష్టీకరణ ఎలా ఇవ్వ్చగలుగుతాడని అభయ్ ఆ లేఖలో పేర్కొన్నారు. నిజంగా దేశంలో పెట్టుబడిదారీ విధానమే ఉందని నమ్మితే అందుకు ఆచరణాత్మక పథకాన్ని రూపొందించుకొని విప్లవ సమస్యను పరిష్కరించేందుకు పూనుకోవాలి.. కానీ ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా మీడియాలో తన చర్చను ప్రధానంగా పార్టీ పంథాపై దాడి చేసేందుకే జంపన్న కేంద్రీకరిస్తున్నాడని ఆరోపించారు. ఇది చాలదన్నట్లు తన ఇంటర్వ్యూల్లో, సోషల్ మీడియా కామెంట్లల్లో మావోయిస్టు పార్టీకి సంబంధించిన అనేక విషయాల్లో అస్పష్టీకరణతో కూడిన విషయాలు ప్రధానంగా ఉంటున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇటువంటి విషయాలు మాట్లాడేందుకు ఆయనకు ఏమి హక్కు ఉందని ప్రశ్నించారు. ఇదంతా పధకం ప్రకారం కుట్రపూరితంగా జరుగుతున్న వ్యవహారమేనని, ఈ వ్యవహారంలో కొన్ని మీడియా సంస్థలు జంపన్న దిగజారుడుకు మసిపూసి మారేడుకాయ చేసి ఆయనను ఇప్పటికీ మావోయిస్టు ప్రతినిధిగా చిత్రీకరించి, ఆయన మాటలకూ, వ్యాఖ్యలకు ఒక విప్లవ సాధికారతను కల్పించి ప్రజల్లో గందరగోళం సృష్టించే కుట్ర చేస్తున్నాయని అభయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి కుట్రపూరిత, నీచమైన ఎత్తుగడలను పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదన్నారు. పార్టీకి సంబంధించిన ఏ విషయంపైనైనా స్పష్ట ఇచ్చే హక్కు పార్టీలో పనిచేస్తున్న వారికీ, పార్టీచేత నియమితులైన అధికార ప్రతినిధికి మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. ఇక జంపన్నపై తామిచ్చిన పై వివరణ ప్రకారం తమ వ్యాఖ్యలో ఏమాత్రం హేళనగానీ, నిరాధార ఆరోపణగానీ, అప్రజాస్వామిక వైఖరిగాని లేదని తెలియజేస్తున్నామన్నారు. తమ వ్యాఖ్య వాస్తవాలనే ప్రతిబింబిస్తున్నదని మరోసారి వక్కాణిస్తున్నామన్నారు. వాస్తవంగా జంపన్నే పార్టీలో నెలకొన్న ప్రజాస్వామిక సూత్రాలకూ, విలువలకూ, ఉమ్మడి కార్యాచరణకు ఏమాత్రం విలువనివ్వకుండా స్వార్థంతో పార్టీని వదిలి వెళ్లాడు.. ఇలాంటి వ్యక్తి తిరిగి పార్టీకి ప్రజాస్వామిక విలువలనూ, సూత్రాలను బోధించడం ఎంత హాస్యాస్పదంగా ఉందో ఆలోచించండి అని అన్నారు. కళ్ళుండి వాస్తవాలను చూసేందుకు నిరాకరించేవారికి వాస్తవాలు ఎట్టిపరిస్థితుల్లోనూ కన్పించవు అన్నారు. కాగా, నేడు దేశంలో గుర్తింపు పొందిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతాంగ ఉద్యమంలో తమ పార్టీ ఉనికిని గుర్తించడంవల్లనే మోదీ ప్రభుత్వం అ ఉద్యమంలో అర్బన్ మావోయిస్టులు ఉన్నారని అందోళన చెందుతోందని పేర్కొన్నారు. మధ్య భారతదేశంలోని విశాల ఆదివాసీ ప్రాంతాలలో పత్తల్‌ఘడి పేరుతో స్వయం నిర్ణయాధికారం కోసం జరుగుతున్న పోరాటాలకు మెజారిటీగా పార్టీ నేతృత్వం వహిస్తున్నది.. గెరిల్లా జోన్ ప్రాంతాలలో ముఖ్యంగా దండకారణ్యం, బీహార్, జార్ఖండ్, ఏఓబీ ఉద్యమ ప్రాంతాలలో పోలీసు క్యాంపుల ఎత్తివేతకు లక్షలాదిమంది అదివాసీ రైతాంగం సమరశీలంగా పోరాడుతున్నదని తెలిపారు. ఈ పోరాటానికి పరాకాష్టగా దండకారణ్యంలో సిలింగేర్ క్యాంపునకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాన్ని చూడవచ్చన్నారు. దళిత ఉద్యమాలకు పార్టీ కొన్నిచోట్ల నేతృత్వం వహిస్తుంటే మరికొన్నిచోట్ల సంఫీుభావాన్ని ప్రకటిస్తున్నది.. ఈ క్రమంలో పార్టీ ప్రభావం, నేతృత్వం గెరిల్లా జోన్ల నుంచి విశాల భారతదేశంలోని పట్టణాలకూ, మైదానాలకు విస్తరిస్తున్నదన్న భయంతోనే మోదీ ప్రభుత్వం అర్బన్ నక్సలైట్ల పేరుతో అనేకమంది విప్లవ ప్రజాస్వామికవాదులపై అక్రమ కేసులు బనాయించి జైళ్లలోకి నెట్టిందని అభయ్ ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఏకంగా 16 సంఘాలపై నిషేధం విధించిందన్నారు. ప్రజాయుద్ధమంటే గెరిల్లా పోరాటంతోపాటు, అనేక ఇతర పోరాట రూపాలు ఉంటాయనీ, ప్రజాయుద్ధం కేవలం వెనకబడిన గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా విశాల, మైదాన పట్టణ ప్రాంతాలకు విస్తరిస్తుందనే సరైన, స్పష్టమైన అవగాహనతో పార్టీ పురోగమిస్తున్నదని అన్నారు. ఈ అవగాహనలో భాగంగానే ప్రధాన శతృవుకు వ్యతిరేకంగా విశాల ఐక్య ఉద్యమాలను నిర్మించేందుకు కృషిచేస్తున్నదని, దేశవ్యాప్తంగా ఏర్పడబోయే ప్రజా ఉద్యమ వెల్లువలో మావోయిస్టు కేంద్ర స్థానాన్ని పొందుతుందని పూర్తి విశ్వాసంతో చెప్పదల్చుకున్నామని ఆయన తెలిపారు. ఈ పరిణామాలను శత్రువు చూడగలుతున్నాడు గానీ జంపన్న మాత్రం చూడ నిరాకరిస్తున్నాడని ఆయన విమర్శించారు. సకల సమస్యలను పరిష్కరించుకునేందుకు సామ్రాజ్యవాదులకూ, నిరంకుశ బూర్జువా, భూస్వామ్య వర్గాలకు వ్యతిరేకంగా కార్మికవర్గ నాయకత్వంలో నాలుగు విప్లవకర వర్గాలను కలుపుకొని దీర్ఘకాలిక ప్రజాయుద్ధం ద్వారా నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయాల్సి ఉందన్నారు. అ తర్వాతనే సోషలిస్టు విప్లవాన్నీ, కమ్యూనిజాన్ని స్థాపించాలి.. ఈ వాస్తవాన్ని జంపన్న మరుగున పరిచి విప్లవోద్యమానికి హాని కలిగించే వక్రబుద్ధితో దేశంలో సోషలిస్టు విప్లవం జరగాలని గావుకేకలు పెడుతున్నాడని, వైఖరిని తమ పార్టీ నిక్కచ్చిగా తిప్పికొడుతుందని అభయ్ స్పష్టం చేశారు.


