హెచ్‌సీఏ స్కామ్‌లో దేవరాజ్‌ అరెస్ట్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 25: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) కుంభకోణంలో ఆ సంస్ధ జనరల్‌ సెక్రటరీ దేవరాజ్‌ను సీఐడీ శుక్రవారం అరెస్టు చేసింది. ఈ ఏడాది సమ్మర్‌ క్యాంపులు నిర్వహించినట్లు లెక్కలు చూపించి ఈ సంస్థ రూ.4 కోట్లు స్వాహా చేసిన విషయాన్ని సీఐడీ గుర్తించింది. దేవరాజ్‌ను పట్టుకునేందుకు ఆరు ప్రత్యేక బృందాలను సీఐడీ ఏర్పాటు చేసింది. హెచ్‌సీఏపై కేసు నమోదైన 17 రోజులకు మహారాష్ట్రలోని పుణెలో దేవరాజును అరెస్టు చేసింది. సీఐడీ అధికారులు దాదాపు 36 గంటలపాటు నిర్విరామంగా పనిచేసి పుణెలో దేవరాజును అరెస్టు చేశారు. ఈ 17 రోజులలో ఆయన దాదాపు ఏడు రాష్ట్రాల్లో పర్యటించినట్లు పోలీసులు గుర్తించారు. అరెస్టు అనంతరం ఆయనను హైదరాబాద్‌ తీసుకొచ్చి మల్కాజ్‌గిరి కోర్టులో హాజరుపరిచారు. కుంభకోణం వెలుగులోకి రాగానే ఉప్పల్‌ ఇన్‌స్పెక్టర్‌ సమాచారంతో దేవరాజు తప్పించుకున్న విషయం విదితమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *