-సెలెక్ట్ కమిటీకి పంపిన స్పీకర్
- బిల్లును వ్యతిరేకించిన బీజేపీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి
బిల్లు అత్యంత ప్రమాదకరం : బిజెపి ఎమ్మెల్యే ఏలేటి
ఈ బిల్లు అత్యంత ప్రమాదకరమని బిజెపి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. రాజకీయ కక్షసాధింపులకే హేట్ స్పీచ్ బిల్లు అన్నారు. అసెంబ్లీలో హేట్ స్పీచ్ ప్రివెన్షన్ బిల్లును సెలక్ట్ కమిటీకి స్పీకర్ గడ్డం ప్రసాద్ రిఫర్ చేశారు. ఈ సందర్భంగా ఏలేటి మాట్లాడుతూ ఆధారాలు లేకున్నా అరెస్ట్ చేసేలా బిల్లు ఉందని, చట్టాలు ప్రజల రక్షణ కోసం ఉండాలి.. ప్రజల గొంతు నొక్కడానికి కాదని విమర్శించారు. ఇలాంటి చట్టం చేసేముందు హౌస్ కమిటీ వేయాలని, చర్చ జరగాలని డిమాండ్ చేశారు. సెక్షన్ 4 అనేది ప్రజాస్వామ్యానికి డెత్ వారెంట్ అని,హేట్ స్పీచ్ బిల్లును వ్యతిరేకిస్తున్నామని తెలియజేశారు.
ప్రజాస్వామ్య గొంతుకను నొక్కేందుకే .. : కేటీఆర్ ధ్వజం
తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ (ప్రివెన్షన్) బిల్లుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ బిల్లును పౌర స్వేచ్ఛను హరించే ఒక క్రూరమైన ఆయుధంగా అభివర్ణించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రభుత్వం తన విమర్శకుల నోళ్లు మూయించేందుకే ఇటువంటి నిరంకుశ చట్టాలను తీసుకువస్తోందని మండిపడ్డారు. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య మూలాలకే ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక సామరస్యాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యతే అయినప్పటికీ, ఈ బిల్లులోని నిబంధనలు అత్యంత అస్పష్టంగా ఉన్నాయని ఆయన విమర్శించారు. అమలు యంత్రాంగం ఆధారాల కంటే అధికారుల వ్యక్తిగత అభిప్రాయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా ఈ బిల్లు రూపకల్పన జరిగింది. ఇది కచ్చితంగా దుర్వినియోగానికి దారితీస్తుంది అని పేర్కొన్నారు. బిల్లులో ఉపయోగించిన ‘వ్యతిరేక భావాలు ప్రేరేపించడం’, ‘సామాజిక సమగ్రతను దెబ్బతీయడం’ వంటి పదాలకు స్పష్టమైన న్యాయ పరిమితులు లేవని కేటీఆర్ ఎత్తిచూపారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలను లక్ష్యంగా చేసుకునేందుకే ఈ పదజాలాన్ని పొందుపరిచారని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాలను విమర్శిస్తే వాటిని ఫేక్ న్యూస్ గా ముద్ర వేసి జైలుకు పంపే ప్రమాదం పొంచి ఉందన్నారు. ‘శ్రేయా సింఘల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పును ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. కేవలం ప్రత్యక్ష హింసకు ప్రేరేపించే మాటలపైనే నియంత్రణ ఉండాలని, విమర్శ లేదా వ్యంగ్యం శిక్షార్హం కాదని కోర్టు స్పష్టం చేసిందని ఆయన తెలిపారు. ఈ పరిమితిని మించి చట్టాలు చేయడం ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని స్పష్టం చేశారు. ఏడు నుంచి పది సంవత్సరాల వరకు జైలు శిక్షలను ప్రతిపాదించడం ద్వారా ప్రజల్లో భయోత్పాతాన్ని సృష్టించాలని ప్రభుత్వం చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే దేశంలో హేట్ స్పీచ్‌పై తగినన్ని చట్టాలు ఉండగా అదనంగా ఈ చట్టం తీసుకురావడంలో ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు. వెంటనే ఈ బిల్లును పునఃపరిశీంచాలని, ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ అణచివేత ధోరణిని వీడాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




