మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ లక్ష్యం నెరవేరిందా ?

తాజాగా జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌విజయదుంధుబి మోగించింది. ప్రతిపక్షాలు సాధించుకున్న వోట్లతో పోలిస్తే కాంగ్రెస్‌ ‌ముందు వరుసలో నిలిచిందనడంలో అతిశయోక్తిలేదు. అయితే కాంగ్రెస్‌ ‌పార్టీ ఆశయం నెరవేరిందా అంటే మాత్రం కాదనే సమాధానం వొస్తుంది. ఈ ఎన్నికల్లో 90శాతం మున్సిపాలిటీలను సాధించుకుని తీరుతామని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బల్లగుద్ది మరీ చెప్పారు. కాని, శుక్రవారం వెలువడిన ఫలితాలు అందుకు భిన్నంగా రావడం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న కాంగ్రెస్‌ ‌శ్రేణుల్లో ఎక్కడో ఒకింత నిరాశ కనిపిస్తున్నది. సిఎం రేవంత్‌రెడ్డి చెప్పినట్లు 90శాతం స్థానాలు గెలుచుకున్నప్పుడే నిజమైన విజయమన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఎందుకంటే స్థానిక ఎన్నికలు ఏవి జరిగినా ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా రావడమన్నది సహజం. గతంలో బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్థానిక ఎన్నికల్లో స్వీప్‌ చేసిన విషయం తెలియంది కాదు.

కాని, తాజా ఎన్నికల ఫలితాలను పరిశీలించినప్పుడు ఇతర పార్టీలకన్నా కాంగ్రెస్‌ అ‌గ్రస్థానంలో నిలిచినప్పటికీ  ఆశించిన స్థాయిలో కాంగ్రెస్‌ వోట్లను రాబట్టుకోలేకపోయిందన్నది స్పష్టమవుతున్నది. ఇందుకు గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలుపర్చకపోవడం, మంత్రుల వ్యవహారశైలి, ముఖ్యమంత్రి హోదాను మరిచి రేవంత్‌రెడ్డి ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్‌ఎస్‌ అధినేత, ఇతర నేతలపై చేస్తున్న ఆరోపణలు వోటర్లపై వ్యతిరక భావన కలిగించి ఉంటుందనుకుంటున్నారు. అందుకే ఎన్నికల సంఘం ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా వెలువడిన ఫలితాలను బేరీజు వేసుకున్నప్పుడు కాంగ్రెస్‌ ఈ ఎన్నికల్లో 40 శాతానికి మించి వోట్లను సాధించుకోలేదన్నది స్పష్టమవుతున్నది. కాగా, రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ ‌కేవలం 74 స్థానాలను మాత్రమే కాంగ్రెస్‌ ‌గెలుచుకుంది. సుమారుగా 30 స్థానాల్లో హంగ్‌ ఏర్పడింది. ఈ స్థానాల్లో ఏ పారీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడం గమనార్హం. కొన్ని ప్రాంతాల్లో ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్‌ఎస్‌తో సమానమైన స్థానాలు రావడంతో కాంగ్రెస్‌ ఇం‌డిపెండెంట్‌ అభ్యర్ధులపై ఆధారపడాల్సి పరిస్థితి ఏర్పడింది. వారి మద్దతుకోసం విపక్షాలతోపాటు కాంగ్రెస్‌ కూడా తీవ్రస్థాయిలో పోటీపడుతోంది.

   ఇప్పటికే క్యాంపు రాజకీయాలు ఒక పక్క నడుస్తుండగా, రెండవవైపు ఎదుటిపక్షంలో గెలిచిన కార్పోరేటర్‌లను, కౌన్సిలర్‌లను ప్రలోభపెట్టడమో, కిడ్నాపు చేయడమో, పార్టీలో కలుపుకోవడంలాంటి చర్యలకు పాల్పడుతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. 15 మున్సిపల్టీలను సంపూర్ణమెజార్టీతో గెలుచుకున్న బిఆర్‌ఎస్‌ ఇప్పుడు హంగ్‌ ‌స్థానాపై దృష్టిపెట్టింది. ఎవరికీ సంపూర్ణ మెజార్టీ రాని ముప్పై స్థానాల్లో కనీసం పది నుంచి పదిహేను స్థానాలనైనా తమ ఖాతాలో వేసుకుంటామంటోంది బిఆర్‌ఎస్‌. ఈ ఎన్నికతో బిఆర్‌ఎస్‌ ‌పూర్తిగా భూ స్థాపితమవుతుందంటూ కాంగ్రెస్‌ ‌శ్రేణులు మొదటినుండి చెబుతున్నప్పటికీ, బిఆర్‌ఎస్‌ ‌మాత్రం తన ఉనికిని చాటుకుందనే చెప్పాలె. బిఆర్‌ఎస్‌ ‌పదవి కోల్పోయిన ఈ రెండేళ్ళకాలంలో తీవ్రాతి తీవ్రస్థాయిలో కాంగ్రెస్‌ ‌చేస్తున్న దాటిని తట్టుకుని నిలబడిందనడానికి దాపు 772 వార్డులను గెలుచుకోవడమే ఇందుకు నిదర్శనం. అధికారం కోల్పోయినా ఇంకా ఆ పార్టీకి ప్రజల్లో పట్టు ఉందని చెప్పకనే చెప్పినట్లు అవుతుంది. అయితే ఏడింటిలో ఒక్క కార్పోరేషన్‌కూడా బిఆర్‌ఎస్‌ ‌గెలువలేకపోవడం గమనార్హం.
కార్పోరేషన్‌ల విషయానికొస్తే అధికార కాంగ్రెస్‌ ‌కార్పోరేషన్‌లపై పూర్తిస్థాయిలో పట్టు సాధించలేకపోయిందన్నది స్పష్టమవుతున్నది. ఏడు కార్పోరేషన్‌లలో కేవలం నాల్గింటితోనే సంతృప్తి పడింది. మిగిలిన మూడింటిలో బిజెపి రెండింటిలో కాషాయ జండా ఎగురవేయడానికి సిద్దంగా ఉండగా, కొత్తగూడంలో మిత్రపక్షమైన సిపిఐ ఎర్రజండా ఎగురవేసే ప్రయత్నం చేస్తున్నది. బిజెపి జాతీయ పార్టీ అని దానికి స్థానిక ఎన్నికలతో సంబంధమేంటని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన ప్రచారంలో తీవ్రస్థాయిలో విమర్శించినప్పటికీ• కరీంనగర్‌, ‌నిజామాబాద్‌లో ఆ పార్టీ తమ సత్తా చాటుకుంది. ఒక విధంగా ఈ ఎన్నికలతో బిజెపి తెలంగాణలో బలంగా ఎదుగుతున్నదనడానికి అస్కారం ఏర్పడింది. కరీంనగర్‌, ‌నిజామాబాద్‌తోపాటు కొత్తగూడెం కార్పోరేషన్‌ ‌మేయర్‌ ఎం‌పిక పెద్ద ప్రహసనంగా మారింది. క్షణక్షణానికి రాజకీయం మారుతుండడంతో చివరన గద్దెనెక్కేదెవరన్నది అయోమయంగా మారింది.
అయితే  ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో మూడు ప్రధాన ధోరణులను స్పష్టం చేస్తున్నాయి: అధికార కాంగ్రెస్ పార్టీ తన సంక్షేమ పథకాల ద్వారా పట్టణ పేద మరియు మధ్యతరగతి వర్గాలను  ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది . బిఆర్ఎస్  అధికారం కోల్పోయినా పార్టీ పునాదులు పటిష్టంగానే ఉన్నాయి.  ప్రత్యామ్నాయం కోసం పోరులో బీజేపీ ఇంకా రాష్ట్రవ్యాప్త శక్తిగా ఎదగడానికి క్షేత్రస్థాయిలో మరింత కష్టపడాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *