– ఆటో కార్మికుల కుటుంబాలకు బీమా భద్రత
– ఇప్పటివరకు 18 కుటుంబాలకు ₹36 లక్షల బీమా
– తాజాగా రెండు కుటుంబాలకు ₹4 లక్షల చెక్కులు
– సొంత ఇంటిని తనఖా పెట్టి కార్మికులకు అండ
సిద్దిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25 : సిద్దిపేట అభివృద్ధికి ఆటో కార్మికులే నిజమైన బ్రాండ్ అంబాసిడర్లు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్న ఆటో కార్మికుల శ్రేయస్సే లక్ష్యంగా ‘ఆటోవాలాలకు హరీష్ అన్న ఆత్మీయ భరోసా’ పేరుతో ఏర్పాటు చేసిన ఆటో క్రెడిట్ కో–ఆపరేటివ్ సొసైటీ ద్వారా కార్మికుల కుటుంబాలకు ఆయన పెద్దన్నగా నిలుస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో అప్పుల ఊబిలో చిక్కుకుని ఆటోలను కుదవపెట్టే పరిస్థితుల్లో ఉన్న కార్మికులకు అండగా ఉండాలన్న సంకల్పంత, హరీష్ రావు తన ఇంటి స్థలాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి ఈ సొసైటీని ఏర్పాటు చేయడం విశేషం. ఈ సొసైటీ ద్వారా కార్మికులకు అవసరమైనప్పుడు ఆర్థిక సహాయం అందేలా చేయడంతోపాటు ప్రమాదవశాత్తు ఆటో కార్మికుడు మృతిచెందితే ₹4 లక్షల ఇన్సూరెన్స్, సహజ మరణానికి బీమా వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. సొసైటీ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 18 మంది ఆటో కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹2 లక్షల చొప్పున మొత్తం ₹36 లక్షలు బీమా చెక్కుల రూపంలో అందజేశారు. కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోయిన వేళ, ఆర్థికంగా నిలదొక్కుకునేలా కార్మికుల కుటుంబాలకు హరీష్ అన్న అండగా నిలుస్తున్నారు. ఈ కో–ఆపరేటివ్ సొసైటీ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తోంది. ఇటీవల మృతిచెందిన ఆటో కార్మికుల కుటుంబాలకు బుధవారం సాయంత్రం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో చెక్కులు అందజేశారు. సిద్దిపేట అర్బన్ మండలం బూరుగుపల్లికి చెందిన ఆటో డ్రైవర్ సడిమేల రాజు రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా, నారాయణరావుపేట మండలం కోదండరావుపల్లి గ్రామానికి చెందిన గ్యాదపాక రమేష్ మృతిచెందారు. ఈ రెండు కుటుంబాలకు ఆటో క్రెడిట్ కో–ఆపరేటివ్ సొసైటీ ద్వారా ₹2 లక్షల చొప్పున చెక్కులు హరీష్ రావు అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చిన ఆయన పిల్లల చదువు, వారి భవిష్యత్తు బాధ్యతను నేను చూసుకుంటాను అంటూ భరోసా ఇచ్చారు. ఆటో కార్మికుల కష్టాన్ని అర్థం చేసుకుని బీమా, భద్రతతో అండగా నిలుస్తున్న ‘హరీష్ అన్న ఆత్మీయ భరోసా’ సేవలు సిద్దిపేట ఆటో కార్మికులకు కొండంత అండగా నిలుస్తున్నాయని ఆటోవాలాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
———————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





