– వచ్చిన ఆదాయం నుంచి ‘స్థానిక’ వాటా సర్దుబాటు
– అసెంబ్లీ వాయిదా సమయంలోనూ ప్రజాసేవలోనే ఉన్నాం
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టీకరణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23: రాష్ట్రంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం తగ్గిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అసెంబ్లీని, రాష్ట్ర ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని, ఆయన చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు రూ.14,250 కోట్ల ఆదాయం సమకూరిందని, ఈ ఆదాయం నుంచి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు వాటాగా రూ.5,740 కోట్లను ప్రభుత్వం సర్దుబాటు (అడ్జస్ట్) చేసిందని చెప్పారు. గత ప్రభుత్వం 2020 నుంచి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా వచ్చిన ఆదాయాన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు బదిలీ చేయకుండా కాలయాపన చేసి ఆ నిధులను మొత్తంగా స్టాంప్ డ్యూటీ ఆదాయంగానే తప్పుడు లెక్కలు చెప్పిందని విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన తప్పును పునరావృతం చేయకూడదని, స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయరాదనే ఉద్దేశంతోనే తమ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల ఆదాయం నుంచి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నిధులను కేటాయించిందన్నారు. అసెంబ్లీని టీ బ్రేక్ పేరుతో రెండున్నర గంటలపాటు వాయిదా వేశామని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన విమర్శల్లో అర్థం లేదన్నారు. సభ వాయిదా పడినప్పటికీ తాము ఎక్కడికీ వెళ్ళలేదని, అసెంబ్లీ ప్రాంగణంలోనే ఉండి విధులను నిర్వర్తించామని చెప్పారు. ఈ ప్రజా ప్రభుత్వం ప్రజలు, ఉద్యోగుల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తుందని, దేశంలో ఎక్కడా లేని విధంగా విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాల కోసం ఈ బడ్జెట్‌లో రూ.1.20 కోట్ల ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టామని, సింగరేణి, విద్యుత్ సంస్థల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసిన ఈ పథకం కింద తాజాగా ఎస్పీడీసీఎల్ పరిధిలోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన అసిస్టెంట్ లైన్‌మన్ ఓర్సు సురేష్, మహబూబ్‌నగర్‌కు చెందిన ముక్తార్ బేగ్ కుటుంబాలకు ప్రమాద బీమా చెక్కులను పంపిణీ చేశామని వివరించారు. ఉద్యోగులకు నమ్మకాన్ని, భరోసాను కల్పించేందుకే ఈ కార్యక్రమాన్ని అసెంబ్లీ హాల్‌లోనే నిర్వహించామన్నారు. సభ వాయిదా పడిన సమయంలోనూ తాము బాధ్యతాయుతమైన పనుల్లోనే ఉన్నామన్న విషయాన్ని విపక్ష సభ్యులు గమనించాలన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




