– నత్తనడకన వరంగల్ సూపర స్పెషాలిటీ నిర్మాణం
– అసెంబ్లీలో మైక్ కట్ చేయకుండా చర్చించడానికి సిద్దం
– వరంగల్ హాస్పిటల్ నిర్మాణాలను పరిశీలించిన ఎమ్మెల్యే హరీష్ రావు
వరంగల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో దేవాదుల నుంచి ఒక్క ఎకరా భూమినీ సేకరించలేదని, సాగునీరూ అందించలేదని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. మంత్రుల మాటలకు, సీఎం మాటలకు పొంతన లేదన్నారు. ఈ ప్రభుత్వానికి డేట్‌లు, డెడ్‌లైన్‌లు మాత్రమే మారుతున్నాయని హరీశ్ రావు అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి విరుచుకుపడ్డారు. మంగళవారం వరంగల్‌లో నిర్మాణంలో ఉన్న 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను మాజీ మంత్రి పరిశీలించారు. అనంతరం ఆయన డియాతో మాట్లాడుతూ.. దేవాదుల ప్రాజెక్ట్‌ను తాము సందర్శించిన వెంటనే సీఎం రివ్యూ చేశారని.. తాము తట్టిలేపితేనే సీఎం నిద్ర లేస్తున్నారని వ్యాఖ్యానించారు. దేవాదుల ప్రాజెక్ట్ మొదటి ప్రాధాన్యమని చెబుతూనే పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. గోదావరి నీళ్లను పొలాలకు మళ్లించింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని.. కాంగ్రెస్ ఏ చేయలేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పేర్కొన్నారు. అసెంబ్లీలో కెమెరా తిప్పకుండా, మైక్ కట్ చేయకుండా చర్చించే దమ్ము సీఎంకు ఉందా అని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. దేవాదుల ప్రాజెక్ట్‌లో 90 శాతం పనులు పూర్తయ్యాయని, 10 శాతం మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని.. త్వరలో పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పేదల కోసం కేసీఆర్ హెల్త్ సిటీ నిర్మిస్తే.. రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం రేవంత్ రెడ్డిదని.. పేదల కోసం పనిచేసే ఆలోచన కేసీఆర్‌ది అని ఆరోపించారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిపై నిర్లక్ష్యం చేయవద్దని హరీశ్ రావు అన్నారు. కేసీఆర్‌కు పేరు వస్తుందని పనులు చేయట్లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యం కారణంగా ఆసుపత్రి ప్రారంభం కావట్లేదని విమర్శించారు. రెండేళ్లు ఓపిక పట్టామని.. ఇక నిలదీస్తామని, గల్లా పట్టి అడుగుతామని హెచ్చరించారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే బీఆర్‌ఎస్ నిరసన దీక్షలకు దిగుతుందని వార్నింగ్ ఇచ్చారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఏడాదిన్నరగా గుండె శస్త్ర చికిత్సలు ఆగిపోయాయని తెలిపారు. ఎంజీఎంలో 3 ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు పెట్టామని, ఇప్పుడు ఒక్కటి కూడా పనిచేయట్లేదని ఆయన విమర్శలు గుప్పించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.