– పాఠశాలల్లో విద్యార్థులకు పట్టెడన్నం పెట్టలేరా?
– పిల్లల పాలిట ’పాయిజన్ 2047’గా మారాడు
– మెస్సీతో ఫుట్‌బాల్ విూదున్న ధ్యాస పిల్లల విూద లేదే
– సీఎం రేవంత్‌పై హరీష్ రావు ఆగ్రహం
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబరు 13: పేద పిల్లల విూద ముఖ్యమంత్రి పగబట్టాడని, రెండేళ్లలో 116 మంది పిల్లలను పొట్టన పెట్టుకున్నాడని సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఇంతమంది విద్యార్థులు చనిపోతున్నా రేవంత్ రెడ్డికి కనీసం చీమకుట్టినట్లయినా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పిల్లల పాలిట ’పాయిజన్ 2047’గా మారాడని, రెండేండ్ల పాలనలో స్కూలు విద్యార్థులకు కనీసం పట్టెడన్నం పెట్టలేకపోతున్నాడంటూ మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా అట్టర్‌ప్లాప్ అయ్యాడని దుయ్యబట్టారు. ఫుడ్ పాయిజన్ బారినపడి హైదరాబాద్ కింగ్ కోఠి దవాఖానలో చికిత్స పొందుతున్న బాగ్ లింగంపల్లి మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్‌లతో కలిసి హరీష్‌రావు శనివారం పరామర్శించారు. అనంతరం విూడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదో ఒక గురుకుల పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు కలుషిత ఆహారం తిని హాస్పిటల్ పాలవుతున్నారు. మొన్న శావిూర్‌పేట బీసీ గురుకుల పాఠశాలలో అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ఏకంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లే పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విద్యార్థులే ఫిర్యాదు చేశారు. నిన్న మాదాపూర్‌లోని చందునాయక్ తండాలో మధ్యాహ్న భోజనం వికటించి 43 మంది పిల్లలు దవాఖానలో చేరారు. ఇప్పుడు ముషీరాబాద్ నియోజకవర్గంలో బాగ్ లింగంపల్లి మైనార్టీ గురుకులంలో కలుషిత ఆహారం తిని 90మంది హాస్పిటల్ పాలయ్యారని తెలిపారు. రేవంత్ రెడ్డి విజన్ 2047 అని డబ్బా కొట్టుకుంటున్నాడు.. ఇది విజన్ 2047 కాదు.. విద్యార్థుల పాలిట పాయిజన్ 2047గా మారింది.. రేవంత్ రెడ్డి పిల్లల పాలిట పాయిజన్ 2047గా మారిండు.. అని వ్యాఖ్యానించారు. నీకు నిజాయతీ ఉంటే గురుకులాల్లోని పిల్లలకు కడుపునిండా అన్నం పెట్టు. డిమాండ్ చేశారు. అస్వస్థతకు గురైన విద్యార్థులు తిరిగి మళ్లీ హాస్టల్‌కి వెళ్ళము అని భయంతో చెబుతున్నారు. ప్రభుత్వ హాస్టళ్లలో పిల్లలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. కేసీఆర్ హయాంలో సన్న బియ్యంతో నాణ్యమైన ఆహారం విద్యార్థులకు అందేది. ఇప్పుడు దొడ్డు బియ్యం పెడుతున్నారు.. అన్నం ఉడకడం లేదు.. సరైన భోజనం పెట్టట్లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఫుట్‌బాల్ ఆడడంలో ముఖ్యమంత్రి బిజీగా ఉంటాడు.. మెస్సితో ఫుట్‌బాల్ ఆడటానికి మేస్త్రి కోట్లు ఖర్చు చేస్తున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో దాదాపు 300మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే రాహుల్ గాంధీ రాడు. 160మంది ఆటో డ్రైవర్లు చనిపోతే రాడు. 116 మంది విద్యార్థులు చనిపోతే రాడు. 42 శాతం రిజర్వేషన్ కోసం బీసీలు పోరాటం చేస్తున్నా రాడు. రాష్ట్రంలో ఎన్ని సమస్యలున్నా ముఖం చాటేసి ఈరోజు ఫుట్‌బాల్ మ్యాచ్ చూడటానికి వస్తున్నాడు. రాహుల్ గాంధీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వచ్చి రేవంత్ రెడ్డి ఆడే ఫుట్‌బాల్ మ్యాచ్ చూసి పరవశిస్తాడంట. కలుషిత ఆహారంతో కడుపునొప్పి భరించలేక ఏడుస్తున్న విద్యార్థుల కన్నీళ్లు చూడు రాహుల్ గాంధీ అని హరీష్ నిలదీశారు. విద్యార్థులకు పాడైన భోజనం పెట్టి వారి ప్రాణాలతో చెలగాటమాడుతారా అని ఎమ్మెల్యే ముఠాగోపాల్ మండిపడ్డారు. విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యత విషయంలో నిర్లక్ష్యం తగదన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించే లక్ష్యంతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి సకల వసతులు కల్పించిందని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ పాలనలో ఏనాడూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను, విద్యార్థులను పట్టించుకోకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతున్నాయని మండిపడ్డారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





