కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు ముఖ్యం కాదు

– వాటికి నిధులు, సిబ్బందిని ఇవ్వాలి
– ఆఖరుకు ఫైనాన్స్‌ కమిషన్‌ డబ్బులు కూడా రావట్లే
– మున్సిపల్‌ సవరణ బిల్లుపై చర్చలో హరీష్‌రావు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 31: ఎన్ని మున్సిపాలిటీలు ఏర్పాటు చేశాం అన్నది ముఖ్యం కాదు.. మున్సిపాలిటీలను ఎంతమేరకు అభివృద్ధి చేశాం, వాటికి నిధులు ఇస్తున్నారా లేదా అనేది ముఖ్యం అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రభుత్వానికి చురకలంటించారు. మున్సిపల్‌ సవరణ బిల్లుపై అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ కొన్ని మున్సిపాలిటీలలో గ్రామ పంచాయతీలను చేరుస్తూ గతంలో జారీ చేసిన ఆర్డినెన్సుకు సంబంధించిన బిల్లుకు పూర్తిగా మద్దతిస్తున్నామన్నారు. సిద్దిపేటలో మున్సిపాలిటీ ఉంది.. 1.20లక్షల ఓట్లు ఉంటాయి.. కనీసం ఫాగింగ్‌కి కూడా డబ్బులు ఇవ్వని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు నెలనెలా పట్టణ ప్రగతి కింద మున్సిపాలిటీలకు నిధులు ఇచ్చేవాళ్లమన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చి 22 నెలలు అవుతోంది.. మున్సిపల్‌ శాఖ ముఖ్యమంత్రి వద్దనే ఉంది.. ఇప్పటివరకు పట్టణ ప్రగతి కింద ఈ ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు.. ఎన్నికలు జరగలేదని ఫైనాన్స్‌ కమిషన్‌ డబ్బులు కూడా రావడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ వస్తే ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్‌ చేస్తామన్నారు. నో ఎల్‌ఆర్‌ఎస్‌, నో బీఆర్‌ఎస్‌ అన్నారు.. ఇప్పుడేమో ఎల్‌ఆర్‌ఎస్‌ డబ్బులు బరాబర్‌ కట్టాలని ప్రజల నుంచి వసూలు చేస్తున్నారు.. దీంతో నో ఎల్‌ఆర్‌ఎస్‌.. నో కాంగ్రెస్‌ అని ప్రజలు అనే రోజు వస్తుంది అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎల్లారెస్‌పై వచ్చిన డబ్బులను మున్సిపాలిటీలకు, పట్టణాలకు ఎప్పటిలోగా ఇస్తారు అని ఆయన ఆర్థిక మంత్రి భట్టిని ప్రశ్నించారు. స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ద్వారా మున్సిపాలిటీలో ఎన్ని రిజిస్ట్రేషన్లు అయితే అందులో కొంతమేరకు ఆ పట్టణ అభివృద్ధి సంస్థకు ఇవ్వాలి. రిజిస్ట్రేషన్‌ డబ్బు, ఎల్‌ఆర్‌ఎస్‌ డబ్బును పట్టణ ప్రగతి ఇవ్వకుంటే మున్సిపాలిటీలు ఎట్ల నడవాలి అధ్యక్షా అని హరీష్‌రావు ప్రశ్నించారు. కొత్త మున్సిపాలిటీలో స్టాఫ్‌ లేదు. ప్లానింగ్‌ లేదు. కేవలం కొత్తవి ఏర్పాటు చేసుకుంటూపోతే మున్సిపల్‌ పాలన నిర్వీర్యమైపోతుందన్నారు. కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటుకు అనుకూలంగా కొత్త నియమకాలు, ఉద్యోగ నియామకాలు జరుగుతున్నదా అని ప్రశ్నించారు. మంత్రి దామోదర్‌ ఆందోల్‌ ఎస్‌డీఎఫ్‌ నిధులు ఉంచుకొని ఇంకో పక్కన హెచ్‌డీఎఫ్‌సీ నిధులను రద్దు చేశారన్నారు. జహీరాబాద్‌, సంగారెడ్డి, పటాన్‌చెరు ప్రజలైనా తెలంగాణ ప్రజలే కదా.. పన్నులు కూడా కడుతున్నారు కదా.. ఎక్కడైతే గతంలో ఎస్‌డీఎఫ్‌ నిధులు కేటాయించారో వాటిని తిరిగి మంజూరు చేయాలని కోరుతున్నామన్నారు. బ్యాంకు నుంచి తెస్తారా.. ఎలా సేకకరిస్తారో చేయండి అని అన్నారు. అందోల్‌లో తమ ప్రభుత్వంలో టీయూఎఫ్‌ఐడీసీ సాంక్షన్‌ చేసిన పనులు అవుతున్నాయి.. పక్కన సంగారెడ్డి, జహీరాబాద్‌లలో కావడం లేదు.. సిద్దిపేట్‌ టు దుబ్బాక గజ్వేలులో బంద్‌.. మంత్రి పొన్నం ప్రభాకర్‌ నియోజకవర్గంలో మాత్రం పనులు నడుస్తున్నాయి అని హరీష్‌రావు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *