ప్రాణాలు పోతుంటే మూసీపై స‌మీక్ష‌లా?

– ముఖ్యమంత్రిపై హరీష్‌రావు విసుర్లు
– రాజాపేట, బూరుగుపల్లి ప్రాంతాల్లో పర్యటన

మెదక్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 28: మెదక్‌ జిల్లా ముంపు గ్రామాల్లో స్థానిక నాయకులతో కలిసి మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌ రెడ్డిల బృందం గురువారం పరిశీలించింది. మెదక్‌, కామారెడ్డి జిల్లాలు వరదలో చిక్కుకుని ప్రజలు ఇబ్బంది పడుతుంటే ముఖ్యమంత్రి మాత్రం మూసీ సుందరీకరణ, ఆటల పోటీల అంశంపై సమీక్షలు చేస్తున్నారని హరీష్‌రావు విమర్శించారు. అత్యవసరమైతే తప్ప హెలికాప్టర్‌ వాడలేమని ఓ మంత్రి అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బూరుగుపల్లిలో తెగిపోయిన రోడ్లను పరిశీలించారు. రాజాపేట వరదల్లో చిక్కుకొని ఇద్దరు కరెంటు పోల్‌ ఎక్కి నాలుగైదు గంటలుగా సహాయం కోసం ఎదురుచూశారని, హెలికాప్టర్‌ పంపి ఉంటే వాళ్ళు ప్రాణాలతో బయటపడేవారని తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని, నష్టపోయిన పంట పొలాలకు ఎకరానికి రూ.25వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆ ఇద్దరూ గల్లంతైన ప్రాంతాన్ని హరీష్‌రావు పరిశీలించారు. వరదలో చిక్కుకుని చనిపోయిన సత్యం కుటుంబాన్ని బృందం పరామర్శించింది. అనంతరం హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రోమ్‌ తగలబడుతుంటే ఫిడేల్‌ వాయించినట్లు ఉంది రేవంత్‌ రెడ్డి తీరు అని ఎద్దేవా చేశారు. భారీ వర్షాలు, వరదలతో సగం తెలంగాణ ఆగమాగం అవుతుంటే రేవంత్‌ రెడ్డి జూబ్లీహిల్స్‌ ప్యాలెస్‌లో కూర్చొని నిన్న మూసీ సుందరీకరణ మీద, నేడు స్పోర్ట్స్‌ మీద సమీక్షిస్తున్నాడన్నారు. హెలికాప్టర్లు సకాలంలో పంపి ఉంటే బూరుగుపల్లిలో ఇద్దరి ప్రాణాలు పోయేవి కావవన్నారు. పెళ్లిళ్లకు హెలికాప్టర్లు వాడతారు కానీ, ప్రజల ప్రాణాలు కాపాడడానికి హెలికాప్టర్లు వాడరా అని ప్రశ్నించారు.. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడంలేదని హరీష్‌రావు నిలదీశారు.


 

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్‌ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్‌ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్‌ చానల్‌ను సబ్‌ స్క్రైబ్‌ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్‌ చేయడం మరిచిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *