– ఇద్దరి మధ్య రహస్య ఒప్పందం
– ఏ ధైర్యంతో బనకచర్ల కడతామంటారు?
– గురుదక్షిణ చెల్లించుకుంటున్న రేవంత్
– కేంద్ర సంస్థలు డీపీఆర్‌ను ఎందుకు తిప్పి పంపాయి?
– విరుచుకుపడ్డ మాజీ మంత్రి హరీష్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 1: రేవంత్ రెడ్డి పెదవులు మూసుకోవడం వల్ల చంద్రబాబు ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్లు అయ్యిందని మాజీ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం విలేకర్లతో మాట్లాడుతూ లోపాయికారీగా ఒప్పందం చేసుకొని ప్రాజెక్టు కోసం రేవంత్‌రెడ్డి సహకరిస్తున్నాడని ఆరోపించారు. దిల్లీలో పవర్ ఉంది అని లోకేష్ ప్రాజెక్టు కట్టి తీరుతం అంటున్నారు.. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు.. సీఎం, మంత్రులు ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. మీరు లోపాయికారీ ఒప్పందం చేసుకున్నరు. చీఫ్ సెక్రటరీ ఏమో బనకచర్ల అంశం మీద చర్చకు రాము అని రాస్తడు.. రేవంత్ ఏమో బనకచర్ల అంశం ఉన్నప్పటికీ పాల్గొని కమిటీ వేసేందుకు ఒప్పుకొని వస్తడు.. ఏ దైర్యం చూసుకొని లోకేష్ బనకచర్ల కట్టి తీరుతామని మాట్లాడుతున్నాడని హరీష్‌రావు ప్రశ్నించారు. బనకచర్లపై చంద్రబాబు బుల్డోజ్ విధానానికి బిజేపీ, కాంగ్రెస్ ల మౌనమే కారణమన్నారు. వీరు సహకరించడం వల్లనే అంత దైర్యంగా ప్రకటిస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి మాత్రం బనకచర్ల కడుతలేరు అంటడు. ఎజెండాలో లేదు అంటడు, కడుతం అంటే కదా అడ్డు చెప్పేది అంటడు. రేవంత్ రెడ్డి గురుదక్షిణ చల్లించుకునే పనిలో పడ్డడన్నారు. రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్, బిజేపీ డూడూ బసవన్న లాగా తలూపుతున్నరు. అందుకే దైర్యంగా మాట్లాడుతున్నారన్నారు. రేవంత్ గురుదక్షిణలో భాగంగా చంద్రబాబు మెప్పు కోసం, దిల్లీ మెప్పు కోసం ప్రయత్నం చేస్తాడు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదన్నారు. లోకేష్ అవగాహన లేకుండా మాట్లాడాడు, అధికారం ఉందని, మంద బలం ఉందని మాట్లాడటం పొరపాటన్నారు. మిగులు జలాలు అనేవి నిజంగా ఉంటే పోలవరం అథారిటీ, గోదావరి బోర్డు, సిడబ్లుసి, ఎన్విరాన్ మెంట్ సంస్థలు ఎందుకు బనకచర్ల డిపిఆర్ ను తిరస్కరించాయి? నాలుగు కేంద్ర సంస్థలు బనకచర్లను తిప్పి పంపింది నిజం కాదా? మిగులు జలాలు ఉన్నాయని ఎవరు చెప్పారు? ఉంటే ఏపీకి ఎన్ని, తెలంగాణకు ఎన్ని కేటాయించారో చెప్పు అని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, ఎత్తిపోతలకు పొక్క కొట్టుడో, చిల్లు కొట్టుడో ఉండదు. ఆనాడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మౌనంగా ఉండటం వల్ల తెలంగాణకు అన్యాయం జరిగింది. పోతిరెడ్డికి పొక్క పెట్టి నీళ్లు తీసుకుపోయారు.. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నట్లు నీళ్లు తీసుకుపోతా అంటే చూస్తు ఊరుకుంటామా? ఇక్కడ ఉన్నది బిఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ప్రయోజనాల కోసం పదవులను గడ్డి పోచలుగా వదులుకున్నోళ్లం. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయి. మీకు వివరాలు పంపిస్తా చూసుకోండి. అనుమతులు లేవు అని ఎలా అంటావన్నారు. ఎప్పుడు తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకోలేదని చెబుతున్న లోకేష్ ఇదే విషయం గురించి మీ నాన్నను అడగండి. ఒక్క కాళేశ్వరం వ్యతిరేకిస్తూ మీ నాన్న ఏడు ఉత్తరాలు రాసారు. మీరేమో వ్యతిరేకించలేదు అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇచ్చిన అనుమతులు నిలిపివేయండి, ప్రాజెక్టులు ఆపండి అని లేఖలు రాసారు. కాళేశ్వరం అనేది కొత్త ప్రాజెక్టు కాదు.. ప్రాణహితలో అంతర్భాగం, అందుకే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ వర్తించదు అని స్పష్టంగా కేంద్రం పేర్కొన్నది. కాళేశ్వరానికి అవసరమైన 11 రకాల అనుమతులు తీసుకున్నాం. కాళేశ్వరం మీద కుట్ర చేసి మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోయకుండా నీళ్లు ఏపీకి పోవాలి అనే కుట్ర చేస్తున్నట్లుంది. ఏపీలో అక్రమ ప్రాజెక్టులు కట్టి కృష్ణా నదిలో నీళ్లు మళ్లించినట్లు గోదావరి నీళ్లు మళ్లించాలనేది కుట్ర. ఆనాడు ఉమ్మడి ఏపీలో అనేక కుట్రలు జరిగాయని హరీష్‌రావు గుర్తు చేశారు. ఇప్పుడు బనకచర్ల కట్టి తీరుతాం అంటున్నారు. మీరు కట్టితీరుతాం అంటున్నారు, మేము అడ్డుకొని తీరుతాం అంటున్నాం. మీ ప్రాజెక్టులను అడ్డుకోవడం మా ఉద్దేశ్యం కాదు, మా హక్కుల గురించి మేం మాట్లాడుతున్నం. మా వాటా మాకు ఇవ్వండి గౌరవిస్తం, బుల్డోజ్ చేస్తం అంటే సహించేది లేదు. కేసీఆర్ కాళేశ్వరం కోసం మహారాష్ట్రకు వెళ్లి గవర్నర్, అక్కడి సీఎం ను కలిసారు. మూడుసార్లు వెళ్లి ఒప్పించి మెప్పించారు.. కాళేశ్వరం కట్టారు. సముద్రంలో కలిసే నీళ్లు కదా అంటున్న లోకేష్ గారు.. ఉమ్మడి ఏపీ ఉన్నపుడు 968 టీఎంసీలను తెలంగాణకు వాటాగా కేటాయించారు. విభజన బిల్లు, శ్రీకృష్ణ కమిటీ అన్నింట్లో ఈ వాటా పేర్కొన్నరు. ఇందుకు లోబడి కడుతున్న ప్రాజెక్టులను ఎందుకు ఏపీ ప్రభుత్వం అడ్డుకుంటున్నది. ఉమ్మడి ఏపీలో ఇచ్చిన 968 పరిధిలో కట్టిన ప్రాజెక్టులను అడ్డుకుంటున్నరు, మరి బనకచర్ల ఎట్ల కడుతున్నరు.. మా నోరు కొడతాం అంటే మాకు హక్కులు లేవా, మేం ఎందుకు ఊరుకోవాలె? సూటిగా లోకేష్డును గుతున్నా. 968 టిఎంసీలను అంగీకరించండి. దాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రానికి రాసిన లేఖలను విత్ డ్రా చేసుకోండి అని హరీష్‌రావు అన్నారు.
గోదావరి నీళ్లు కృష్ణాకు మళ్లిస్తే ట్రిబ్యునల్ నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన 155 టిఎంసీలు మాకు ఇస్తమని ఒప్పుకోండి. 1480 టిఎంసీల కంటే ఎక్కువ ఉన్న నీటిని 65:35 ప్రకారం వాటా లెక్క తేల్చాలి. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చ గొడుతున్నారు అన్నడు లోకేష్. గోదావరి నదిలో మా వాటా మాకు కావాలె అంటున్నడు, మిగులు జలాల లెక్క తేలాలి అంటున్నం. మీ నాన్న బాబ్లీ మీద కొట్లాడారు, ఆల్ మట్టి మీద కొట్లాడారు. మీ నాన్న ఆరోజు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టినట్లా? విశాఖ ఉక్కును కాపాడుకున్నం రెండుసార్లు అంటున్నడు, విశాఖ ఉక్కుకు బనకచర్లకు చాలా తేడా ఉంది. విశాఖ ఉక్కుకు బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా మద్దతు తెలిపింది. బనకచర్లతో తెలంగాణ నీటి హక్కుల ప్రయోజనాలకు దెబ్బ పడుతున్నది. కేసీఆర్ చంద్రబాబు, జగన్ లను కలిసి మిగులు జలాల్లో వాటా ఉపయోగించుకొని, రెండు రాష్ట్రాలకు వాడుకుందామని చెప్పారు. మీరు చేస్తున్నది బుల్డోజింగ్ రాజకీయం. తెలంగాణకు ప్రయోజనం లేకుండా ఏకపక్షంగా బనకచర్ల కడతం అంటున్నరు. మా వాటా తేలాలి కదా, మా లెక్క తేలాలి కదా. ఒకవైపు ప్రాజెక్టులను అడ్డుకుంటరు, మరోవైపు 968 టిఎంసీలను వ్యతిరేకిస్తారు.
సుప్రీం కోర్టుకు వెళ్లి అయినా సరే కేసీఆర్, బిఆర్ఎస్ తెలంగాణ హక్కులను కాపాడుతుంది. హరీష్‌రావు అనుమతులు తెచ్చుకునే పద్ధతి మీకు తెలిస్తే, ఆపే పద్దతి కూడా మాకు తెలుసు. గోదావరి బనకచర్ల ద్వారా గోదావరి నీళ్లు మాత్రమే కాదు, కృష్ణా నీళ్లను కూడా తరలించుకునే కుట్ర ఉంది. ఈ విషయం చంద్రబాబు నాయుడే చెప్పిండు. కట్టి తీరుతాం అంటే అడ్డుకొని తీరుతాం. అనుమతులు తెచ్చుడు మీకు తెలిస్తే ఆపడం మాకు తెలుసు. 8 మంది కాంగ్రెస్, 8 మంది బిజేపీ ఎంపీలు ఉండి అడ్జర్నమెంట్ మోషన్ ఇచ్చి ఎందుకు బనకచర్ల మీద నిలదీయడం లేదు? ఎంపీలు ఉన్నది ఎందుకు? తెలంగాణ హక్కులు కాలరాయడానికా, కాపాడడానికా? అవసరం అయితే సర్వోన్నత న్యాయస్థానం వెళ్తం, హక్కులు కాపాడుకుంటమని హరీష్‌రావు హెచ్చరించారు.




