– ముఖ్యమంత్రికి హరీష్‌రావు హితవు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 30: స్థానిక ఎన్నికల్లో లబ్ధి కోసం పాదయాత్ర చేయడం కాదు.. గురుకుల విద్యార్థుల పాదయాత్రపై దృష్టి సారించాలంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీష్‌రావు కాంగ్రెస్‌కు హితబోధ చేశారు. దిగజారుతున్న గురుకుల వ్యవస్థను కాపాడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలంటూ అలంపూర్ గురుకుల విద్యార్థులు చేస్తున్న పాదయాత్రపై ఈమేరకు స్పందించారు. ప్రశ్నించిన వారిపై, ప్రతిపక్షాలపై జులుం ప్రదర్శించే రేవంత్ అనుముల.. తమ సమస్యలు పరిష్కరించాలంటూ పాదయాత్ర చేస్తున్న ఈ గురుకుల విద్యార్థులకు ఏమని సమాధానం చెబుతావు అని నిలదీశారు. పరిపాలనను గాలికి వదిలేసి అనునిత్యం రాజకీయాలు చేసే రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి గురుకుల విద్యార్థుల గోస వినిపించకపోవడం అమానుషమన్నారు. తరగతి గదుల్లో ఉండాల్సిన భావిభారత విద్యార్థులను నడిరోడ్డు ఎక్కించిన దుర్మార్గపు చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. చదువుకోవాల్సిన పిల్లలు పట్టెడన్నం కోసం, తాగు నీటి కోసం పాదయాత్రలు చేసే దుస్థితి కల్పించింది నీ అసమర్ధ పాలన అని దుయ్యబట్టారు. న్యాయం చేయాలి అన్నందుకు పోలీసులను పెట్టి బలవంతంగా డీసీఎంలలో విద్యార్థులను తరలించిన నీచమైన చరిత్ర ఈ ఇందిరమ్మ రాజ్యానిది. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లు, సమస్యలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ నివేదిక అడిగినా ప్రభుత్వంలో చలనం కలగదా అంటూ రేవంత్ రెడ్డీ.. ఇప్పటికైనా కళ్ళు తెరువు.. మీ పాలనలో రోజురోజుకీ పతనమవుతున్న గురుకుల వ్యవస్థను గాడిన పెట్టు అని పిలుపునిచ్చారు. జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ చౌరస్తా నుంచి పాదయాత్రగా వెళ్లి జిల్లా కలెక్టర్‌కు విద్యార్థులు ఇవ్వాలనుకున్న ఫిర్యాదుకు తక్షణం పరిష్కారం చూపించు.. అని అన్నారు.



