– కృష్ణా నీటిని రాయలసీమకు తరలించే ఎత్తులు
– కృష్ణా, గోదావరి జలాలపై మరోమారు ఉద్యమిస్తాం
– బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం సమావేశంలో ఎమ్మెల్యే హరీష్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 26: సీఎం రేవంత్‌రెడ్డికి నిద్రలో కూడా కేసీఆర్ గుర్తుకు వస్తున్నారని, అందుకే ఆయన పేరును పదేపదే ప్రస్తావిస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్ మల్లాపూర్‌లోని ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన సదస్సులో గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు వల్ల కలిగే నష్టంపై ప్రజంటేషన్ ఇచ్చారు. ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలు, భవిష్యత్ కార్యాచరణపై బీఆర్‌ఎస్వీ నేతలకు హరీష్‌రావు దిశానిర్దేశం చేశారు. ‘రేవంత్‌రెడ్డి ఏనాడూ జై తెలంగాణ అనలేదు.. ఉద్యమ గుర్తులు, చరిత్ర చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారు.. రేవంత్‌రెడ్డి పాలనలో నీళ్లు ఆంధ్రాకు, నిధులు దిల్లీకి వెళ్తున్నాయి.. కాంగ్రెస్, బీజేపీ, చంద్రబాబు కలిసి రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నార’ని ధ్వజమెత్తారు. గురుశిష్యులు కలిసి తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు. కేసీఆర్ నేతృత్వంలో మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని, అసవరమైతే బీఆర్‌ఎస్ తరఫున సుప్రీంకోర్టుకు వెళ్తామని హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణకు రావాల్సిన 967 టీఎంసీలను కూడా ఏపీ వ్యతిరేకిస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ రాసిన లేఖలను ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వరద జలాలు అంటున్నాడని లెక్క తేలకుండా వాటిని ఎలా తీసుకెళ్తావని చంద్రబాబుపై హరీష్‌రావు మండిపడ్డారు. నీళ్లు నిండుగా ఉంటే గోదావరిపై తెలంగాణ ప్రాజెక్టులను ఎందుకు వ్యతిరేకించావని చంద్రబాబును హరీష్ రావు నిలదీశారు. కచ్చితంగా బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కేసీఆర్ 2020లోనే కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు లేఖ రాశారని.. సముద్రంలో కలుస్తున్న 3000 టీఎంసీల గోదావరి జలాల్లో తెలంగాణకు 1950 టీఎంసీలు కేటాయించాలని కోరారని హరీష్ రావు తెలిపారు. హైదరాబాద్ నీటి అవసరాలు, పరిశ్రమల కోసం వాటిని వినియోగించుంటామని లేఖలో పేర్కొన్నారని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు 400 టీఎంసీలు వినియోగించుకునేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ లెక్క తేలకుండా బనకచర్ల ప్రాజెక్టు ఎట్లా కడతావని రేవంత్ రెడ్డి అడగాలి కదా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ వాటాలో చుక్క నీటిని వదలుకోమని స్పష్టం చేశారు. దీనిపై గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో యూనివర్సిటీల్లో అవగాహన కల్పించారని తెలిపారు. పోతిరెడ్డి పాడు వెనుక కాంగ్రెస్ రెగ్యులటరే బనకచర్ల అని ఆయన స్పష్టం చేశారు. పోలవరం నుంచి 2 టీఎంసీల నీటిని తరలించేందుకే బనకచర్ల ప్రాజెక్టును తెరపైకి తెచ్చారన్నారు. గోదావరి నది ఏడు రాష్ట్రాల్లో ప్రవహిస్తుందని తెలిపారు. నదీ పరివాహక ప్రాంతాల ఆధారంగా ట్రిబ్యునల్ నీళ్ల పంపిణీ చేస్తుందని, ట్రిబ్యునల్ ఒక్కసారి నీటి కేటాయింపులు చేస్తే సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోలేదని పేర్కొన్నారు. 2018లో కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులు నిలిపివేయాలని చంద్రబాబు లేఖ రాశారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రాజెక్టులను చంద్రబాబు అడ్డుకున్నారని మండిపడ్డారు. అయినప్పటికీ ఖమ్మంలో భక్తరామదాసు ప్రాజెక్టు పది నెలల్లో పూర్తి చేశామని చెప్పారు. పాలేరు నియోజకవర్గానికి కేసీఆర్ సాగునీరు ఇచ్చారన్నారు. కల్వకుర్తి ప్రాజెక్టుకు 25 టీఎంసీలు సరిపోతలేదని 40 టీఎంసీలకు పెంచుకున్నామని తెలిపారు. దానిపై కూడా 2015లో చంద్రబాబు ప్రభుత్వం లేఖ రాసిందని, పాలమూరు-రంగారెడ్డి డిరడి ప్రాజెక్టులను కూడా ఆపాలని బాబు లేఖ రాసిండని గుర్తు చేశారు. ఇప్పుడేమో ఏపీ, తెలంగాణ రెండు కండ్లు అంటున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ ఊరుకోలేదని, తాగునీటి కోసం అంటూ రూ.30వేల కోట్లతో పాలమూరు ప్రాజెక్టును 80 శాతం పూర్తి చేశారని తెలిపారు.





