– జూబ్లీహిల్స్ ఎన్నికపై మాజీ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలు
– రహమత్‌నగర్‌లో బీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13: ఆరు గ్యారంటీలపై హామీలు ఇచ్చి బాండ్ పేపర్లు రాసి ఇచ్చారు.. వంద రోజలు కాదు, 700 రోజులు దాటినా అవి అమలు లేదు.. అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడితే రేవంత్ రెడ్డికి కనువిప్పు కలుగుతుందని ప్రజలు భావిస్తున్నారు అని మాజీ మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యానించారు. నియోజకవర్గం పరిధిలోని రహమత్‌నగర్‌లో సోమవారం బీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరు గ్యారెంటీలు ఎగ్గొట్టినా, హామీలు అమలు చేయకపోయినా, హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చినా తనకే ఓటు వేస్తారని రేవంతు అంటడు.. అందుకే ఉద్యోగాలు రావాలన్నా, పింఛన్లు రావాలన్నా, పథకాలు అమలు కావాలన్నా, హైడ్రా ఆగాలన్నా బీఆర్‌ఎస్ పార్టీ గెలవాలి.. మాగంటి సునీత గెలవాలి అని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘కేసీఆర్ ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దితే రేవంత్ అత్యంత అవినీతి రాష్ట్రంగా తయారు చేసిండు.. ఒక రాష్ట్రం ఎట్ల ఉండాలో కేసీఆర్ తయారు చేస్తే రాష్ట్రం, సీఎం ఎట్ల ఉండగూడదో రేవంతు తయారు చేసిండు.. కేసీఆర్ 350 బస్తీ దవాఖానలు ప్రారంభించి వాటిలో ఉచితంగా పరీక్షలు చేసే విధంగా డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేస్తే రేవంతు ప్రభుత్వం బస్తీ దవాఖానలకు సుస్తీ పట్టించిందని ఆరోపించారు.. నీళ్ల బిల్లులు అధికంగా వసూలు చేస్తున్నారు.. మాగంటి సునితమ్మ గెలుపు తెలంగాణ ప్రజల గెలుపు.. హైడ్రా బాధితుల గెలుపు.. మహాలక్ష్మి రాని అక్కాచెల్లెళ్ల గెలుపు.. పింఛన్లు రాని అవ్వాతాతల గెలుపు.. నిరుద్యోగుల గెలుపు’ అని చెప్పారు. రేవంతు రెడ్డి ఓడినా ఆయన ముఖ్యమంత్రి పదవి పోదు.. ప్రభుత్వమూ పోదు.. కానీ ఆయనకు అర్థం కావాలె అని వ్యాఖ్యానించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహేందర్ రెడ్డి, చీఫ్ విప్ గాంధీల ఇండ్లు, భూములు హైడ్రాకు ఎందుకు కనబడటం లేదు.. గరీబోళ్ల ఇండ్లే హైడ్రాకు కనబడుతున్నాయా అని హరీష్‌రావు ప్రశ్నించారు. హైడ్రా ఖతం హోనాహే.. కాంగ్రెస్ కో హరానేహే.. హైడ్రా బంద్ హోనా మే.. మాగంటి సునితమ్మకో జితానాహే.. కాంగ్రెస్ గెలిస్తే మీ ఇండ్ల ముందుకు బుల్డోజర్ వస్తది.. అది రావొద్దు అంటే సునీతమ్మను గెలిపించాలి అని చెప్పారు. కేసీఆర్ కిట్, బతుకమ్మ చీర, రంజాన్ తోఫా బంద్, ఓవర్సీస్ స్కాలర్‌షిప్, దళిత బంధు బంద్, బీసీ బంధు బంద్ అయ్యాయన్నారు. కేటీఆర్, తాను సునీతమ్మకు కుడి, ఎడమ చెయ్యిగా ఉంటాం.. కార్యకర్తలకు ఆపద వస్తే మెసేజ్ చేస్తే చాలు తాను, తలసాని, కేటీఆర్ మీ ముందుంటాం అని jసహామీ ఇచ్చారు. జూబ్లీహిల్స్‌లో సునీతమ్మను గెలిపించి కేసీఆర్‌కు బహుమతిగా ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కేబినెట్‌ను మోహరించింది.. మనం కూడా కలిసికట్టుగా కృషి చేయాలి.. ఎక్కడ చూసినా కేసీఆర్‌కు ఓటు వేస్తాం అని అంటున్నారు.. పెద్ద మెజారిటీతో సునీత్మను గెలిపించాలి అని హరీష్‌రావు కోరారు. కార్యకర్తల మీటింగ్ అంటే పబ్లిక్ మీటింగ్‌లాగా ఉందంటూ సంతోషం వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





