– గ్రూప్-1 పరీక్ష తీర్పుపై ఎమ్మెల్యే హరీష్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9: గ్రూప్-1 పిటిషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. లోపభూయిష్టంగా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. సర్కారు నిర్లక్ష్యానికి నిరుద్యోగులు బలవుతున్నారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కండ్లు తెరవాలని, తెలంగాణ యువతకు క్షమాపణ చెప్పాలన్నారు. గ్రూప్ 1 పరీక్ష మూల్యాంకనంలో అవకతవకలు, పరీక్ష కేంద్రాల కేటాయింపు, హల్ టికెట్ల జారీ, పరీక్ష ఫలితాల్లో అనుమానాలు, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టని అన్నారు. లోప భూయిష్టంగా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న రేవంత్ రెడ్డి కోర్టు తీర్పుకు చెప్పే సమాధానం ఏమిటని ప్రశ్నించారు. హడావుడిగా పరీక్షలు నిర్వహించి, అవకతవకలకు పాల్పడ్డ నీ నిర్లక్ష్యానికి విద్యార్థులు, నిరుద్యోగులు బలవుతున్నారు. గప్పాలు కొట్టే కాంగ్రెస్ ప్రభుత్వానికి పరీక్షలు ఎలా నిర్వహించాలి అనే సోయి కూడా లేదు. పరీక్షలు నిర్వహించడం, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం అంటే విద్యార్థులను, నిరుద్యోగులను రెచ్చగొట్టి చిల్లర రాజకీయాలు చేయడం కాదు రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా కండ్లు తెరువు. నీ నిర్లక్ష్య, మోసపూరిత వైఖరికి సిగ్గుతో తలదించుకో. తెలంగాణ యువతకు క్షమాపణ చెప్పు అంటూ డిమాండ్ చేశారు. ఇదిలావుంటే గ్రూప్-1 కేసులో ఈ రోజు నుంచి 8 నెలల లోపు రీ వాల్యూషన్ లేదా మెయిన్స్ పరీక్ష తిరిగి పెట్టాలని హైకోర్టు తీర్పునివ్వడం హర్షణీయమని బీఆర్‌ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి కొనియాడారు. ఇది గ్రూప్-1 బాధితుల, నిరుద్యోగుల విజయమని అన్నారు. గతంలో గ్రూప్ 1 పరీక్షలో అవకతవకలు జరిగాయని పార్టీ పక్షాన వాస్తవాలు ప్రజలముందు పెట్టానని గుర్తుచేశారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడితో టీజీపీఎస్సీ తనకు నోటీసులు ఇచ్చి గొంతు నొక్కే ప్రయత్నం చేసిందని విమర్శించారు. మరి ఇప్పుడు హైకోర్టు తీర్పునకు ఏం సమాధానం చెబుతారో అని ప్రశ్నించారు. గ్రూప్-1 అవకతవకల్లో బాధితులకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడుగడుగునా అండగా నిలిచారని రాకేష్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలను అంగట్లో కూరగాయల లెక్క అమ్ముకోవాలని పన్నిన కుట్రలకు హైకోర్టు అడ్డుకట్ట వేయడం చరిత్రాత్మక తీర్పుగా నిలిచిపోతుందని అభిప్రాయపడ్డారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



