– అది ఘోష్ కమిషన్ ఏకపక్షంగా ఇచ్చిన రిపోర్ట్
– వివరిస్తుంటే సీఎం సహా 8మంది మంత్రులు అడ్డుకున్నారు
– గన్ పార్క్ వద్ద మీడియాతో మాజీ మంత్రి హరీష్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1: జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టులో అవతవకలు జరిగాయంటూ ఏకపక్షంగా నివేదిక ఇచ్చిందని అసెంబ్లీలో తాము వివరిస్తే దాన్ని తట్టుకోలేక ముఖ్యమంత్రి సహా ఎనిమిదిమంది మంత్రులు 33సార్లు తమ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్‌రావు ఆరోపించారు. సోమవారంనాటి సభలో మైక్ కావాలని దాదాపు గంటన్నరసేపు స్పీకర్‌ను, శాసనసభ వ్యవహారాల మంత్రిని అడిగినా ఇవ్వలేదన్నారు. ఈ రోజు అసెంబ్లీ పెట్టినప్పటికీ హడావుడిగా దివారమే చర్చ పెట్టారన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇయ్యలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.. ఒక్క ఎకరానికి మీరు నీళ్లు ఇచ్చినట్టు మీరు రుజువు చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, బీఆర్‌ఎస్ సమయంలో నీళ్లిచ్చినట్టు రుజువు చేస్తే మీరు డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టండి.. ఎవరు అబద్ధాలు మాట్లాడుతున్నారో తేలుద్దాం అన్నారు. ప్రాణహిత ప్రాజెక్టును అంతర్రాష్ట్ర సమస్యల్లో ఇరికించారు.. ఎక్కడైతే సమస్యలు లేవో వాటిని కొనసాగించాం.. కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేసి నీళ్లు అందించామన్నారు. ఈ సమయంలో వరదలపై మాట్లాడదాం, ఎరువుల కొరత గురించి మాట్లాడదామని తాము కోరితే బురద రాజకీయాల కోసం కాళేశ్వరంపై చర్చ పెట్టారు. అయినా దానిపై మాట్లాడేందుకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ తమ మైక్ కట్ చేసి, గొంతు నొక్కే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఉత్తంకుమార్ రెడ్డి.. మీరు వచ్చినంక ఎక్కడా ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదు. కాళేశ్వరం సంబంధించి నీళ్లే రాలేదని ఆరోపణ చేస్తున్నారు.. మేధావులు జర్నలిస్టులను తీసుకొని పోదాం. వేలాది ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులను అడుగుదాం.. కాళేశ్వరం ఫలితం అందిందా లేదా అని ప్రజలని అడుగుదాం. ఉత్తంకుమార్ రెడ్డి జిల్లాలోని కోదాడకు కాళేశ్వరం నీళ్లు అందాయి. ఇది బీఆర్‌ఎస్ పార్టీ చేసిన కృషి.. ఈరోజు హైదరాబాద్‌కు గోదావరి నీళ్లు వస్తున్నాయి అంటే అది కాళేశ్వరం వల్లే. ఈరోజు 13 జిల్లాలకు సాగు, తాగునీరు అందుతున్నదంటే అది కాళేశ్వరం వల్ల. ఈరోజు కాళేశ్వరం ఎవడైతే కూలేశ్వరం అన్నాడో వాళ్లే ఈరోజు తెలంగాణ పాలిట శనేశ్వరులు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్.. తెలంగాణ జల సాధకుడు కేసిఆర్. పంచాయతీ ఎన్నికలకు పోతున్న బీఆర్‌ఎస్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ’విజిలెన్స్ రిపోర్ట్లు, ఎన్డీఎస్‌ఎ రిపోర్ట్లు, ఘోష్ కమిషన్ రిపోర్టులతో వేధిస్తారట.. ప్రాణాలు ఫణంగా పెట్టి 14 ఏళ్లు తెలంగాణ కోసం పోరాడినందుకు కేసిఆర్‌కి శిక్ష వేస్తారా.. ఎందుకు కేసు పెడతారని అడుగుతున్నా’నన్నారు. ఎస్‌ఎల్బీసీ, సుంకిశాల కుప్పకూలినందుకు, వట్టెం పంపోస్ మునిగిపోయినందుకు, పాలెంబాబు కొట్టుకుపోయినందుకు నిన్ను శిక్షించాలి రేవంత్ రెడ్డీ అని ధ్వజమెత్తారు. కాళేశ్వరం సమగ్ర స్వరూపం పూర్తిగా బాగుంది. అందులో 228 పిల్లర్లు ఉంటే మూడు పిల్లర్లు కుంగినందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు. మరమ్మతులు చేసి రైతులకు నీళ్లు ఇవ్వకుండా బురద రాజకీయాలు చేస్తున్నారని హరీష్‌రావు ధ్వజమెత్తారు. మేడిగడ్డ వద్దనుకోవడం అంటే గోదావరిలో తెలంగాణ వాటాను వద్దనుకోవడమే.. మేడిగడ్డను వద్దనుకుంటే గోదావరి నీళ్లను బనకచర్లకు వదిలినట్టే. బీఆర్‌ఎస్‌ని దెబ్బతీయాలని రైతులకు కన్నీళ్లు మిగల్చకండి.. తక్షణమే కుంగిన పిల్లర్లను రిపేర్ చేసి వృధాగా పోతున్న గోదావరి జలాలను ఎత్తిపోయండి.. రాష్ట్ర రైతుల ప్రయోజనాలను కాపాడండి అని తాము కోరుతున్నామన్నారు. మీరు వేసిన కమిషన్ కోర్టులో నిలబడదు.. మీరు చేస్తున్న నష్టం.. మీరు చేస్తున్న ద్రోహం చరిత్రలో నిలిచిపోతుంది. మీరు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు.. మీ అరాచకాలు, మీ కుట్రలు అన్నీ వడ్డీతో సహా చెల్లిస్తాం.. వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని హరీష్‌రావు హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





