– కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులపై సుదీర్ఘ చర్చ
– జూన్ 5న కమిషన్ ముందు విచారణకు హాజరు కావాలని కేసీఆర్ నిర్ణయం
– కవిత ధిక్కార ధోరణిపై చర్చ?
సిద్ధిపేట జిల్లా ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(కేసీఆర్)తో సిద్ధిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు బుధవారం మరోసారి భేటీ అయ్యారు. జూన్ 5న కమిషన్ ముందు విచారణకు హాజరు కావాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ ఇద్దరి మధ్య భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. బిఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వం హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనీ, కుంగిపోయిందంటూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వొచ్చిన తర్వాత జస్టిస్ పిసి ఘోష్ కమిషన్‌ను నియమించిన విషయం విదితమే. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న పిసి ఘోష్ కమిషన్ ఈ నెల 20న కేసీఆర్, హరీష్‌రావు, అప్పటి ఆర్థిక శాఖ మంత్రి, ప్రస్తుతం బిజెపి పార్టీకి చెందిన మల్కాజ్‌గిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్‌కు కమిషన్ ఎదుట హాజరు కావల్సిందిగా నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. వొచ్చే నెల 5న కేసీఆర్, 9న హరీష్‌రావు కమిషన్ ఎదుట హాజరు కావల్సిందిగా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఇది వరకు ఒకట్రెండుసార్లు కేసీఆర్‌తో హరీష్‌రావు భేటీ అయ్యారు.
తాజాగా మరోసారి కేసీఆర్‌తో ఫాంహౌస్‌లో హరీష్‌రావు మూడు నాలుగు గంటల పాటు భేటీ అయి కమిషన్ జారీ చేసిన నోటీసులపై ఇద్దరూ సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ఈ భేటీలో కమిషన్ అడిగే ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి? ఎటువంటి స్టాండ్ తీసుకోవాలనే దానిపై ఈ ఇద్దరు నేతలు సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. కమిషన్ ముందర ఇంతకు ముందు హాజరైన రిటైర్డ్ ఇంజినీర్లతో కూడా ఈ సమావేశం నుంచి మాట్లాడినట్లు సమాచారం. కమిషన్ ముందర హాజరైనప్పుడు ఏమేమీ ప్రశ్నలు అడిగారనే దానిపై కూడా అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తున్నది. కమిషన్ ఎలాంటి ప్రశ్నలు వేసింది. హాజరైన రిటైర్డ్ ఇంజినీర్లు ఎలాంటి సమాధానాలు ఇచ్చింది అడిగి తెలుసుకోవడంతో పాటు ఎన్‌డిఎస్‌ఏ ఏం చెప్పిందన్న అంశాలపై కేసీఆర్, హరీష్‌రావు చర్చించినట్లు సమాచారం. అదే విధంగా కమిషన్ ముందర హాజరైన సందర్భంలో ఉత్పన్నమయ్యే ప్రశ్నలపై కూడా ఈ ఇద్దరు నేతలు చర్చించినట్లు సమాచారం.
చర్చించిన అన్ని అంశాలపై ఓ నివేదికను సిద్ధం చేసుకునే పనిలో కేసీఆర్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే, కమిషన్ జారీ చేసిన నోటీసులపై కేసీఆర్, హరీష్‌రావు ఇప్పటికే న్యాయనిపుణులను సంప్రదించినట్లు సమచారం. అలాగే, చట్టపరమైన అంశాలపై దృష్టి సారించినట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో ఇప్పుడు నెలకొని ఉన్న పరిస్థితుల్లో కమిషన్ ఎదుట హాజరై అభిప్రాయాలను చెప్పడమే మంచిదని కేసీఆర్ భావిస్తున్నట్లు బిఆర్‌ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యంతో పాటు ప్రపంచంలోనే అతి తక్కువ సమయంలో కాలేశ్వరంను నిర్మించిన తీరు వంటి అంశాలను కమిషన్‌కు కేసీఆర్ వివరించాలని భావిస్తున్నట్లు సమచారాం. దానికి తగ్గట్టుగానే కేసీఆర్, హరీష్‌రావు అన్ని విధాలుగా ప్రిపేర్ అవుతున్నట్లు తెలుస్తుంది. ఈ ఇద్దరి భేటీ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ కూడా చర్చకు వొచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఓ వైపు కాళేశ్వరం కమిషన్ జారీ చేసిన నోటీసులకు గడువు సమీస్తుండటం, మరో వైపు కేసీఆర్ తనయ కవిత ఒకింత ధిక్కార స్వరాన్ని ఆలపిస్తున్న నేపథ్యంలో కేసీఆర్, హరీష్‌రావు భేటీకి రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.





