త‌ప్పుడు లెక్క‌ల‌తో మ‌భ్య‌పెట్ట‌వ‌ద్దు

  • ప్రాణ‌హిత డిజైన్‌కు మ‌హారాష్ట్ర అభ్యంత‌రం చెప్పింది క‌దా
  • ఇవ‌న్నీ ఎందుకు దాస్తున్నారు?
  •  ప్రివిలేజ్ మోష‌న్ ఇస్తాం
  • ప్ర‌భుత్వాన్ని నిల‌దీసిన మాజీ మంత్రి హ‌రీష్‌రావు

పంపులు ఆన్ చేసి రైతాంగానికి నీళ్లు సరఫరా చేయాలని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తే.. అది పక్కన బెట్టి అబద్దాలతో నిండిన పీపీటీల కంపు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నార‌ని మాజీ మంత్రి హ‌రీష్‌రావు ఎద్దేవా చేశారు. ప్ర‌జాభ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి,  సీఎం రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి, ఆర్థిక మంత్రి భట్టి  పనికి రాని పీపీటీలతో మరోసారి అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారన్నారు.

నిజాలు చెప్పే దమ్ములేక తప్పుడు లెక్కలతో, తప్పుడు మాటలతో మభ్య పెట్టే ప్రయత్నం చేయడం తప్ప మీరు చేసిందేం లేదు. మీరు చెప్పిన ప్రతి మాట పచ్చి అబద్దమే అని అసెంబ్లీ లోపల, బయట అనేక సార్లు సాక్షాధారాలతో సహా వివరించా. అయినా  పదే పదే చెప్పిన అబద్దాలు చెబుతూ నిజాలుగా భ్రమింపచేసే కుట్రలకు పాల్పడుతుండటం సిగ్గుచేట‌న్నారు.ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పక్కనబెట్టి రంగారెడ్డి, నల్గొండ ప్రాంతాలను విస్మరించామని విభజన చట్టం చూపుతూ రేవంత్‌రెడ్డి తప్పుదోవ పట్టించార‌న్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నారాయణ పేట్, నల్గొండ, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని 70 మండలాలు, 1226 గ్రామాల్లోని 12.30 లక్షల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చే విషయం గురించి దాచి పెట్టే కుట్ర ఎందుకు చేస్తున్నావ‌ని ప్ర‌శ్నించారు.

ఉమ్మడి రాష్ట్రంలో 50లక్షల ఎకరాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఇచ్చిందని పచ్చి అబద్దాలు చెబుతున్న రేవంత్ రెడ్డి దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాల‌ని డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ తొమ్మిదిన్నరేండ్లలో 48.74 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చింది వాస్తవం కాదా. ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లు నీకు ఇచ్చిన నివేదికలోనే ఇది ఉంది. మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లనే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మూలన పడింది. తమ్మిడి హట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు చేపట్టేందుకు మహారాష్ట్ర ఒప్పుకోకున్నా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాలువలు తవ్వి, మొబిలైజేషన్ అడ్వాన్సులను కాంట్రాక్టర్లకు కట్టబెట్టింది నిజం కాదా? అని ప్ర‌శ్నించారు.

ప్రాణహిత డిజైన్ తో 3 వేల ఎకరాలకు పైగా ముంపు ఉంటుందని మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది నిజం కాదా? ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ అప్పటి మహారాష్ట్ర సీఎం పృధ్వి రాజ్ చవాన్ నాటి ఆంధ్రప్రదేశ్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కి లేఖ రాయడం నిజం కాదా? అని ప్ర‌శ్నించారు.  ప్రతిపాదించిన రీతిలో ప్రాజెక్టుకు ఒప్పుకోబోమని, అయినా ప్రాజెక్టు కడితే ఖర్చు వృథా కాక తప్పదని చవాన్  హెచ్చరించిన మాట వాస్తవం కాదా? చాప్రాల్ వన్యప్రాణి అభయారణ్యంతో తమ్మడిహట్టి ప్రాజెక్టుకు సమస్య ఉండటం వాస్తవం కాదా? కేంద్ర జలసంఘం నీటి లభ్యత లేదని చెప్పడం వాస్తవం కాదా? అని ప్ర‌శ్నించారు. ఏ సమస్య లేకున్నా బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత ప్రాజెక్టును పక్కనబెట్టిందని చెప్పడం పచ్చి అబద్దం.

2007లో మొదలు పెట్టిన ప్రాజెక్టును 2014 వరకు ఎందుకు పూర్తి చేయలేదు? కనీసం అనుమతులు కూడా ఎందుకు సాధించలేదు? కేంద్రంలో, మహారాష్ట్ర, ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా ఎందుకు చేతులు ముడుచుకొని కూర్చొన్నారు? ప్రాణహిత చేవెళ్ల నిర్మాణ వ్యయాన్ని రూ. 17,875 కోట్లతో నిర్మించేందుకు 2007 మే నెలలో జివో నెంబర్ 124 విడుదల చేసారు.కేవలం 19 నెలల్లోనే రూ. 38, 580 కోట్లకు అంచనాలు పెంచుతూ జీవో ఇచ్చారు. కేంద్ర జలసంఘానికి ప్రతిపాదనలు పంపినప్పుడు రూ.40 300 కోట్లకు పెంచారు.కమీషన్ల కోసం అంచనాలు పెంచామంటున్న ఉత్తం గారు, ఏ కమీషన్లు దండుకునేందుకు రూ.17వేల కోట్ల నుంచి రూ.40వేల కోట్లకు అంచనాలు పెంచారు? ఎవరి జేబుల్లోకి అవి వెళ్లాయి?ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు తెలంగాణ ప్రాంతానిది కనుకే అప్పటి కాంగ్రెస్ పార్టీ అంతర్రాష్ట్ర కిరికిరి లో పెట్టి, పనులు ముందుకు పోనివ్వనిది నిజం కాదా?మసి పూసి మారేడు కాయ చేస్తే నిజాలు దాగవన్నారు. మేడిగడ్డ ను పడావు పెట్టి నీళ్లను కిందకు వదిలి చోద్యం చూస్తున్న రేవంత్ రెడ్డి.. అధికారంలోకి వచ్చి 20 నెలలు అయ్యింది.మేడిగడ్డను రిపేర్ చేయాలని ఎన్డీఎస్ఏ చెప్పినా, ఎల్ అండ్ టీ రిపేర్ చేయడానికి సిద్దపడినా ఎందుకు మరమ్మతులు చేయడం లేదని నిల‌దీశారు. అప్పుడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పడావు పెట్టారు, ఇప్పుడు మేడిగడ్డను పండబెడుతున్నరు.

రైతు ప్రయోజనాల కంటే మీకు రాజకీయ ప్రయోజనాలే ఎక్కువా? తెలంగాణ ప్రయోజనాల కంటే ఆంధ్రాకు నీళ్లు తరలించడం పైనే దృష్టి అని అరోపించారు. మేడిగడ్డ బ్యారేజీ మీది నుంచి వాహనాలు అనుమతించాలని ఎన్డీఎస్ఏ నీకు చెప్పిందా?కూలిందని చెప్పుకుంటూనే ఎందుకు రాకపోకలు అనుమతిస్తున్నారు.ఏ నిపుణుల కమిటీ చెప్పింది  రేవంత్ రెడ్డి? అసెంబ్లీకి నిపుణులను పిలవడం కాదు, నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ కు నిపుణులను పిలుచుకొని ముందు మాట్లాడు. తర్వాత సుద్దులు చెబుదువు గాని అన్నారు. జూరాల జలాశయం నికర నిల్వ సామర్థ్యం 7 టిఎంసిలు మాత్రమే. దీని మీద ఇప్పటికే బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ లోని తదితర పట్టణాల తాగు నీటి అవసరాలు ఉన్నాయి.

దీనికి అదనంగా రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోసే పాలమూరు ప్రాజెక్టు భారం మోపడం సాధ్యమవుతుందా? పాలమూరు బిడ్డను అని చెప్పుకునే నీకు ఆ మాత్రం తెల్వదా రేవంత్ రెడ్డీ అని ప్ర‌శ్నించారు.  కృష్ణా జలాల్లో 299:512 వాటాకు రాష్ట్రం ఏర్పడక ముందే ఒప్పుకొని మరణ శాసనం రాసిందే కాంగ్రెస్ పార్టీ.ఆనాటి కాంగ్రెస్ చేసిన తప్పుకు తెలంగాణ ఇప్పటికీ శిక్ష అనుభవిస్తున్నది. సెక్షన్ 3 సాధించింది కేసీఆర్ గారు, ట్రిబ్యునల్ ముందు 573 టీఎంసీలకు అఫిడవిట్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం.  రాష్ట్ర ప్రభుత్వం అధికార భవన్ లో అధికారికంగా నిర్వహించిన నేటి సమావేశానికి మీ పార్టీ ప్రజాప్రతినిధులను, పార్టీ ఫిరాయించిన ప్రజా ప్రతినిధులను మాత్రమే ఆహ్వానించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే.ఇరిగేషన్ పై చర్చకు రా అంటూ రంకెలు వేసే రేవంత్ రెడ్డి.. ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఎందుకు పిలవలేదు. నీ సవాల్ లో నిజాయితీ ఉంటే ఎందుకు ప్రజా భవన్ కు ఆహ్వానించలేదు? ఇది ఎమ్మెల్యేల ప్రివిలేజ్ కు భంగం కల్పించడమే. దీనిపై బిఆర్ఎస్ పార్టీ శాసనసభ స్పీకర్ , శాసన మండలి చైర్మన్ కుప్రివిలేజ్ మోషన్ ఇస్తుంద‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *