చీఫ్ విప్ గా మహేందర్ రెడ్డి నియామకం రాజ్యాంగ విరుద్ధం.
మీడియాతో మాజీ మంత్రి హరీష్ రావు చిట్ చాట్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13 : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ని శాసనమండలి చీఫ్ విప్‌గా నియమించడం రాజ్యాంగ విరుద్ధమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తుస్తోందని, చీఫ్ విప్ గా మహేందర్ రెడ్డి నియామకం రాజ్యాంగ విరుద్ధమని హరీష్ రావు విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో బిల్ పాస్ చేయించడం, ప్రభుత్వ బిజినెస్ జరిగేలా చీప్ విప్ బాధ్యత. మహేందర్ రెడ్డి ఇప్పుడు ఎవరికి విప్ ఇష్యూ చేస్తాడు?.. అధికార పార్టీ సభ్యులకా?… ప్రతి పక్ష పార్టీ సభ్యులకా. ఆయన విప్ జారీ చేస్తడా.. లేక బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన విప్ ను పాటిస్తాడా? విప్ అనే వ్యక్తి తన పార్టీ ఆదేశాలనుసారం నడుచుకోమని జారీ చేసేది విప్. ఎదుటి పార్టీ వారిని చీప్ విప్ చేస్తే ఏ పార్టీకి విప్ జారీ చేస్తాడు.? బిఆర్ఎస్ పార్టీ విప్ ప్రస్తుత చీఫ్ విప్ కు విప్ జారీ చేసే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన, రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారని ఎందుకు ఇది మరో ఉదాహరణ అని హరీష్ రావు మండిపడ్డారు.
శాసనసభ సమావేశాలు ముగిసే నాటికి బిఆర్ఎస్ పార్టీ సభ్యుల సంఖ్య 38 అని స్పీకర్ చెప్పారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ వారు కూడా చెప్పారు. అలా చెప్పి మళ్లీ మా పార్టీ వాళ్లు కాదు అని మాట్లాడుతున్నారు. బిఆర్ఎస్ పార్టీ 38 మంది అని వాళ్లే చెప్తారు, మళ్ళీ మా వాళ్లు కాదు చెబుతారు. చైర్మెన్ దగ్గర మహేందర్ రెడ్డి అనర్హత పిటిషన్ పెండింగ్ లో ఉంది. ట్రిబ్యునల్ ఛైర్మన్ గా దాని మీద నిర్ణయం తీసుకోవాలి. ఇలాంటి సమయంలో అధికార పార్టీ చీఫ్ విప్ గా అదే కౌన్సిల్ చైర్మన్ బులిటెన్ ఎలా ఇష్యూ చేస్తారు అని హరీష్ రావు ప్రశ్నించారు. మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తరపున ఎన్నికల్లో ప్రచారం చేశాడు. పార్టీ ఫిరాయింపు చేశాడని స్పష్టంగా అర్థమవుతుంది. మార్చి 15 నాడు చీఫ్ విప్ అని ఆర్డర్ ఇస్తే.. పంద్రాగస్టు, జూన్ 2, సెప్టెంబర్ 17 ఎమ్మెల్సీ గా జెండా ఎగురేస్తారని జిఏడి అఫీషియల్ జీవో ఎలా ఇస్తుంది. శాసనమండలి: అనర్హత వేటు వేయాల్సిన కౌన్సిల్ ఛైర్మన్ స్వయంగా .. పట్నం మహేందర్ రెడ్డి చీఫ్ విప్ ఎంపికైనట్లు బులెటిన్ ఇవ్వటం రాజ్యాంగ విరుద్ధం అని అన్నారు. పీఏసీ చైర్మన్ పదవి విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలానే వ్యవహరించిందని, అరికెపూడి గాంధీ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని స్వయంగా సీఎం, మంత్రులు చెప్పారని, పట్నం మహేందర్ రెడ్డి ఏ పార్టీకి చెందిన వ్యక్తి? ప్రభుత్వం చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.





