హరీష్‌ ‌రాణా కారుణ్య మ‌ర‌ణం

– సుప్రీం కోర్టు అనుమతితో చికిత్స నిలిపివేత

న్యూదిల్లీ, మార్చి 24: సుప్రీం కోర్టు ద్వారా కారుణ్య మరణానికి అనుమతి పొందిన హరీష్‌ ‌రాణా మృతిచెందాడు. సుమారు 13 ఏళ్లపాటు కోమాలో ఉండి జీవచ్ఛవంలా మారిన 32 ఏళ్ల హరీష్‌ ‌రాణా కారుణ్య మరణానికి సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల అనుమతిచ్చిన విషయం తెలిసిందే. అతడికి చికిత్స నిలిపివేయొచ్చని న్యాయస్థానం పేర్కొంది. దీంతో ఎయిమ్స్ ‌వైద్యులు అతడికి క్రమంగా చికిత్స నిలిపివేశారు. ఈ క్రమంలోనే అతడు మంగళవారం తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. 13 ఏళ్లుగా కోమాలో ఉండి, జీవచ్ఛవంలా మంచానికే పరిమితమైన 32 ఏళ్ల హరీష్‌  ‌రాణాకు కారుణ్య మరణానికి(పాసివ్‌ ‌యూతనేషియా) అనుమతిస్తూ సుప్రీంకోర్టు మార్చి 11న చారిత్రాత్మక తీర్పునిచ్చిన సంగతి విదితమే. న్యాయస్థానం ఆదేశాల మేరకు వైద్యం నిలివేసిన వైద్యులు.. క్రమంగా అతడి ఆరోగ్యం క్షీణింపజేసి, మరణించేలా చేశారు. ఈ విషయమై హరీష్‌ ‌రాణా తండ్రి అశోక్‌ ‌రాణా స్పందిస్తూ.. ’మేం దీనికోసమే పోరాడుతున్నాం. ఏ తల్లిదండ్రులు తమ కొడుకుకు ఈ రకంగా జరగాలని కోరుకోరు’ అని కన్నీటిపర్యంతమయ్యారు. ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌కు చెందిన 32 ఏళ్ల హరీష్‌ ‌రాణా చండీగఢ్‌ ‌యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ ‌చదువుతుండేవాడు. అతడు 2013 ఆగస్టు 20న హాస్టల్లో ప్రమాదవశాత్తూ నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి కిందపడటంతో తలకు తీవ్ర గాయమైంది. శరీరం కదల్లేని స్థితికి చేరుకుంది. ప్రముఖ హాస్పిటల్‌ల్లో చికిత్స అందించినా అతడి హెల్త్ ‌కండీషన్‌లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. ప్రమాదానికి గురైన నాటి నుంచీ కోమాలోనే ఉండిపోయాడు. ఈ నేపథ్యంలో హరీష్‌ ‌తల్లిదండ్రులు 2024 జులైలో కుమారుడి కారుణ్య మరణానికి అనుమతించాలని కోరుతూ దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. పలు కారణాలతో ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లారు హరీష్‌ ‌తల్లిదండ్రులు. వైద్య నివేదికలు పరీశిలించిన సుప్రీం ధర్మాసనం.. ఈ ఏడాది జనవరి 13న హరీష్‌ ‌తల్లిదండ్రులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకుంది. మానవీయ కోణంలో మర్యాదపూర్వక మరణాన్ని ప్రసాదించాలని వారు కోర్టును వేడుకున్నారు. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఈ కేసు విచారణలో సర్వోన్నత న్యాయస్థానం మార్చి 11న సంచలన తీర్పు వెలువరించింది. 13 ఏళ్లుగా జీవచ్ఛవంలా ఉన్న హరీష్‌ ‌రాణాకు పాసివ్‌ ‌యూతనేషియాకు అనుమతించగా.. 2018లో చట్టబద్ధత అనంతరం దేశంలో పరోక్ష కారుణ్య మరణం జరిగిన తొలి కేసుగా నిలిచిన సంగతి తెలిసిందే.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *