ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్న రేవంత్ స‌ర్కార్‌

– పండుగ‌కు పీఆర్సీ ప్ర‌క‌టించ‌లేదు
– 22 నెల‌లైనా పీఆర్సీ, డీఏల ప్ర‌స్తావ‌నే లేదు
– 73% పీఆర్‌సీ ప్ర‌క‌టించిన ఘ‌న‌త కేసీఆర్‌దే
– పోలీసుల‌కు 14 డీఏలు, స‌రెండ‌ర్ లీవుల బాకీ
– ఆరోగ్య‌శ్రీ‌కి ఆనారోగ్యం
– మాజీ మంత్రి హ‌రీష్‌రావు విమ‌ర్శ‌

సిద్దిపేట‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 1: ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం 3% డిఏను మంజూరు చేస్తూ తీపి కబురు చెప్పింది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ ఉద్యోగులకు చేదు ఫలితాలను అందిస్తున్నారని మాజీ మంత్రి హ‌రీష్‌రావు విమ‌ర్శించారు. బుధ‌వారం ఆయ‌న సిద్దిపేట‌లో విలేక‌ర్ల‌తో మాట్లాడుతూ  దసరా పండుగ రోజు రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సీ, డిఏ ప్రకటిస్తుందేమో అని ఉద్యోగులు ఆశగా చూశారు. కానీ వారిని తీవ్ర నిరాశకు గురి చేశార‌న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్ని డిఏలను తక్షణమే చెల్లిస్తాం, ఉద్యోగుల ఏరియాస్ అన్ని తక్షణమే ఇస్తాం, ఓల్డ్ పెన్షన్ స్కీం తీసుకుని వస్తాం, ఆరు నెలల్లో పీఆర్సీ అందిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ ఇచ్చిన హామీల‌న్నీ గాలికే పోయాయ‌న్నారు. 22 నెలలు గడుస్తున్నా పీఆర్సీ, డిఏ ప్రస్తావనే లేదన్నారు.  దేశ చరిత్రలో 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఐదు డిఏలు పెండింగ్‌లో లేవ‌న్న సంగ‌తి గుర్తుచేశారు.  ఇప్ప‌టివ‌ర‌కు ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డిఏలు పెండింగ్ పెట్టిన ఏకైక ప్రభుత్వం ఇదేన‌న్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు అంత చిన్న చూప‌ని ప్ర‌శ్నించారు. కమీషన్ల కోసం బడా కాంట్రాక్టర్ల బిల్లులు విడుదల చేస్తూ  ప్రభుత్వ ఉద్యోగులకు మొండి చేయి చూపిస్తున్నార‌న్నారు. కాంగ్రెస్ అభయహస్తం కాదు బస్మాసుర హస్తమ‌న్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 73% గరిష్ట పీఆర్సీ అందించిన ఘనత కేసీఆర్ దేన‌న్నారు. రాష్ట్రంలో ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగుల్లో అత్యధిక శాతం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌లో ఉన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పాత పెన్షన్ స్కీమ్ తెస్తామ‌ని హామీ ఇచ్చారు. ఓల్డ్ పెన్షన్స్ స్కీం గురించి కాంగ్రెస్ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదు. ఇప్పుడున్న సిపిఎస్ ని కూడా రేవంత్ రెడ్డి ఖ‌తం చేసిండన్నారు. మెడికల్ కాలేజీలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఆరు నెలలుగా జీతాలు లేవు. రాష్ట్రంలో పెద్ద పండుగ దసరాకు జీతాలు లేక పండుగ చేసుకోని పరిస్థితుల్లో చిరుద్యోగులు ఉన్నారన్నారు. ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్లో కాస్మోటిక్ లకు, వాచ్‌మెన్‌లకు నెలలతరబడి జీతం చెల్లించడం లేదు. ఫారెస్ట్ లో పనిచేసే వాచ్ గార్డుల‌కు 12 నెలల నుంచి జీతాలు రావడం లేదు. ఆశా వర్కర్లను రోడ్డెక్కించారు. రేషన్ డీలర్లు కూడా రేషన్ షాపులు బంద్ చేస్తామంటున్నారు.  ఆరోగ్యశ్రీ డబ్బులు సంవత్సరం నుండి చెల్లించడం లేదని ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ప్రైవేట్ ఆసుపత్రులు చెప్తున్నాయి. కాలేజీలో ఫీజు రీ ఇంబర్స్మెంట్ కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల చదువులకు కాంగ్రెస్ ప్రభుత్వం రూపాయి ఇవ్వలేదని కాలేజీలు బందు పెడతామంటున్నారు. కెసిఆర్ ఉండగా రూ.20వేల‌ కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ కింద చెల్లించారన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ సిబ్బందికి 14 డిఏలు, ఐదు సరెండర్ లీవులు పెండింగ్ పెట్టడం సిగ్గుచేటన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీస్ స్టేషన్ కి చాలా అలవెన్స్ బంద్ చేసింది. పోలీస్ వాహనాల్లో పెట్రోల్ పోసే పరిస్థితి లేదు. ప్రతి పోలీస్ స్టేషన్‌కు రూ. 75 వేల  అలవెన్స్ కేసీఆర్  అందించారు. పోలీస్ గౌరవాన్ని కాపాడారని గుర్తుచేశారు. ఏఆర్, సివిల్ కానిస్టేబుల్ సరెండర్ లీవులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే హోంగార్డులపై మొదటి సంతకం పెట్టి పర్మినెంట్ చేస్తా అన్నావ్. రూ.12000 ఉన్న హోంగార్డు జీతాన్ని రూ.29 వేలకు కేసీఆర్ పెంచిండు. రేవంత్ రెడ్డి వచ్చి రూ.75 పెంచిండు. ట్రాఫిక్ కానిస్టేబుల్ లకు అడిషనల్ అలవెన్స్ కూడా కేసీఆర్ ప్రభుత్వమే అందించింద‌ని గుర్తుచేశారు. రూ.5500 కోట్ల కాంట్రిబ్యూషన్ పెన్షన్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం మళ్ళించింద‌ని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి డిఏ అంటే డోంట్ ఆస్క్ అని అర్థ‌మ‌న్నారు.  హామీలు అమలు చేయమని అడిగిన ఉద్యోగ సంఘ నాయకులపై కేసులు పెడతామని బెదిరించడం దుర్మార్గమ‌న్నారు. ఆలయాల్లో అర్చకులకు ధూపదీప నైవేద్యానికి కూడా ఈ ప్రభుత్వం మూడు నెలల నుండి డబ్బు చెల్లించడం లేదు. ఆడబిడ్డలకు చీరల్లేవు.. రైతులకు యూరియా లేదు.. సన్నబడ్లకు బోనస్ రాదు.. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ లేదు.. నిరుద్యోగ భృతి లేదు.. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు. విద్య భరోసా కార్డు రాదు.. గురుకులాల్లో విద్యార్థులకు కడుపునిండా అన్నం పెట్టలేవు.. రేవంత్ రెడ్డి వచ్చినంక 22,000 మంది ఉద్యోగులు రిటైర్డ్ అయ్యారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఐదు పది పర్సెంట్ కమీషన్ఇచ్చి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింద‌న్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు రూ. 750 కోట్లు  పీఎఫ్ డబ్బులు పిఆర్సి డబ్బులు క్లియర్ చేస్తామన్నాడు.. ఏమైందని నిలదీసిన ఉద్యోగ సంఘాల నాయకులను ఏసీబీ రైడ్లు చేయిస్తా అని బెదిరిస్తున్నడన్నారు. రేవంత్ రెడ్డి బెదిరింపులకు మీరు భయపడాల్సిన అవసరం లేదు.. మీకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది.. మీ హక్కుల కోసం పోరాటం చేస్తుంద‌న్నారు. కాగా, క్వింటాల్ గోధుమలకు 160 మద్దతు ధర పెంచి వరికి మాత్రం రూ.69 పెంచడం ఎంత‌వ‌ర‌కు న్యాయ‌మ‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు.  ఉత్తర భారత దేశ రైతులకు ఒక నీతి .. దక్షిణ భారతదేశ రైతులకు ఒక నీతి అనుస‌రిస్తున్న‌ద‌న్నారు. దక్షిణ భారతదేశ రైతులంటే బిజెపికి ఎందుకు చిన్న చూపని ప్ర‌శ్నించారు. గోధుమలతో సమానంగా వరికి మద్దతు ధర ఇవ్వాలని బిజెపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామ‌న్నారు.

————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *