శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్‌ది

– బీఆర్‌ఎస్ కట్టిన భవనాలకు రిబ్బన్ కటింగ్
– సిద్దిపేట అభివృద్ధిపై రాజకీయ కక్ష
– రూ.1070 కోట్ల అభివృద్ధి పనుల రద్దు
– ఏమి చెప్పుకోడానికి ఇక్కడికి వస్తున్నారు..
– సీఎం రేవంత్‌ను నిలదీసిన ఎమ్మెల్యే హరీష్‌రావు

సిద్దిపేట, ప్రజాతంత్ర, మార్చి 21: సగం పనులు జరిగిన సిద్దిపేట వెటర్నరీ కాలేజీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌కు ఎత్తుకుపోయారు.. ఇది ముఖ్యమంత్రికి తగిన పనేనా అని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి.హరీష్‌రావు ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం సిద్దిపేట పర్యటన నేపథ్యంలో తన క్యాంపు కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడారు.కేసీఆర్ తెచ్చిన కాళేశ్వరం జలాలతోనే నర్మెటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తున్నారు.. దేవుళ్ల మీద ఒట్లు పెట్టి రైతులకు ధోకా చేశారు అని విమర్శించారు. సిద్దిపేటలో 52 శాతం అంటే 22,819 మంది రైతులకు రుణ మాఫీ రూ.300 కోట్ల బకాయిలున్నాయని, సీఎం పర్యటించనున్న నర్మెట్టలోనే రుణ మాఫీ కాని రైతులు 350 మంది ఉన్నారని తెలిపారు. ఎగ్గొట్టిన మూడు సీజన్ల రైతుబంధును తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. సిద్దిపేటలో రద్దు చేసిన రూ.1070 కోట్ల పనులను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సీఎంకు ఇప్పటికే బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనలో ఈ నియోజకవర్గానికి కొత్తగా మంజూరైన కార్యక్రమం ఒక్కటీ లేద‌న్నారు. రేవంత్ సిద్దిపేటలో ప్రారంభించబోతున్న కార్యక్రమాలన్నీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసి, నిధులు కేటాయించి, నిర్మాణాలు పూర్తి చేసినవేనని స్పష్టం చేశారు. తమదేమో శ్రమ ఫలితం.. రేవంత్ రెడ్డిదేమో శిలాఫలకం ఆవిష్క‌ర‌ణా అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. శిలాఫలకాల మీద నీ పేరు ఉండొచ్చు రేవంత్ రెడ్డి గారూ.. కానీ, సిద్దిపేట ప్రజల మనోఫలకాల మీద ఉండేది మాత్రం కేసీఆర్ పేరే అని అన్నారు. రూ.300 కోట్లతో నర్మెట్టలో ప్రారంభించబోతున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ బీఆర్ఎస్ ప్రభుత్వ ఘనతేనని, దేశంలోనే అత్యుత్తమ టెక్నాలజీతో ఫ్యాక్టరీ రావడానికి, రిఫైనరీ పెట్టడానికి తామే నిర్ణయం తీసుకున్నామని, టీజీఐసీ ద్వారా 62 ఎకరాల భూమిని సేకరించి ఇచ్చామని, రైతులను ఒప్పించి మొక్కలు నాటించామని ఆయన వివ‌రించారు. నాడు కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని ఎగతాళి చేసిన రేవంత్ అదే కాళేశ్వరం జలాలతో నడిచే ఫ్యాక్టరీని ఇవాళ ప్రారంభించనుండడం శోచనీయమన్నారు. ఈ ఫ్యాక్టరీ కోసం కాల్వ‌ పొడిగించి 20 కోట్ల లీటర్ల సామర్థ్యం గల చెరువును నిర్మించి నీరందించింది తామేనన్నారు. పక్కనే పారుతున్న కాళేశ్వరం కాల్వ‌ నీళ్లను నెత్తిన జల్లుకుని ఫ్యాక్టరీని ప్రారంభించు అని హరీష్‌రావు వ్యాఖ్యానించారు. కాళేశ్వరం-మల్లన్నసాగర్ ప్రాజెక్టును అడ్డుకోవడానికి కోర్టుల్లో కేసులు వేసి ఎన్ని కుట్రలు చేసినా మొక్కవోని దీక్షతో ప్రాజెక్టును పూర్తి చేసి నీరందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని తెలిపారు. ఆరోగ్య శాఖ మంత్రిగా నాడు తాను మంజూరు చేసి నిర్మాణాలు పూర్తి చేసిన భవనాలకు ముఖ్యమంత్రి ఇవాళ రిబ్బన్ కటింగ్‌కు వస్తున్నారని ఎద్దేవా చేశారు. రూ.3.60 కోట్లతో సెంట్రల్ డ్రగ్ స్టోర్, రూ.25 కోట్లతో ఆయుష్ హాస్పిటల్, గట్ల మల్యాలలో రూ.1.40 కోట్లతో పీహెచ్‌సీ, సిద్దిపేటలో అర్బన్ పీహెచ్‌సీ భవనాలు కట్టింది తామేనన్నారు. ఎన్నికల కోడ్ వల్ల ప్రారంభానికి నోచుకోకున్నా ఇప్పటికే సేవలు అందిస్తున్నాయన్నారు. సిబ్బందిని నియమించకుండా వాటికి శిలాఫలకాలు వేసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. దేవాలయాలు, విద్యాలయాలతోపాటు రూ.78 కోట్లతో 30 ఎకరాల స్థలంలో జిల్లా జైలును నిర్మించింది కూడా తామేనని చెప్పారు. అమృత్ ఫేజ్-2 కింద కేంద్రం నుంచి సాధించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు కూడా బీఆర్ఎస్ హయాంలో మంజూరైనవేనన్నారు. 2024-25 ఏప్రిల్‌లో వడగండ్ల వానకు నష్టపోయిన సిద్దిపేట రైతులకు వెంటనే పంట నష్టపరిహారం, బీమా అందించాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకున్నది నేనే అని చెప్పడానికి వస్తున్నారా.. రంగనాయక సాగర్ టూరిజం ప్రాజెక్ట్, కోమటి చెరువుపై శిల్పారామం, సిద్దిపేట ఔటర్ రింగ్ రోడ్, అగ్రికల్చర్ కాలేజీ, మిట్టపల్లి ఎస్సీ గురుకులం, సిద్దిపేట స్పోర్ట్స్ స్టేడియం, టూ టౌన్, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లు, సిద్దిపేట-ఇల్లంతకుంట, సిద్దిపేట-కిష్టాపూర్ ఫోర్ లేన్ రోడ్లు, ఆడిటోరియం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను అర్ధంతరంగా ఆపేసింది నేనే అని చెప్పుకోవ‌డానికి వ‌స్తున్నారా అని నిల‌దీశారు. రాజకీయ కక్షతో రద్దు చేసిన ఈ పనులను ప్రభుత్వం తక్షణమే పునరుద్ధరించాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *