స‌ర్పంచ్‌ల‌ను వేధిస్తే స‌హించం

– ప్ర‌తి జిల్లాకు బీఆర్ఎస్ లీగ‌ల్ సెల్ ఏర్పాటు
– గ్రామాల అభివృద్ధికి పాటుప‌డండి
– రాజన్న సిరిసిల్ల జిల్లా కొత్త స‌ర్పంచ్‌ల‌కు కేటీఆర్ దిశానిర్దేశం

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 15: కొత్తగా ఎన్నికైన సర్పంచులను ఇబ్బంది పెట్టాలని చూస్తే సహించేది లేదని, వారి రక్షణ కోసం ప్రతి జిల్లాలో బీఆర్ఎస్ తరఫున ప్రత్యేక న్యాయ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌లో జిల్లా నుండి గెలుపొందిన నూతన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో ఆయన సోమ‌వారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ మద్దతుదారులు కాంగ్రెస్ పార్టీ బెదిరింపులకు భయపడవద్దని, ఒక్క క్షణం కూడా ఆలోచించక వెంటనే పార్టీని సంప్రదించండి.. మీ కోసం ప్రతి జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నాం.. అరగంటలో పార్టీ యంత్రాంగం మీకు అండగా నిలుస్తుంది.. కోర్టు ద్వారా మన హక్కుల కోసం కొట్లాడుదాం అని కేటీఆర్ స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధంగా గ్రామాలకు రావాల్సిన ఫైనాన్స్ కమిషన్ నిధులను ఎవరూ ఆపలేరని, ఆ నిధులు సాధించుకునే బాధ్యత తాము తీసుకుంటామని హామీ ఇచ్చారు. కేవలం రెండేళ్ల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల్లో 40 నుండి 70 శాతం స్థానాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలవడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. సూర్యాపేట జిల్లాలో మల్లయ్య యాదవ్ హత్య, తిప్పర్తిలో కిడ్నాప్ వంటి ఘటనలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం చేసినా ప్రజల వ్యతిరేకత నుంచి కాంగ్రెస్ ను కాపాడలేకపోయారన్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నాయకుల అరాచకాలకు బెదరకుండా భయపడకుండా ప్రజలు మా పార్టీ నేతలు నిలబడ్డారని, అందుకే అత్యధిక స్థానాల్లో ప్రతిపక్షంలో ఉన్న మా పార్టీని గెలిపించారని కేటీఆర్ అన్నారు. సర్పంచులు కేవలం పదవులను అలంకారప్రాయంగా కాకుండా, గ్రామ అభివృద్ధికి సాధనంగా వాడుకోవాలని సూచించారు. సూర్యాపేట జిల్లాలోని ‘ఏపూర్’ గ్రామాన్ని ఉదాహరణగా తీసుకుంటూ.అక్కడ చెక్ డ్యాంలు, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం వంటి నిర్మాణాలతో ఆ గ్రామం దేశంలోనే ఉత్తమ పంచాయతీగా అవార్డు పొందిందని గుర్తుచేశారు. ఐదేళ్ల తర్వాత ప్రజలు మనల్ని గుర్తుపెట్టుకోవాలంటే, మనం చేసిన పనే మనకు శ్రీరామరక్ష అని హితవు పలికారు. పల్లె ప్రగతి ద్వారా ప్రతి ఊరిలో నర్సరీ, డంప్ యార్డ్, ట్రాక్టర్, వైకుంఠధామం వంటివి ఏర్పాటు చేసి గ్రామాల రూపురేఖలు మార్చామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వెంటనే గెలిచిన సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు పంచాయతీరాజ్ చట్టం, విధులు, హక్కులపై అవగాహన కల్పించేందుకు నిపుణులతో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహిస్తామని కేటీఆర్ వెల్లడించారు. మూడో విడత ఎన్నికల్లోనూ పార్టీ శ్రేణులు కష్టపడి గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. దేశ జనాభాలో కేవలం 3 శాతం ఉన్న తెలంగాణ.. కేంద్రం ప్రకటించిన ఉత్తమ పంచాయతీ అవార్డుల్లో 30 శాతం కైవసం చేసుకుందని, ఇది కేసీఆర్ పాలన దక్షతకు నిదర్శనమని,  ఈ రికార్డును దేశంలో ఏ రాష్ట్రం కూడా సాధించలేదని అన్నారు.  ప్రతి గ్రామంలో మౌలిక వసతులను ఏర్పాటు చేశామని, పారిశుద్ధ్య‌ నిర్వహణ మొదలుకొని పచ్చదనం వరకు తాగునీటి సరఫరా వరకు అన్ని రంగాల్లో అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. అందుకే తెలంగాణ పంచాయతీరాజ్ వ్యవస్థకు కేంద్రం నుంచి అనేక అంశాల్లో ఉత్తమ గ్రామ పంచాయతీలు ,ఉత్తమ జిల్లా పరిషత్తు అవార్డులు దక్కించుకున్నాయన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *