– ప్రజలకు రామచందర్‌రావు పిలుపు
– దిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా హర్ ఘర్ తిరంగా వేడుకలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 13: నాచారంలోని దిల్లీ పబ్లిక్ స్కూల్‌లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు గొప్ప పిలుపునిచ్చారని, గత అయిదేళ్లుగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విజయవంతంగా నిర్వహిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశ ప్రజలందరూ విద్యాసంస్థలు, కాలనీలు, ప్రతి ఇంటిపై భారత త్రివర్ణ పతాకం ఎగురేస్తున్నారన్నారు. దిల్లీ పబ్లిక్ స్కూల్‌లో వేలాది విద్యార్థులు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొని తమ ఇండ్లపై జెండా ఎగరేస్తామని తెలిపారన్నారు. గురువారం ఉదయం 10 గంటలకు నెక్లెస్ రోడ్డుపై జరిగే తిరంగా యాత్రలో కుల, మత, ప్రాంతాలకతీతంగా వేలాదిగా ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా భారత సైనికుల, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుందాని సూచించారు. అదేవిధంగా విభజన గాయాల స్మృతి దినం సందర్భంగా భారత విభజన సమయంలో జరిగిన విషాద గాథను రాబోయే తరాలకు తెలియజేసేలా అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించాలని రామచందర్‌రావు కోరారు.





