మున్సిపల్‌ ఎన్నికల్లో హ‌స్తం జోరు

– రెండేళ్ల పాలనకు వోటర్ల పట్టాభిషేకం
– గులాబీ కోటల్లో పాగా వేసిన కాంగ్రెస్
– మొత్తం 2,996 వార్డుల్లో 1,495 స్థానాలతో కాంగ్రెస్ క్లీన్ స్వీప్
-116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో మెజారిటీ ‘హస్తం’ వశం’
– పదిహేను నుంచి ఇరవై స్థానాల్లో హంగ్
– కింగ్ మేకర్లుగా ఇండిపెండెంట్లు
– నేరేడుచర్లలో జనసేన బోనీ
– చిట్యాలలో ట్రాన్స్ జెండర్ విజయం

                                                                                 (మండువ రవీందర్‌రావు)

మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ ఘన విజయాన్ని సాధించింది. పదేళ్ళ బీఆర్‌ఎస్‌ ‌పాలనను కాదని ఓటర్లు రెండేళ్ళ కాంగ్రెస్‌ ‌పాలనకే పట్టం కట్టారు. క‌డ‌ప‌టి స‌మాచారం మేర‌కు మొత్తం 2996 వార్డుల్లో కాంగ్రెస్ 1495, బీఆర్ ఎస్ 763, బీజేపీ 278, ఎఐఎంఐఎం 55, ఇండిపెండెంట్లు, ఇత‌రులు 200 స్థానాల్లో గెలుపొందారు. అధికారంలోని కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుచుకోగా, బీఆర్ ఎస్ గ‌ట్టి పోటీనిచ్చి రెండో స్థానంలో నిలిచింది. గ‌తంతో పోలిస్తే ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో బీజేపీ మెరుగైన ఫ‌లితాలు సాధించ‌డం విశేషం. మూడోస్థానంలో నిలిచినా స్థిర‌మైన అభివృద్ధి న‌మోదు చేయ‌డం క‌మ‌ల‌నాధుల్లో ఆనందం నింపుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు వెల్ల‌డించిన వార్డుల ఫ‌లితాల్లో 12 వార్డులు ఏక‌గ్రీవ‌మ‌య్యాయి. న‌ల్గొండ, రామ‌గుండం, మంచిర్యాల‌ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌ల‌ను కాంగ్రెస్ గెలుచుకుంది. తెలంగాణ‌లో మొట్ట‌మొద‌టిసారి చిట్యాల మున్సిపా లిటీలో ట్రాన్స్ జండ‌ర్ నాగిళ్ల కావేరి సుధాక‌ర్ గెలిచారు. బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నియోజ‌క‌వ‌ర్గం లో బీఆర్ ఎస్ త‌న ప‌ట్టును నిలుపుకుంది. ధ‌ర్మ‌పురిలో కాంగ్రెస్ అన్ని వార్డుల‌ను స్వీప్ చేయ‌డం విశేషం. కాగా ఎన్నికైన కౌన్సిల‌ర్లు, కార్పొరేట‌ర్లు ఈనెల 16న ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో కాంగ్రెస్ స్వీప్ చేసింది. మ‌ధిర‌, వైరా, ఇల్లందు అశ్వారావుపేట మున్సిపాలిటీలు కాంగ్రెస్ హ‌స్త‌గ‌త‌మయ్యాయి.  కొత్త‌గూడెం మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో కాంగ్రెస్ ఆధిక్య‌త కొన‌సాగుతోంది. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో మెజారిటీ మున్సిపాలిటీలు కాంగ్రెస్ ప‌ర‌మ‌య్యాయి. వ‌ర్థ‌న్న‌పేట‌లో రీకౌంటింగ్ త‌ర్వాత కాంగ్రెస్ అభ్య‌ర్థి గెల‌వ‌డంతో, ఉద్రిక్త‌త నెల‌కొంది. ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాలో తాజా స‌మాచారం మేర‌కు కామారెడ్డి మున్సిపాలిటీ ని కాంగ్రెస్ గెలుచుకుంది. ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలో బీఆర్ ఎస్ త‌న ప‌ట్టును నిలుపుకుంది. ఉమ్మ‌డి మెద‌క్-రంగారెడ్డి జిల్లాలో అలియాబాద్‌, ఇస్నాపూర్ మున్సిపాలి టీల్లో ఏ పార్టీకి మెజారిటీ రాక‌పోవ‌డంతో హంగ్ ఏర్ప‌డింది.  మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్‌ ‌కైవసం చేసుకున్నప్పటికీ దాదాపు పదిహేను నుండి ఇరవై చోట్ల హంగ్‌ ‌తప్పడంలేదు. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన ఈ ఎన్నికల్లో ఈసారి కొత్తగా రెండు పార్టీలు తమ ఉనికిని చాటుకున్నాయి. ఆలిండియా ఫార్వర్డ్ ‌బ్లాక్‌ (ఏఐఎఫ్‌బి) గద్వాల జిల్లాలోని వడ్డెపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకోగా, నల్లగొండ జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలో జనసేన ఒక వార్డులో గెలుపొందింది. కాగా వడ్డెపల్లి మున్సిపాలిటీలో విజయపతాకను ఎగురవేసిన ఫార్వర్ద్‌బ్లాక్‌ ‌పార్టీ విషయంలో కొంత గందరగోళం నెలకొంది. తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు కల్వకుంట్ల కవిత తన అభ్యర్దులను ఫార్వర్డ్ ‌బ్లాక్‌ ‌పార్టీ బ్యానర్‌పై నిలబెట్టి గెలిపించుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దాన్ని ఫార్వర్డ్‌బ్లాక్‌ అధినేతలు తీవ్రంగా ఖండించారు. తామంతా తమ పార్టీ పక్షానే నిలబడి గెలిచామని, ఇందులో ఎవరి ప్రమేయంలేదని వారు కొట్టిపారేస్తున్నారు. వడ్డెపల్లి మున్సిపాలిటీలో మొత్తం పది వార్డులుండగా ఏఐఎఫ్‌బి ఎనిమిందింటిలో విజయం సాధించింది. కాగా కాంగ్రెస్‌, ‌బిఆర్‌ఎస్‌లు చెరొక వార్డును గెలుచుకున్నాయి. దీంతో తెలంగాణరాష్ట్రంలో మొదటిసారిగా ఫార్వర్డ్‌బ్లాక్‌ ‌వడ్డెపల్లి మున్సిపాలిటీపైన తమ జండా ఎగురవేయనుంది. ఇదిలాఉంటే హంగ్‌ ఏర్పడిన పలు మున్సిపాలిటీలు చివరకు ఎవరి హస్తగతమవుతాయన్నది ఉత్కంఠంగా మారింది. వీటిల్లో ప్రధానంగా జహీరాబాద్‌, ‌కేసముద్రం, కోహీర్‌, ‌దేవరకద్ర, అలంపూర్‌, ఇస్నాపూర్‌, అమరచింత, జనగామ, ఆసిఫాబాద్‌, ‌జిన్నారం, జమ్మికుంట, ఆలియాబాద్‌, ‌బోధన్‌, ‌వేములవాడ, గద్వాల, కొత్తగూడెం ఖానాపూర్‌తో పాటు మరికొన్ని మున్సిపాలిటీలున్నాయి. మహబూబాబాద్‌ ‌జిల్లా కేసముద్రంలో చిత్రంగా కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌సమానంగా వార్డులను గెలుచుకోవడం చిక్కుముడి పడినట్లైంది. ఇక్కడ 16 వార్డులుండగా కాంగ్రెస్‌ ఎనిమిది వార్డులను, బిఆర్‌ఎస్‌ ఎనిమిది వార్డుల్లో విజయం సాధించాయి. అలాగే అలంపూర్‌లోని పది వార్డుల్లో కాంగ్రెస్‌, ‌బిఆర్‌ఎస్‌ ‌చెరి అయిదు స్థానాలను పొందాయి. వనపర్తి జిల్లా అమరచింత విషయానికొస్తే ఇక్కడున్న పది వార్డుల్లో కాంగ్రెస్‌, ‌బిఆర్‌ఎస్‌, ‌బిజెపి పార్టీలు మూడేసి వార్డులను గెలుచుకోగా మిగిలిన ఒక స్థానంలో ఇండిపెండెంట్‌ అభ్యర్థి గెలుపొందారు. ఇక్కడ ఎవరు ఎవరికి మద్దతిస్తారన్నది ఆసక్తిగా మారింది.

ఇండిపెండెంట్లదే హవా

ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్ల హవా కొనసాగుతున్నది. హంగ్‌ అయిన మున్సిపాలిటీలతోపాటు మరి కొన్ని చోట్ల వారు ప్రధాన భూమికను నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమకు ఛైర్మన్‌ ‌పదవిని ఇస్తేనే మద్దతిస్తామని కొందరు మెలికపెడుతున్నట్లు తెలుస్తున్నది. జనగామలో  గెలిచిన నలుగురు ఇండిపెండెంట్ల పాత్ర కీలకంగా మారింది. ఇక్కడున్న ముప్పై వార్డుల్లో కాంగ్రెస్‌ 12, ‌బీఆర్‌ఎస్‌ 13 ‌స్థానాల్లో గెలుచుకోగా సిపిఎం ఒక స్థానాన్ని పొందింది. సిపిఎం కాంగ్రెస్‌కు మద్దతిచ్చినట్లైతే కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌కు సమానంగా చెరి 13 వార్డులుంటాయి. ఇండిపెండెంట్‌లుగా గెలిచిన నలుగురు ఎటు మొగ్గితే జనగామ మున్సిపాలిటీ వారికే దక్కుతుంది. అలాగే ఆసిఫాబాద్‌లో బిఆర్‌ఎస్‌ 9, ‌కాంగ్రెస్‌కు 7 వార్డులను గెలుచుకోగా ఇక్కడకూడా నలుగురు ఇండిపెండెంట్లదే కీలకపాత్ర. క్యాతంపల్లిలో 5గురు ఇండిపెండెంట్లు కీలకంగా మారారు. ఇక్కడ బీఆర్‌ఎస్‌ 10, ‌కాంగ్రెస్‌ 7 ‌స్థానాలను గెలుచుకోగా మ్యాజిక్‌ ‌ఫిగర్‌కోసం వారు ఇండిపెండెంట్లను ప్రసన్నం చేసుకోక తప్పని పరిస్థితి. కొన్ని చోట్ల బిజెపి పాత్రకూడా కీలకంకానుంది. జహీరాబాద్‌లో 26 వార్డులకుగాను బిఆర్‌ఎస్‌ 15, ‌కాంగ్రెస్‌ 14 ‌స్థానాలను గెలుచుకోగా బిజెపి 3 స్థానాలతో కీలకంగా మారనుంది. బిజెపితోపాటు గెలుపొందిన ఒక ఇండిపెండెంట్‌  ఎవరికి మద్దతిస్తారన్నది ఈ నెల 16న కాని తేలనుంది. జగిత్యాలది మరింత విచిత్రం. ఈ మున్సిపాలిటీలో గెలిచిన 14 మంది ఇక్కడ కీలకం. జగిత్యాల మున్సిపాలిటీలో 50 వార్డులకుగాను కాంగ్రెస్‌ 12, ‌బిజెపి, బిఆర్‌ఎస్‌ ‌చెరి నాలుగు వార్డులను గెలుచుకున్నారు. కాగా 2 వార్డు)ను ఎంఐఎం గెలుచుకుంది. దీంతో ఇక్కడ 14 మంది స్వతంత్ర అభ్యర్ధుల నిర్ణయంపైనే ఛైర్మన్‌ ఎన్నిక ఆధారపడి ఉంది.
మొదటినుండి కాంగ్రెస్‌, ‌బీజేపీ, బీఆర్‌ఎస్‌ ‌పార్టీలు దేనికదే ఇతర రెండు పార్టీలపై నింద వేస్తున్న విషయం తెలియందికాదు. కాంగ్రెస్‌ ‌బీజేపీ ఒకటేనని బీఆర్‌ఎస్‌, ‌బీజేపీ బీఆర్‌ఎస్‌ ఒకటేనని కాంగ్రెస్‌, ‌కాంగ్రెస్ ‌బీఆర్‌ఎస్‌ ఒకటని బీజేపీ ఇలా ప‌ర‌స్ప‌ర‌ నిందారోపణలు చేస్తున్న విషయం తెలియందికాదు. ఇలాంటి పరిస్థితిలో ఏ పార్టీ ఎవరికి మద్దతిస్తుందన్నదిప్పుడు ఆసక్తిగా మారింది. జహీరాబాద్‌తోపాటు వనసర్తి, వేములవాడ, జిన్నారంలలో ఇలాంటి పరిస్థితులు ఎదురుకానున్నాయి. కొత్తగూడెం విషయంలో బిఆర్‌ఎస్‌ ఇప్పటికే సీపీఐకి ఆఫర్‌ ఇచ్చింది. కొత్తగూడెంలో 60 డివిజన్‌లకుగాను కాంగ్రెస్‌, ‌సిపిఐ చెరి 22 స్థానాలను గెలుచుకున్నాయి. కాగా బిఆర్‌ఎస్‌ 8, ‌సిపిఎం 1, స్వతంత్రులు 6 స్థానాలను సాధించుకున్నారు. అయితే బిఆర్‌ఎస్‌ ‌సిపిఐకి ముందస్తుగానే మద్దతు ప్రకటిస్తున్నట్లు సాక్షాత్తు ఆ పార్టీ వర్కింగ్ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌శుక్రవారం మీడియా ముందు వెల్లడించడంతో కొత్తగూడెం కార్పోరేషన్‌లో ఎర్రజెండా ఎగరటం ఖాయంగా కనిపిస్తున్నది.

కార్పొరేషన్ పేరు               విజేత/ఆధిక్యం కీలక అంశం

నల్గొండ                           కాంగ్రెస్              48 వార్డుల్లో 35 కైవసం
రామగుండం                   కాంగ్రెస్              35 స్థానాల్లో విజయం
మంచిర్యాల                     కాంగ్రెస్             స్పష్టమైన ఆధిక్యం
సిరిసిల్ల (మున్సిపాలిటీ)   బీఆర్ఎస్      బీఆర్ఎస్ కంచుకోట
ధర్మపురి(మున్సిపాలిటీ)  కాంగ్రెస్          క్లీన్ స్వీప్ (అన్ని వార్డులు)
కొత్తగూడెం                          హంగ్               ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాలేదు
నిజామాబాద్                      బీజేపీ               ఆధిక్యం
కరీంనగర్                           బీజేపీ              ఆధిక్యం

పార్టీ                   గెలుచుకున్న స్థానాలు
కాంగ్రెస్               1,495
బీఆర్ఎస్               763
బీజేపీ                      278
ఎంఐఎం                  55
ఇతరులు               200+


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *