– నగరాభివృద్ధికి బడ్జెట్‌లో రూ.10వేల కోట్లు కేటాయించాం
– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 26: హైదరాబాద్ నగరాభివృద్ధిలో హెచ్- సిటీ ప్రాజెక్ట్ గేమ్ ఛేంజర్ అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. దేశంలోని ఇతర నగరాలకు రోల్ మోడల్‌గా నగరాన్ని అభివృద్ధి చేయాలనే సీఎం రేవంత్ రెడ్డి సంకల్పానికి ఇది దిక్సూచిగా మారుతుందన్నారు. హెచ్- సిటీ ప్రాజక్టులో భాగంగా రూ.45 కోట్లతో ఎన్‌హెచ్ 65 నుంచి అమీన్‌పూర్ వరకు చేపట్టబోయే రోడ్డు విస్తరణ పనులకు చందానగర్‌లో గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. నగరాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, బడ్జెట్‌లో రూ.10వేల కోట్లకు పైగా నిధులు కేటాయించామని తెలిపారు. ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు, నగరాభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు రూ.7032 కోట్లతో ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, రోడ్డు విస్తరణ వంటి మౌలిక సదుపాయాల కల్పనకే హెచ్-సిటీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాం అని మంత్రి వివరించారు. ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించి ప్రయాణ సమయాన్ని తగ్గించడం, రహదారి నెట్‌వర్క్‌ను మెరుగుపరచడం, పర్యావరణహితంగా నగరాన్ని అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యాలన్నారు. దీంతో నగరవాసులకు సౌకర్యమంతమైన, నాణ్యమైన జీవన శైలి అందుతుం అని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఇప్పటికే నగరంలో ఆర్టీసీ ఆధ్వర్యంలో వేయి ఎలక్ట్రిక్ బస్సులను నడిపించేందుకు ప్రణాళికలు రూపొందించామని, వాటికి అదనంగా మరో 800 బస్సులను తీసుకురావాలని సీఎం సంకల్పించారని, ఇందుకు కేంద్రం సైతం సహకరించేందుకు ముందుకొచ్చిందని చెప్పారు. ప్రస్తుతం నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఏఐతో అనుసంధానం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కీలక ప్రాంతాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నాంమని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాదచారుల భద్రతకు పెద్ద పీట వేస్తున్నామని ఆయన చెప్పారు. మా లక్ష్యం… ధ్యేయం అభివృద్ధి ఒక్కటే. మీకోసం పనిచేసే ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించి సహకరించండి అని మంత్రి శ్రీధర్‌బాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కార్పొరేటర్లు మంజుల, రాగం నాగేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.





