హెచ్‌-1బి వీసాల రుసుము భారీగా పెంపు

– భారతీయుల నెత్తిన ట్రంప్‌ మరో పిడుగు
– ఏటా లక్ష డాలర్లుగా నిర్ణయిస్తూ ఉత్తర్వులు
– వీసా కావాలన్నా, రెన్యువల్‌ చేసుకోవాలన్నా చెల్లించాల్సిందే
– నేటినుంచే అమల్లోకి కొత్త నిబంధనలు

వాషింగ్టన్‌, సెప్టెంబర్‌ 20: ట్రంప్‌ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి భారత్‌కు షాక్‌ల విూద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే భారీ పన్నులతో భారత ఎగుమతులను దెబ్బకొట్టిన ట్రంప్‌ తాజాగా అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే భారతీయులకు గట్టి షాక్‌ ఇచ్చారు. హెచ్‌-1బీ వీసా వార్షిక రుసుమును లక్ష డాలర్లుగా నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై శుక్రవారం సంతకం చేశారు. ఈ నిర్ణయం భారత్‌, చైనాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ ఉత్తర్వు ప్రకారం అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకోవాలంటే ఇకపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అమెరికాలో హెచ్‌`1బీ వీసాపై పనిచేస్తున్న విదేశీ ఉద్యోగుల్లో దాదాపు 71 శాతం మంది భారతీయులే ఉంటారు. చైనీయులు 11.7 శాతం మంది ఉంటారు. అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను నియమించుకునే వీలు కల్పిస్తూ 1990లో హెచ్‌`1బీ వీసాను తీసుకొచ్చారు. ఈ వీసాను ఉపయోగించుకుని ఎంతోమంది విదేశీ నిపుణులు అమెరికాలోకి ప్రవేశించారు.  ఏడాదికి 85 వేల వీసాలను అమెరికా లాటరీ విధానం ద్వారా జారీ చేస్తుంది. సాధారణంగా కంపెనీలే ఉద్యోగుల హెచ్‌~1బీ వీసా చార్జీలను చెల్లిస్తుంటాయి. అయితే ప్రస్తుతం ఆ ఫీజును భారీగా పెంచేయడంతో కంపెనీలు పెను భారాన్ని మోయక తప్పదు. అమెరికాలో ఉద్యోగం చేద్దామని కలలు కంటున్న భారతీయులకు ఇది పిడుగులాంటి వార్త. ప్రతి హెచ్‌-1బీ వీసాపై ఏటా లక్ష డాలర్ల రుసుం విధించినట్లు యూఎస్‌ కామర్స్‌ సెక్రటరీ హోవార్డ్‌ లుట్నిక్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పెద్ద కంపెనీలకు వివరించినట్లు తెలిపారు. విూరు ఎవరికైనా శిక్షణ ఇవ్వదలుచుకుంటే మన దేశంలోని గొప్ప యూనివర్సిటీల నుంచి ఇటీవల పట్టభద్రులైన మన వారికి ఇవ్వండి. అమెరికన్లకు ట్రైనింగ్‌ ఇవ్వండి. మన ఉద్యోగాలను కొల్లగొడుతున్న వారిని ఇతర దేశాల నుంచి తీసుకురావడం ఆపండి అని లుట్నిక్‌ విూడియా సమావేశంలో పేర్కొన్నారు. ఈ నిర్ణయానికి టెక్నాలజీ రంగం మద్దతు ఇస్తుందని ట్రంప్‌ పేర్కొన్నారు. ట్రంప్‌ నిర్ణయంపై దిగ్గజ టెక్‌ కంపెనీలు అయిన యాపిల్‌, గూగుల్‌, మెటా ఇంతవరకు స్పందించలేదు. హెచ్‌-1 బి వీసాలను మూడు నుంచి ఆరేళ్ల మధ్య కాలానికి మంజూరు చేస్తారు. మరోవైపు గోల్డ్‌ కార్డును సైతం ట్రంప్‌ ప్రకటించారు. దీనికి 10 లక్షల డాలర్లుగా నిర్ణయించారు. దీని ద్వారా అమెరికాకు 100 బిలియన్‌ డాలర్లు సమకూరే అవకాశం ఉంది. పన్నుల తగ్గింపు, అభివృద్ధి ప్రాజెక్టులకు, రుణాల చెల్లింపులకు గోల్డ్‌ కార్డు నిధులు వినియోగించనున్నట్లు ట్రంప్‌ తెలిపారు. ఈ సందర్భంగా అమెరికా కామర్స్‌ సెక్రటరీ హోవర్డ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐటి కంపెనీలు అమెరికన్లనే నియమించుకోవాలని, పనికి రాని వ్యక్తులు అమెరికాలోకి రావడాన్ని ఆపేయాల్సిందేనని హోవర్డ్‌ స్పష్టం చేశారు. హెచ్‌~1బి వీసాలతో అమెరికా వెళ్లేది ఎక్కువగా భారతీయులే కావడంతో హోవర్డ్‌ వ్యాఖ్యలు వారిని అవమానించే విధంగా ఉన్నాయని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కష్టాలు అమెరికాకే.. వికసిత్‌ భారత్‌కు ఇది టర్బో ఛార్జర్‌
వీసా ధరలపై నీతి ఆయోగ్‌ మాజీ సిఇవో అమితాబ్‌ కాంత్‌

న్యూదిల్లీ: హెచ్‌-1బీ వీసాల దరఖాస్తు రుసుమును లక్ష డాలర్లకు పెంచుతూట్రంప్‌ యంత్రాంగం తీసుకున్న నిర్ణయంపై నీతి ఆయోగ్‌ మాజీ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ స్పందించారు. ఆ చర్య అమెరికానే ఉక్కిరిబిక్కిరి చేస్తుందని వ్యాఖ్యానించారు. లక్ష డాలర్ల హెచ్‌-1బీ వీసా ఫీజు యూఎస్‌ ఆవిష్కరణలకు ఊపిరాడకుండా చేస్తుంది.. భారతదేశాన్ని టర్బోఛార్జ్‌ చేస్తుంది అని పేర్కొన్నారు. ప్రపంచస్థాయి ప్రతిభకు తలుపులు మూసేయడం వల్ల అమెరికాలో ఏర్పడాల్సిన ల్యాబ్స్‌, పేటెంట్లు, ఆవిష్కరణలు, స్టార్టప్‌లు బెంగళూరు, హైదరాబాద్‌, పుణె, గుర్గావ్‌లకు వచ్చేస్తాయి. దాంతో అత్యుత్తమ వైద్యులు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు వికసిత్‌ భారత్‌ దిశగా దేశ పురోగతికి దోహదం చేసే అవకాశం ఉంది. ఈ నిర్ణయం భారత్‌కు లాభం చేకూర్చనుందని అమితాబ్‌కాంత్‌ ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టారు.మన శ్రామికశక్తిని ఎంతోకాలంగా బలోపేతం చేసిన, ఆవిష్కరణలకు దోహదం చేసిన, లక్షలాదిమంది అమెరికన్లకు ఉపాధి కల్పించే పరిశ్రమలను ఏర్పాటు చేయడంలో సహాయపడిన అధిక నైపుణ్యం కలిగిన కార్మికులను అమెరికా నుంచి దూరం చేయడమే అవుతుందపి యూఎస్‌ కాంగ్రెస్‌ సభ్యుడు రాజా కృష్ణమూర్తి అన్నారు. హెచ్‌-1బీ ప్రోగ్రామ్‌ అనేది ఆవిష్కరణలకు ప్రాణాధారం. దానిద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాలెంట్‌ను అమెరికా ఆకర్షిస్తోంది. ఈ ఫీజు పెంపు వల్ల ఇకపై అడ్డంకులు ఎదురుకానున్నాయి. భిన్నమైన టాలెంట్‌ ఆధారంగా నడిచే చిన్న వ్యాపారాలు, స్టార్టప్‌లను అణచివేస్తుంది.. ఆర్థికవ్యవస్థ దూసుకెళ్లేందుకు ఉపకరించే నిపుణులను దూరం చేస్తుంది అని జోబైడెన్‌ మాజీ సలహాదారు అజయ్‌ భుటోరియా అన్నారు. ఈ నిర్ణయం దురదృష్టకరమని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సాప్ట్‌వేర్‌, టెక్‌ పరిశ్రమకు నష్టం చేకూర్చనుందని అంచనా వేస్తున్నారు. స్టెమ్‌ కోర్సు ద్వారా యూఎస్‌ విద్యాభ్యాసం చేసినవారిపై ఇప్పటికే ఏఐ, టారిఫ్‌లు ప్రభావం చూపుతుండగా, ఈ ఫీజు పెనుభారం కానుందని చెప్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *