రాజకీయ నాయకుల భాష మారాలి

– అభివృద్ధ్దిని దెబ్బతీస్తున్న ఉచిత పథకాలు
– మండలి చైర్మన్‌ గుత్తి సుఖేందర్‌ రెడ్డి

నల్లగొండ, ప్రజాతంత్ర, జులై 21: రాజకీయ నాయకులు మాట్లాడే భాషను వింటున్న ప్రజలు చీదరించు కుంటున్నారని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. రాజకీయాల్లో భాషా వ్యవహారం పూర్తిగా దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకతీతంగా ప్రతి నాయకుడు ఆత్మపరిశీలన చేసుకోవాలని, భాష మార్చుకోవాలని, తద్వారా తమ గౌరవాన్ని నిలుపుకోవాలని సూచించారు. నల్లగొండలోని తన క్యాంప్‌ కార్యాలయంలో గుత్తా మీడియాతో మాట్లాడారు. సాగర్‌ ఎడమ కాల్వ ద్వారా తాగు నీటిని ముందుగానే విడుదల చేసిన ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానన్నారు. కాగా, ఉచిత పథకాలు, అవినీతి, బనకచర్ల ప్రాజెక్టు, సాగర్‌ ఎడమ కాల్వలాంటి తదితర విషయాలపైకూడా సుఖేందర్‌రెడ్డి స్పందించారు. ఉచిత పథకాలు రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని, ఉచితాలను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. లేకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ చితికిపోతుందని ఆందోళన చెందారు. అధికారుల అవినీతి పెరిగిపోయిందంటూ ముఖ్యంగా నీటిపారుదల శాఖలో పెరిగిన అవినీతిని నియంత్రించాలని సూచించారు. దేశవ్యాప్తంగా అవినీతి రోజురోజుకూ పెరిగిపోతోందని, ఎన్నికల ఖర్చుల నియంత్రణ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని అన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషన్‌ జోక్యం చేసుకోవాలని గుత్తా కోరారు. బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని, ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. నేతల పరస్పర దాడులు సరికాదని, సభ బయట సభ్యుల మధ్య జరిగే దాడులపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *