నాటి గుండ్రాంపల్లి ఘటన మరువలేం

– ఆ అమరుల కుటుంబాలకు పాదాభివందనం
– నివాళులర్పించిన బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు

నల్గొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: నిజాం నిరంకుశత్వ పాలనలో గుండ్రాంపల్లిలో 26మందిని రజాకార్లు దారుణంగా చంపి బావిలో పడేసిన ఘటన మరిచిపోలేనేది.. ఆ అమరవీరుల, త్యాగధనుల కుటుంబాలకు పాదాభివందనం చేస్తున్నానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు అన్నారు. ఈ గ్రామం సాహస చరిత్రకు ప్రతీక.. ఇక్కడికి రావడం తనకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చిందన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్గొండ జిల్లా గుండ్రాంపల్లిలో నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడి ప్రాణ త్యాగం చేసిన అమరవీరులకు ఆయన మంగళవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1947 ఆగస్టు 15న భారత్‌ అంతటా త్రివర్ణ పతాకం ఎగురుతుంటే నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్‌ రాష్ట్రంలో మాత్రం భారత జెండా ఎగరలేదన్నారు. తెలంగాణ సహా మహారాష్ట్ర, కర్నాటక జిల్లాలతో కూడిన హైదరాబాద్‌ సంస్థానాన్ని నిజాం స్వతంత్ర ఇస్లామిక్‌ దేశంగా ఉంచాలని చూశాడని, కుదరని పక్షంలో పాకిస్తాన్‌తో కలుపుకోవాలని ప్రయత్నించగా నిజాం నిరంకుశత్వాన్ని ప్రజలు ధైర్యంగా ఎదుర్కొన్నారని, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నేతృత్వంలో ఆపరేషన్‌ పోలో ద్వారా భారత సైన్యం హైదరాబాద్‌ను 1948 సెప్టెంబరు 17న భారతదేశంలో విలీనం చేయడంతో తెలంగాణకు స్వాతంత్య్రం లభించిందని వివరించారు. ఈరోజు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే సర్దార్‌ పటేల్‌ కృషి కారణమేనన్నారు. సెప్టెంబర్‌ 17ను అధికారికంగా విమోచన దినోత్సవంగా జరపాలనే డిమాండ్‌ మొదట సీహెచ్‌.విద్యాసాగర్‌ రావు లేవనెత్తారని, ఆనాడు ఆయన సూచనతోనే అన్ని పార్టీ కార్యాలయాలకు (కాంగ్రెస్‌, కమ్యూనిస్టు, టీడీపీ, తదనంతరం టీఆర్‌ఎస్‌) వెళ్లి ఈ చరిత్రను వివరించానని రామచందర్‌రావు చెప్పారు. నేడు ఆ కార్యాలయాల్లో మూడు రంగుల జెండా ఎగురవేసి జనగణమన పాడుతున్నారంటే అది విద్యాసాగర్‌ రావు కృషి ఫలితమేనన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు సెప్టెంబర్‌ 17ను అధికారికంగా విముక్తి దినోత్సవంగా జరుపుతున్నప్పటికీ రాజకీయాల కారణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పాలకులు, తరువాత టీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ ప్రభుత్వాలు వెనకడుగు వేశాయన్నారు.

ఇక్క‌డ బీజేపీ వ‌స్తేనే అధికారికంగా జ‌రుగుతాయి

ఉద్యమ సమయంలో కేసీఆర్‌ సెప్టెంబర్‌ 17 అధికారికంగా జరుపుతానని చెప్పారు కానీ అధికారంలోకి వచ్చాక వాగ్దానం నిలబెట్టుకోలేదని విమర్శించారు. బీజేపీ మాత్రమే ఇచ్చిన మాట నిలబెట్టుకుందని, కేంద్ర ప్రభుత్వం ఏటా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా అధికారికంగా విమోచ‌న దినం జ‌ర‌గాలంటే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాల్సిందేన‌న్నారు. మజ్లిస్‌ భయంతో తెలంగాణ విమోచన దినోత్సవ చరిత్రను రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకాల్లో పెట్టడం లేదని విమర్శించారు. ఖాసీం రజ్వీ, రజాకార్ల వారసులకు కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌లు కవల పిల్లలవంటివన్నారు. సోనియమ్మ వందలాదిమంది యువకులను బలితీసుకున్నందున తెలంగాణ ఇచ్చామని చెప్పుకునే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కూడా తెలంగాణ తెచ్చామని చెబుతోందని, కానీ పార్లమెంటులో బిల్లు పెట్టినప్పుడు వారి ఎంపీలు హాజరే కాలేదని చెప్పారు. కాంగ్రెస్‌ 42% ఇవ్వాల్సిన బీసీ రిజర్వేషన్లలో 10% ముస్లింలకు కట్టబెట్టాలని చూస్తోంది. ఎందుకంటే వారికి ఓవైసీల మద్దతు ముఖ్యమని విమర్శించారు. తెలంగాణ సంపదను దోచుకున్నది బీఆర్‌ఎస్‌. అదే మాట స్వయంగా కేసీఆర్‌ కుటుంబ సభ్యురాలే చెబుతున్నారు. తెలంగాణ సొమ్మును దోచుకున్న డబ్బును సరిగ్గా పంచుకోలేకపోవడంతో ఈరోజు ఆ కుటుంబంలో గొడవలవుతున్నాయని వ్యాఖ్యానించారు. నేడు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు కలెక్టర్లను బెదిరించి భూకబ్జాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లకు నిజంగా ప్రజల శ్రేయస్సుపై చిత్తశుద్ధి ఉంటే, భారతదేశంపై గౌరవం ఉంటే సెప్టెంబర్‌ 17ను అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపాలని సవాల్‌ చేశారు. సెప్టెంబర్‌ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా జరిపి త్రివర్ణ పతాకం ఎగురవేయాలని రేవంత్‌ ప్రభుత్వాన్ని తాము డిమాండ్‌ చేస్తున్నామని రామచందర్‌రావు అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *