– ప్రజావాణిలో సానుకూల స్పందన
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: గల్ఫ్ లో పనిచేస్తున్న ఒక కార్మికుడు అపస్మారక స్థితిలో ఇక్కడకు వచ్చి మరణించడంతో నష్టపరిహారం అందక ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రభుత్వం జి.ఓ. నెం.216 ప్రకారం గల్ఫ్ దేశాల్లో మరణించిన వలస కార్మికుల కుటుంబాలకు ₹5 లక్షల ఎక్స్ గ్రేషియా అందజేస్తోంది. అయితే ఈ కేసులో మరణం భారత్‌లో చోటుచేసుకోవడంతో ‘మరణ స్థలం గల్ఫ్ దేశం అయి ఉండాలి’ అనే సాంకేతిక నిబంధన కారణంగా ఆర్థిక సహాయం పొందడంలో ఆటంకం ఏర్పడుతోంది. జగిత్యాల జిల్లా, జగిత్యాల రూరల్ మండలం, పొలాస గ్రామానికి చెందిన ఆరెల్లి గంగారాజం (61) కిడ్నీ సంబంధిత వ్యాధితో తీవ్ర అనారోగ్యానికి గురై, 2025 నవంబర్ 12న దుబాయిలోని ఆస్టర్ హాస్పిటల్‌లో కోమా స్థితిలో చేర్చారు. మెరుగైన చికిత్స కోసం డిసెంబర్ 14న హైదరాబాద్‌కు తరలించి, నిమ్స్‌లో చేర్చారు. అనంతరం రీహాబిలిటేషన్ సెంటర్‌లో చికిత్స పొందుతూ, చివరకు జగిత్యాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో డిసెంబర్ 24న మరణించారు. మానవతా దృక్పథంతో ప్రత్యేక కేసుగా పరిగణించి ₹5 లక్షల గల్ఫ్ ఎక్స్ గ్రేషియా మంజూరు చేయాలని మృతుడి భార్య రాజవ్వ, కుమారుడు జలంధర్ మంగళవారం హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్‌లో నిర్వహించిన “సీఎం ప్రవాసీ ప్రజావాణి” కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పేరిట వినతిపత్రం సమర్పించారు. జగిత్యాల ఎమ్మెల్యే డా. మాకునూరి సంజయ్ కుమార్‌కు దరఖాస్తు ప్రతిని పంపించారు. ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి సహకారంతో, వారు ప్రజావాణి ఇన్‌చార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డా. జి. చిన్నారెడ్డి, ప్రజావాణి నోడల్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ అధికారిణి దివ్యా దేవరాజన్ లను కలిసి తమ సమస్యను వివరించారు. వారు ఈ అంశంపై సానుకూలంగా స్పందించారు. ప్రత్యేక కేసుగా పరిగణించి గల్ఫ్ ఎక్స్ గ్రేషియా మంజూరును పరిశీలించాలని ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ వి. శేషాద్రి ని ఆదేశిస్తూ డా. జి. చిన్నారెడ్డి దరఖాస్తుపై ఎండార్స్ చేశారు. నిబంధనల ప్రకారం సాధ్యం కాని పరిస్థితిలో, ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) ద్వారా ఆర్థిక సహాయం అందించే అవకాశాన్ని పరిశీలిస్తామని ఐఏఎస్ అధికారిణి దివ్యా దేవరాజన్ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వానికి డి.ఓ. లేఖ రాస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని, ప్రవాసీ ప్రజావాణి హెల్ప్ డెస్క్ ను సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ లకు వారు విజ్ఞప్తి చేశారు. గల్ఫ్ కార్మికులు, వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి అన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వైజరీ కమిటీ ఛైర్మన్, అంబాసిడర్ డా. బి.ఎం.వినోద్ కుమార్, వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి, సీఎం ప్రవాసీ ప్రజావాణి కోఆర్డినేటర్ బొజ్జ అమరేందర్ రెడ్డి, హెల్ప్ డెస్క్ వలంటీర్లు మహ్మద్ బషీర్ అహ్మద్, భార్గవి నద్దునూరి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





