- బడ్జెట్ లో 48.00 కోట్లు కేటాయించిన ప్రభుత్వం
- సంవత్సరానికి రెండు విడతలుగా నేత మరియు అనుబంధ కార్మికులకు అందనున్న వేతన ప్రోత్సాహకం
- తెలంగాణ చేనేత వస్త్రాలకు ప్రత్యేక లేబుల్
- మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర,జూన్ 3: నేత కార్మికుల సంక్షేమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులోభాగంగానే ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి ప్రకటించిన తెలంగాణ చేనేత అభయహస్తంలో భాగంగా తెలంగాణ నేతన్నకు భరోసా (Netannaku Bharosa) పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ఈ నెల 2న జారీ చేయడం జరిగిందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ఇందుకోసం బడ్జెట్ రూ. 48.00 కోట్లు కేటాయించినట్లు మంత్రిగారు తెలిపారు. ఈ పథకం ద్వారా జియో ట్యాగ్ చేయబడిన మగ్గాలపై పనిచేస్తున్న కార్మికులకు మరియు అనుబంధ కార్మికులకు వేతన ప్రోత్సాహకం కింద గరిష్టంగా సంవత్సరానికి నేత కార్మికులకు రూ. 18,000 మరియు అనుబంధ కార్మికులకు రూ. 6,000 అందించడం జరుగుతుందన్నారు. దీంతో దాదాపు 40,000 మంది చేనేత మరియు అనుబంధ కార్మికులు లబ్ధి పొందుతారని మంత్రిగారు ఆశాభావం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా చేనేత కార్మికులు తయారుచేసిన వస్త్రాలకు ప్రత్యేకంగా తయారుచేయబడిన యూనిక్ లోగోను జతచేయడం జరుగుతుందని, తద్వారా చేనేత ఉత్పత్తుల నాణ్యత ప్రమాణాలను మరియు నేత కార్మికుని వివరాలను వినియోగదారులు తెలుసుకోవచ్చు. దీంతో తెలంగాణ చేనేత ఉత్పత్తులకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ పెరిగే అవకాశాలు ఏర్పడతాయని మంత్రిగారు తెలియజేశారు.
ఈ పథకం నేత మరియు అనుబంధ కార్మికులందరికీ వర్తిస్తుంది. 18 సంవత్సరాలు నిండి జియో ట్యాగ్ చేయబడిన మరమగ్గాలపై పనిచేసే కార్మికులు మరియు ప్రీలూమ్, ప్రిపరేటరి పనులైన డైయింగ్, టైయింగ్, డిజైనింగ్, వార్పింగ్, వైండింగ్, సైజింగ్ మొదలైన అనుబంధ పనులు చేసే కార్మికులు, చేనేత వృత్తి ద్వారా వారి వార్షిక ఆదాయంలో కనీసం 50 శాతం పొందుతున్నవారు అర్హులు.
ఈ పథకం కింద జియో ట్యాగ్ చేయబడిన మగ్గాల ద్వారా వార్పులలో కనీసం 50 శాతం కంటే ఎక్కువ పూర్తి చేసిన నేత మరియు అనుబంధ కార్మికులకు నేరుగా లబ్ధిదారుని బ్యాంకు ఖాతాలోకి వేతన ప్రోత్సాహకం కింద సంవత్సరానికి రెండు విడతలుగా (ఏప్రిల్ నుండి సెప్టెంబర్ మరియు అక్టోబర్ నుండి మార్చి) నేత కార్మికునికి రూ. 9,000, అనుబంధ కార్మికునికి రూ. 3,000 జమ చేయడం జరుగుతుంది. అయితే మొదటి విడతలో 50 శాతం వార్పులు పూర్తి చేయని వారు, రెండో విడతలో పూర్తి చేసినట్లైతే మొత్తం ప్రోత్సాహకం సంవత్సరాంతంలో చేనేత మరియు అనుబంధ కార్మికులకు అందించబడుతుందని మంత్రి తెలిపారు.





