– ‘అద్భుత ప్రపంచంలోకి మా ప్రయాణం’పై నవీన్
(మండువ రవీందర్‌రావు)
దేశ, విదేశీ యాత్రకులకు ‘అద్భుత ప్రపంచంలోకి మా ప్రయాణం’ మార్గదర్శిగా ఉంటుందన్నారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్. హనుమకొండ పోస్టల్ కాలనీలోని అభయ ఆంజనేయ దేవస్థానంలో రంగరాజు శ్యాంసుందర్‌రావు రచించిన అద్భుత ప్రపంచంలోకి మా ప్రయాణం పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. మిత్రమండలి అధ్యక్షుడు వి.ఆర్.విద్యార్థి అధ్యక్షతన ఆదివారం హనుమకొండ పోస్టల్ కాలనీలోని అభయ ఆంజనేయస్వామి ఆలయంలో జరిగిన సమావేశంలో నవీన్ మాట్లాడుతూ వివిధ ప్రాంతాలను సందర్శించేవారు కేవలం అక్కడి వింతలు, విశేషాలు చూడడానికే ప్రాధాన్యమిస్తారు. కాని శ్యాంసుందర్‌రావు వాటిగురించిన వివరాలను గ్రంథస్థం చేయడం ఆయా ప్రాంతాలను సందర్శించాలనుకునే వారికి మార్గదర్శకమవుతుందన్నారు. రచయిత తాను పర్యటించిన ప్రదేశాల్లోని ప్రకృతి సౌందర్యంతోపాటు ఆక్కడి కట్టుబాట్లు, సంస్కృతి, వేష భాషలు ఆహారపు అలవాట్లను కూడా వివరించడం నిజంగా అభినందనీయమన్నారు. అంతేగాక అనుభవమున్న రచయితలాగా సులభశైలిలో అందరికీ అర్థమయ్యే విధంగా రచన చేయడాన్నికూడా అభినందించాల్సిన విషయమన్నారు. విశిష్ట అతిథి సహృదయ అధ్యక్షుడు గిరిజా మనోహర్‌బాబు మాట్లాడుతూ అల్లసాని పెద్దన ప్రవరాఖ్యుడి కథతో ఇలాంటి రచనలకు అంకురార్పణ చేశారన్నారు. ఈ మధ్య వీరస్వామిలాంటి మరికొందరు ఇలాంటి రచనలను అందిస్తున్నారన్నారు. ఇలాంటి పుస్తకాలు వివిధ ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోవడానికి ఉపకరిస్తాయన్నారు. ఒక నదికి ఇరువైపుల ఉండే ప్రాంతాల్లోని జనం వివిధ సంస్కృతులు, సంప్రదాయాలు కలిగి ఉండటం గమనార్హం అన్నారు. కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ళ రామశాస్త్రి మాట్లాడుతూ ఈ పుస్తకం చదువుతుంటే ఆ ప్రాంతంలోనే మనం పర్యటించినట్లు ఉందన్నారు. పొట్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ జీవితమే ఒక ప్రయా ణమైతే ఆ ప్రయాణంలో మనం తిరిగినప్రదేశాలనుచూసి అనుభవించిన రచన మరోవందేళ్ళ ముందుతరాల వారికి ఉపయోగపడుతుందన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన విఆర్ విద్యార్థి మాట్లాడుతూ రచయిత వ్రాసిన ప్రాంతాల్లోకొన్ని తాను గతంలోతిరిగానని,ఈ పుస్తకం చదువుతుంటే ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసు కున్నట్లుందన్నారు. శ్యాంసుందర్‌రావు మరో పుస్తకం రాయాలని ఆయన కోరారు. కాగా రచయిత శ్యాంసుందర్ రావు మాట్లాడుతూ ఉద్యోగం చేసుకుంటూనే ఏ కాస్తా అవకాశం వచ్చినా యాత్రలకు ప్రాధాన్యం ఇచ్చేవాడినని చెప్పారు. మనదేశంలో కాశీనుండి కన్యాకుమారి వరకు దాదాపు అన్ని ప్రాంతాలు పర్యటించానని, అలేగే యూరపులోని పదిహేను దేశాలు, అమెరికాలోని ముఖ్య పట్టణాలన్ని తిరిగి వచ్చినట్లు తెలిపారు. అయితే ఇంకా గ్రంథస్థం చేయాల్సిన ప్రాంతాల విశేషాలు అనేకమున్నాయన్నారు. కార్యక్రమంలో మల్యాల మనోహర్‌రావు, వేముగంటి శుక్తిమతి, రంగరాజు శైలజలు మాట్లాడగా, రావుల నర్సింహరెడ్డి, వాసిరెడ్డి కృష్ణారావు, మండువ రవీందర్‌రావు, దిలీప్‌కుమార్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




