– రూ.100 కోట్లకుపైగా పన్ను చెల్లించకుండా మోసం
– కేషన్ ఇండస్ట్రీస్‌పై వాణిజ్య పన్నుల శాఖ దాడులు
– నకిలీ బిల్లులు, ఖాలీ వాహనాలు స్వాధీనం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 30: హైదరాబాద్‌లోని ప్రధానమైన ప్రైవేట్ సంస్థ కేషన్ ఇండస్ట్రీస్ ఎల్‌ఎల్‌పీ కంపెనీ పన్ను మోసాన్ని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది. విశ్వసనీయ సమాచారం ఆధారంగా అధికారులు సంస్థకు సంబంధించి హైదరాబాద్ ఎస్‌పి రోడ్డులోని కార్పొరేట్ కార్యాలయం, సికింద్రాబాద్‌లోని బన్సీలాల్‌పేట్ గోదాం, మెదక్ జిల్లాలోని కలకల్ ఆటోమోటివ్ పార్క్, ముప్పిరెడ్డిపల్లి గ్రామంలోని తయారీ యూనిట్లపై వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఈ సంస్థ అసలు సరకులు తరలించకుండా భారీ విలువ కలిగిన కాపర్ సరకుల సరఫరాకు సంబంధించి పన్ను బిల్లులు జారీ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఖాలీ వాహనాలను తెలంగాణ నుంచి మహారాష్ట్రకు పంపగా డాక్యుమెంట్లలో మాత్రం భారీ సరకుల రవాణా జరిగినట్టు చూపించారు. మోసపూరిత బిల్లుల మొత్తం విలువ రూ.100 కోట్లకుపైగా ఉండొచ్చని అంచనా. జాతీయ రహదారి ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ద్వారా అందిన టోల్ గేట్ డాటా విశ్లేషణ ద్వారా ఈ మోసం వెలుగులోకి వొచ్చింది. వాహనాల హడావుడి లేని పరిస్థితిలోనూ ఈ-వే బిల్లులపై అవి సరకులతో వెళ్లినట్టు చూపారు. సంస్థ సుమారు రూ.33.20 కోట్లు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్(ఐటీసీ)ను నకిలీ లావాదేవీల ద్వారా పొందినట్టు కనుగొన్నారు. ఇది తెలంగాణలో కనుగొన్న మొదటి రకం జీఎస్టీ మోసంగా అధికారులు భావిస్తున్నారు. ఇది పన్ను ఎగవేతలో ఓ కొత్త, ప్రమాదకర ధోరణిని సూచిస్తోంది. అధికారులు ఖాతా పుస్తకాలు, రిజిస్టర్లు, హార్డ్ డిస్కులు, సీసీటీవీ ఫుటేజ్ తదితర ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. సంస్థ డైరెక్టర్లు వికాష్ కుమార్ కేషన్, రజనీష్ కేషన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) డీసీపీకి అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన మరో సంఘటనలో చార్మినార్ డివిజన్ మెహదీపట్నం-1 సర్కిల్‌కు చెందిన డీఎస్‌టీవో మజీద్ హుస్సేన్ మరో మోసాన్ని గుర్తించారు. ఏపీ29టీఏ7213 అనే వాహనం జూన్ 2025 నుంచి నిశ్చలంగా ఉన్నప్పటికీ దానిని ఉపయోగించి అనేక ఈ-వే బిల్లులు జారీ చేశారు. ఇది సీజీఎస్టీ చట్టం 2017 నిబంధనలకు విరుద్ధంగా ఉండటమేకాక భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్లు 318, 336 ప్రకారం నేరకార్యంగా పరిగణించవచ్చు. ఈ విషయంపై వాహన యజమానిపై మరో ఫిర్యాదు చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు ప్రక్రియ మొదలుపెట్టారు. మొత్తంగా ప్రభుత్వానికి రావలసిన న్యాయమైన పన్ను ఆదాయాన్ని తప్పించేందుకు జరిగే అక్రమ చర్యలపై ప్రభుత్వం గట్టి పర్యవేక్షణ చేపట్టిందని, ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం అన్ని రకాల పన్ను మోసాలను అడ్డుకునేందుకు వాణిజ్య పన్నుల శాఖ కృషి చేస్తున్నదని ఆ శాఖ కమిషనర్ కె. హరిత తెలిపారు.





