– ఆరెంజ్ ట్రావెల్స్ డైరెక్టర్ సునీల్ కుమార్ అరెస్ట్
– ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీ ఎంపీ చేతన్ కూడా..
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 7: జీఎస్టీ ఎగవేత కేసులపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ హైదరాబాద్ జోనల్ యూనిట్ దాడులను ముమ్మరం చేసింది. డేటా అనలిటిక్స్, అంతర`ఏజెన్సీ సమన్వయంతో సేకరించిన ప్రత్యేక సమాచారంతో భారీ స్థాయిలో జరుగుతున్న అంతర్రాష్ట్ర పన్ను మోసాల వెనుక ఉన్న కీలక వ్యక్తులపై చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో జీఎస్టీ చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డ ఇద్దరు ప్రముఖ కంపెనీల మేనేజింగ్ డైరెక్టర్లను డీజీజీఐ అధికారులు అరెస్టు చేశారు. మంగళవారం జరిగిన ఈ అరెస్టులు పన్ను మోసాల తీవ్రతను మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి. మెసర్స్ ఆరెంజ్ ప్యాసింజర్ ట్రాన్స్‌పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ కుమార్‌పై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ప్రయాణికుల నుంచి వసూలు చేసిన రూ.28.24 కోట్ల జీఎస్టీని గడువు ముగిసి మూడు నెలలు దాటినా ప్రభుత్వ ఖజానాకు జమ చేయకుండా అక్రమంగా దాచుకున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. అదేవిధంగా మెసర్స్ ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ చేతన్ ఎన్ రూ.22 కోట్ల మేర నకిలీ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ మోసానికి సూత్రధారిగా వ్యవహరించినట్టు డీజీజీఐ గుర్తించింది. ఈ ఇద్దరిపై సీజీఎస్టీ చట్టం నిబంధనల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేసినట్టు అధికారులు తెలిపారు. వీరిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. సంఘటితంగా జరుగుతున్న పన్ను మోసాలపై కఠినంగా వ్యవహరించేందుకు ఈ చర్యలు తీసుకున్నామని డీజీజీఐ హైదరాబాద్ జోనల్ యూనిట్ స్పష్టం చేసింది. పన్ను చెల్లింపుదారులు చట్టాన్ని గౌరవిస్తూ వ్యవహరించాలని, జీఎస్టీ ఎగవేతకు పాల్పడితే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




