– రాష్ట్రాల ఆదాయం దెబ్బతినకుండా చూడాలి
– జిఎస్టీ కౌన్సిల్ భేటీలో పలు రాష్ట్రాల ఆర్థిక మంత్రుల డిమాండ్
న్యూదిల్లీ,ఆగస్ట్29: కేంద్రం వస్తు సేవల పన్ను (జిఎస్టీ) రేటు నిర్మాణాన్ని సవరించడంతో ఆదాయ నష్టాన్ని ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు పరిహారం చెల్లించాలని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు శుక్రవారం డిమాండ్ చేశాయి. జిఎస్‌టి రేటు నిర్మాణ సవరణ ప్రతిపాదనతో రాష్ట్రాలకు సుమారు రూ.1.5కోట్ల నుండి రూ.2 లక్షల కోట్ల వరకు ఆదాయ నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నాయి. ఎనిమిది రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్నాటక, కేరళ,పంజాబ్, తమిళనాడు, తెలంగాణ మరియు పశ్చిమబెంగాల్ రాష్ట్రాల ఆర్థికమంత్రులు సెప్టెంబర్ 3 మరియు 4 తేదీల్లో జరిగే తదుపరి జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో తమ ప్రతిపాదనను సమర్పించాలని నిర్ణయించారు. రేటు నిర్మాణ సవరణ, ఆదాయ నష్టాన్ని సమతుల్యం చేయడానికి అల్ట్రా లగ్జరీ, సిగరెట్ వంటి వస్తువులపై ప్రతిపాదిత 40శాతం రేటుతో పాటు అదనపు సుంకాన్ని విధించాలని సూచించాయి. ఈ లెవీ నుండి వొచ్చే ఆదాయాన్ని రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలని ప్రతిపక్షపాలిత రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆదాయ భద్రతను లెక్కించడానికి బేస్ ఇయర్‌ను 2024-25గా నిర్ణయించాలని ఎనిమిది రాష్ట్రాలు డిమాండ్ చేశాయి. ప్రతిపాదిత అదనపు లెవీ విధించిన తర్వాత కూడా లోటు ఉంటే, కేంద్ర ప్రభుత్వం అదనపు లెవీ భవిష్యత్ రసీదులకు బదులుగా సెక్యూరిటీ కల్పించబడిన రుణాలను సేకరించాలని రాష్ట్రాలు తమ ప్ర తిపాదనలో పేర్కొన్నాయి.
సమావేశం అనంతరం ఎనిమిది రాష్ట్రాల ఆర్థికమంత్రులు డియాతో మాట్లాడారు. రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను కాపాడాలని వారు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలకు నష్టం కలిగితే.. ప్రజలు, అభివృద్ధి పనులు ప్రభావితమవుతాయని, రాష్ట్ర స్వయంప్రతిపత్తికూడా దెబ్బతింటుందని అన్నారు. ప్రతి రాష్ట్రం ప్రస్తుత జిఎస్‌టి ఆదాయంలో 15-20శాతం నష్టపోతున్నట్లు అంచనా వేశామని కర్నాటక ఆర్థికమంత్రి కృష్ణబైరె గౌడ తెలిపారు. 20శాతం ఆదాయనష్టం దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక నిర్మాణాన్ని తీవ్రంగా అస్థిరపరుస్తుందని అన్నారు. ఆదాయం స్థిరీకరించే వరకు రాష్ట్రాలకు ఐదేళ్ల పరిహారం చెల్లించాలని సూచించారు. జిఎస్‌టి అమల్లోకి వచ్చినపుడు ఆదాయ తటస్థ రేటు 14.4శాతం ఉందని, తర్వాత పన్ను రేటు నిర్మాణ సవరణ తర్వాత నికర పన్ను రేటు 11శాతానికి తగ్గింది. జిఎస్‌టి రేట్లను తగ్గించడం, స్లాబ్‌లను సవరించడం అనే కేంద్ర ప్రభుత్వ ప్రస్తుత ప్రతిపాదనతో నికర పన్ను రేటు 10శాతానికి పడిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.రేటు నిర్మాణ సవరణకు తాము అంగీకరి స్తున్నామని, అయితే రాష్టాల్రకు పరిహారం చెల్లించాలని హిమాచల్ ప్రదేశ్ సాంకేతిక విద్యమంత్రి రాజేష్ ధర్మాని పేర్కొన్నారు. రేటు నిర్మాణ సవరణ ప్రయోజనాలు సామాన్యులకు చేరేలా, లాభాలను గుర్తించేందుకు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని పంజాబ్ ఆర్థికమంత్రి హర్పాల్ సింగ్ చీమ డిమాండ్ చేశారు.
రేషనలైజేషన్‌తో రెవెనూ్యపై ప్రభావం: భట్టి విక్రమార్క
జీఎస్టీ రేట్ రేషనలైజేషన్ పేరుతో రాష్ట్రాలకు రెవెన్యూ తగ్గే ప్రమాదం ఉందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఫెడరల్ స్ఫూర్తితో కేంద్రం వ్యవహరించాలని అన్నారు. దిల్లీలో జరిగిన సమావేశంలో జిఎస్టి రేషనలైజేషన్ అంశంపై సుదీర్ఘ చర్చ జరిగిందన్నారు. ఈ సందర్భంగా భట్టి డియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు బాగేంటేనే.. దేశం బాగుంటుందని తెలియజేశారు. రేషనలైజేషన్ ను ఆహ్వానిస్తూనే రాష్ట్రాలకు జరిగే నష్టానికి..పరిహారం చెల్లించే మార్గాలను కేంద్రం ఆలోచించాలని కోరారు. సెప్టెంబర్ 3న మరోసారి దిల్లీలో 8 రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో తమ డిమాండ్లు లేవనెత్తాలని కేంద్రం నిర్ణయం తీసుకోవాలని భట్టి విక్రమార్క సూచించారు. జీఎస్టీ సంస్కరణలతో తెలంగాణ రాష్ట్రానికి రూ.7వేల కోట్లు నష్టం వస్తుందని అంచనా ఉన్నట్లు మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. దిల్లీలో జరిగిన ’జీఎస్టీ సంస్కరణలపై ప్రతిపక్ష పార్టీ పాలిత రాష్ట్రాల సమావేశం’లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ తరఫున భట్టి విక్రమార్క హాజరుకాగా.. తమిళనాడు, కర్ణాటక, కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఝార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరయ్యారు. జీఎస్టీ సంస్కరణలతో కలిగే నష్టానికి పరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా మంత్రులు డిమాండ్ చేశారు. కొత్త జీఎస్టీ ప్రతిపాదనలతో మొత్తంగా రూ.2లక్షల కోట్ల వరకు నష్టం వాటిల్లుతుందని అంచనా వేశారు. జీఎస్టీ కౌన్సిల్ భేటీలో తమ ప్రతిపాదనలు సమర్పిస్తామని చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




