– వికసిత భారత్ లక్ష్యసాధనలో కీలక పాత్ర పోషించాలి
– సంస్థ 175వ వార్షికోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
జైపూర్, నవంబర్ 20: జియోజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్‌ఐ) 1851 నుంచి 175 సంవత్సరాలుగా దేశ భౌగోళిక వారసత్వానికి నిరంతరాయంగా ఎన్నో సేవలు అందిస్తోందని, దేశ పరిశ్రమల వృద్ధికి అవసరమైన బొగ్గు, ఇనుము వంటి కీలకమైన ఖనిజాలను గుర్తించడంలో కీలక పాత్ర పోషించిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. దీంతోపాటు మౌలిక వసతుల అభివృద్ధి, ఇంధన భద్రత, వాటర్ మేనేజ్‌మెంట్, పర్యావరణ పరిరక్షణ, విపత్తు నిర్వహణలో కూడా విశేషమైన సేవలందిస్తోందని చెప్పారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో గురువారం జరిగిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 175వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. 1947లో దేశీయ పరిశ్రమ కేవలం రూ.58 కోట్ల విలువతో ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా రూ.1.2 లక్షల కోట్లకు ఎదిగిందని, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారనున్న క్రమంలో జీఎస్‌ఐ మరింత కీలకంగా మారనుందని చెప్పారు. 21వ శతాబ్దంలో ఖనిజాల ముఖ్యంగా క్రిటికల్ మినరల్స్ అవసరం చాలా ఉందని, నెట్ జీరో ఉద్గార ఆర్థిక వ్యవస్థగా ఎదిగే లక్ష్యంగా భారత్ ముందుకు వెళ్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో లిథియం, కోబాల్ట్, నికెల్, రేర్ ఎర్త్స్, గ్రాఫైట్, కాపర్ వంటి మినరల్స్‌కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ భారీగా ఉందని, దీన్ని మనం ఛాలెంజ్‌గా తీసుకోవడంతోపాటు ఓ అవకాశంగా మలుచుకోవాలని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రిఫార్మ్, పర్ఫామ్, ట్రాన్స్‌ఫామ్ ఆలోచనకనుగుణంగా జీఎస్‌ఐ అద్భుతంగా పనిచేస్తోందంటూ భవిష్యత్తులో వచ్చే సవాళ్లను కూడా ఎదుర్కొని ముందుకు సాగేలా పనిచేస్తూ వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఈ దిశగా కేంద్ర గనుల శాఖ ద్వారా నేషనల్ మినరల్ పాలసీ తీసుకురావడంతోపాటు మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్ చట్టంలో మార్పులు తెచ్చామని, నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కూడా తీసుకొచ్చామని, గనుల కేటాయింపులో వేలం ప్రక్రియ తీసుకొచ్చినప్పటి నుంచి 500కు పైగా గనులకు వేలం నిర్వహించామని, గనుల కేటాయింపులో పారదర్శకత తీసుకురావడంతోపాటు పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కలిగించామని మంత్రి కిషన్‌రెడ్డి వివరించారు. 34 క్రిటికల్ మినరల్స్ బ్లాకులకు వేలం వేశామని, ఖనిజాల వెలికితీత ప్రక్రియలో గత పదేళ్లలో 160% వృద్ధి నమోదు చేశామని, విదేశాల్లో కూడా ఖనిజాల వెలికితీతకు గనులను లీజుకు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ సంస్థలతో మనం పోటీ పడే ప్రయత్నంలో జీఎస్‌ఐ సాంకేతికతంగా అప్‌గ్రేడ్ అవ్వాల్సిన అవసరం ఉందన్నారు. వికసిత భారత నిర్మాణం దిశగా మనం దూసుకెళ్తున్న నేపథ్యంలో మరిన్ని వనరులను వెలికితీయడం, సుస్థిరమైన పద్ధతుల్లో ఖనిజాల తవ్వకాలు చేపట్టడంతోపాటు దేశీయ సాంకేతికతను అభివృద్ధి చేయాలని కిషన్‌రెడ్డి సూచించారు. రానున్న 25 ఏళ్లలో జీఎస్‌ఐ గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా తయారై మరింతమంది జియో సైంటిస్టులకు గ్రీన్ టెక్నాలజీని అందిపుచ్చుకునేలా శిక్షణ అందించాలని ఆకాంక్షించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





