పార్టీలు, వర్గాలకతీతంగా ‘గృహ జ్యోతి’

– భవిష్యత్తులోనూ ఈ పథకాన్ని కొనసాగిస్తాం
– కొత్తవారు ప్రజా పాలన కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు
– శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 3ః పేద, బడుగు వర్గాలు ఆత్మగౌరవంతో తలెత్తుకొని జీవించడమే తమ ప్రభుత్వ లక్ష్యమ‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు తెలిపారు. అందులో భాగంగా గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తున్నామ‌ని చెప్పారు. శనివారం అసెంబ్లీలో సభ్యులు జి.మధుసూదన్, నాగరాజు, కవ్వంపల్లి సత్యనారాయణ తదితరుల ప్రశ్నలకు డిప్యూటీ సీఎం స‌మాధాన‌మిచ్చారు. పార్టీలు, వర్గాలకతీతంగా రాష్ట్రంలోని అర్హులైన వారందరికీ ఈ పథకం వర్తిస్తుందని, భవిష్యత్తులోనూ ఈ పథకాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఈ పథకం కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాల‌నుకునేవారు, మార్పులు, చేర్పుల కోసం ఎంపీడీవో కార్యాలయంలోని ప్రజా పాలన అధికారులను కలిసి దరఖాస్తు చేసుకోవచ్చున‌ని, పాత వారు కూడా వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చని వివరించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చామని భ‌ట్టి పేర్కొన్నారు. ఈ పథకం కింద ఎస్పీడీసీఎల్ పరిధిలో 25,35,560, ఎన్పీడీసీఎల్ పరిధిలో 27,46,938 కుటుంబాలు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పథకం ద్వారా ల‌బ్ది పొందుతున్నాయని వివరించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈరోజు వరకు గృహ జ్యోతి లబ్ధిదారుల పక్షాన రూ.3,593 వేల కోట్లు ఇప్పటివరకు చెల్లించిందని తెలిపారు. ఈ పథకం ద్వారా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 45,995 కుటుంబాలు, అచ్చంపేట నియోజకవర్గంలో 40,555, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ లో 65,862, సిద్దిపేట నియోజకవర్గంలో 50,398 కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని మంత్రి తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *