` పునఃమూల్యాంకన ఆదేశాలపై స్టే
– సింగిల్ జడ్జి ఉత్తర్వులు రద్దు చేసిన ధర్మాసనం
– విచారణ అక్టోబర్ 16కు వాయిదా
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24: గ్రూప్-1 పరీక్షలను రద్దు చేయాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు స్టే విధించింది. ఈ అంశంలో టీజీపీఎస్సీకి హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్-1 నియామకాలు చేపట్టుకోవచ్చని స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 16కి వాయిదా వేసింది. గ్రూప్-1 తుది మార్కుల జాబితా, జనరల్ ర్యాంకింగ్స్‌ను రద్దు చేస్తూ ఇటీవల సింగిల్ బెంచ్ తీర్పు వెలువరించింది. మెయిన్స్ జవాబు పత్రాలను ఎనిమిది నెలల్లో పునఃమూల్యాంకనం చేయించాలని, లేదంటే పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది. సింగిల్ బెంచ్ తీర్పుపై టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసింది. దీనిపై బుధవారం విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. 2011లో గ్రూప్-1 నిర్వహించారని, ఆ తర్వాత 2022లో నిర్వహిస్తే సుప్రీంకోర్టు రద్దు చేసిందని, 14 ఏళ్ల తర్వాత గ్రూప్-1 నియామకాలు జరుగుతున్నాయని, ఈ సమయంలో పక్రియను సింగిల్ బెంచ్ రద్దు చేసిందని తెలిపారు. తెలుగులో మెయిన్స్ జవాబులు రాసిన వారిపట్ల పక్షపాతం చూపించారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కోర్టుకు ఏజీ తెలిపారు. దీనిపై సీజే జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్ స్పందిస్తూ మాల్ ప్రాక్టీస్, పేపర్ లీక్ వంటి ఘటనలు ఏమైనా చోటుచేసుకున్నాయా.. పక్షపాతం చూపించారనడానికి ఏమైనా ఆధారాలున్నాయా అని ఏజీని ప్రశ్నించారు. ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయారని ఆయన తెలిపారు. ఏపీలో నిర్వహించిన గ్రూప్స్ పరీక్షల్లో తెలుగులో రాసిన అభ్యర్థులు తక్కువగా ఎంపికయ్యారని చెప్పారు. కోఠి మహిళా విశ్వవిద్యాలయంలో పురుషులకు వాష్‌రూమ్‌లు లేవని.. అందుకే ఆ రెండు కేంద్రాలను మహిళలకు మాత్రమే కేటాయించామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దివ్యాంగులను దృష్టిలో ఉంచుకుని వాళ్లకు సవిూపంలోని కేంద్రాలు కేటాయించామన్నారు. హాల్ టికెట్ల జారీ విషయంలో టీజీపీఎస్సీకి అధికారం ఉంటుందని.. పరీక్ష కేంద్రాల కేటాయింపును తప్పుబట్టలేమని సీజే అన్నారు. అనంతరం సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధిస్తూ డివిజన్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. తుది తీర్పునకు లోబడే నియామకాలు ఉంటాయని సీజే జస్టిస్ ఏకే సింగ్ స్పష్టం చేశారు. డివిజన్ బెంచ్ స్టే విధించడంతో గ్రూప్-1 ర్యాంకర్లకు ఊరట లభించింది. ఈ తీర్పుతో పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





