కాంగ్రెస్‌ పాలనలోనే గ్రూప్‌-1 నియామకాలు

– గత పదేళ్లలో నిరుద్యోగుల కలలు కల్లలయ్యాయి
– నేడు ప్రజా పాలనలో నిజమవుతున్నాయి
– స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖకు వన్నె తేవాలి
– రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు కన్న కలలు గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో కలలుగానే మిగిలాయని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం వారి కలలను నిజం చేస్తోందన్నారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా గ్రూప్‌-1 నియామకాల్లో ఎంపికై స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలో జిల్లా రిజిస్ట్రార్లుగా నియమితులైన పలువురు అభ్యర్థులు సచివాలయంలో మంత్రిని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వారిని అభినందించారు. ప్రజా ప్రభుత్వం అనేక కార్యక్రమాలతో ముందుకు వెళుతోందని, ఈ కీలక సమయంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న అభ్యర్థులపై గురుతరమైన బాధ్యత ఉందని అన్నారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌ హయాంలో 2011లో గ్రూప్‌-1 కు నోటిఫికేషన్‌ జారీ చేయగా 2018లో భర్తీ ప్రక్రియ పూర్తయిందని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేస్తే మీరేంది భర్తీ చేసేది.. తెలంగాణ సాధించుకున్న తర్వాత స్వరాష్ట్రంలో మా ఉద్యోగాలను మేమే భర్తీ చేసుకుంటామని నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తించి అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తని బీఆర్‌ఎస్‌ నాయకులు ఈ రోజు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని విమర్శించడం శోచనీయమన్నారు. ఉద్యోగాలు ఇవ్వాలన్నా, పేదలకు అండగా ఉండాలన్నా కాంగ్రెస్‌ ప్రభుత్వాలతోనే సాధ్యమంటూ రాష్ట్రంలో తొలిసారిగా గ్రూప్‌-1 పోస్టులు భర్తీ చేసి ప్రజాప్రభుత్వం చరిత్ర సృష్టించిందని ఆయన తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ, ప్రత్యేక రాష్ట్రంలోనూ గ్రూప్‌-1 పరీక్షలు నిర్వహించి నియామకాలు జరిపిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనన్నారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన టీజీ-పీఎస్సీని పూర్తిగా నిర్వీర్యం చేశారని, తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే పూర్తిగా ప్రక్షాళన చేసి గ్రూప్‌-1, గ్రూప్‌-2 నోటిఫికేషన్లు జారీ చేయడమేకాక ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తోందని చెప్పారు. ఏడాదిన్నరలోనే దాదాపు 60 వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేశామని అన్నారు. ఇది చూసి ఓర్వలేని కొంతమంది ప్రభుత్వంపై విషం కక్కుతున్నారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వం స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖను ఒక ఆదాయ వనరుగానే చూసిందని, తమ ప్రజా ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిందని చెప్పారు. ప్రజల సమయాన్ని ఆదా చేసేలా
స్లాట్‌ బుకింగ్‌ విధానాన్ని తీసుకొచ్చామని, కార్పొరేట్‌కు దీటుగా అత్యంత ఆధునిక వసతులతో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను నిర్మిస్తున్నామని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వాడుకొని అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆలోచనలకు, ఆకాంక్షలకు అనుగుణంగా నిజాయతీతో, నిబద్ధతతో విధులు నిర్వర్తించి ప్రభుత్వ పేరు ప్రతిష్ఠలను పెంచాలని కొత్తగా నియమితులైన జిల్లా రిజిస్ట్రార్లకు మంత్రి పొంగులేటి సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *