– ఇది పూర్వజన్మ సుకృతం
– ఆరెంపులలో వేడుకగా ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు
– రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి
పాలేరు/హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు చూస్తుంటే ఆనందంతో తన కళ్లు చెమ్మగిల్లుతున్నాయని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భగవంతుడు ఇచ్చిన ఈ అవకాశంతో మనసు ఉప్పొంగుతోందని, ఈ జన్మకు ఇంతకంటే మధురక్షణాలు లేవని అన్నారు. పాలేరు నియోజకవర్గంలోని ఆరెంపుల గ్రామంలో బుధవారం జరిగిన ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాల కార్యక్రమంలో ఆయన సంప్రదాయ వస్త్రాలతో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఎన్నికల హామీలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల గురించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెబితే ప్రతిపక్షాలు హేళన చేశాయని, ఈ ప్రభుత్వానికి నిధులు లేవని, ఇళ్ల కోసం కాగితం ముక్కలిచ్చి ప్రజలను మోసం చేస్తారని ఎద్దేవా చేశారని గుర్తుచేశారు. అవన్నీ వట్టిమాటలే అని నిరూపిస్తూ ఇప్పుడు రాష్ట్రంలో 4.50 లక్షల ఇండ్లను నియోజకవర్గానికి 3,500 చొప్పున మంజూరు చేయడమేగాక గృహప్రవేశాలు ప్రారంభం కావడం ఆనందకరమని అన్నారు. గతంలో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లను కట్టించారని, ఇప్పుడు మళ్లీ రేవంత్‌రెడ్డి నాయకత్వంలో మళ్లీ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరుగుతోందని ఆయన తెలిపారు. ఎక్కడా రూపాయి అవినీతి జరగకుండా పథకం ముందుకు సాగుతోందన్నారు. నియోజకవర్గ ప్రజల అభిమానంతో ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రివర్గంలో పేదలకు గూడు కల్పించే హౌసింగ్ శాఖకు మంత్రి కావడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. గత ప్రభుత్వం పేదలకు ఇండ్లు కడితే కమీషన్లు రావన్న ఆలోచనతో కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి భారీ అవినీతికి పాల్పడిరదన్నారు. అప్పటికి ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో ఏడాదికి లక్ష ఇండ్లు కట్టినా పదేళ్లలో పేదలకు పది లక్షల ఇండ్లు దక్కేవన్నారు. కమీషన్ల కక్కుర్తితో కాళేశ్వరానికి పునాది వేసిందీవారే, ప్రారంభించిందే వారేనని, అయితే భగవంతుడు ఈ అన్యాయాన్ని చూసినందున ఆ ప్రభుత్వాధినేత దొరవారు దిగిపోయే నెలన్నర ముందు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని, దీంతో వారి వ్యవహారం బట్టబయిలైందని పొంగులేటి అన్నారు. ఈ అవినీతిపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో విచారణ జరిపిస్తే వారి అవినీతి కథకథలుగా బయటపడిరదన్నారు. నియోజకవర్గంలో 5లక్షల మెట్రిక్ టన్నులకు పైగా సామర్థ్యం కలిగిన గోదాములు కట్టి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. రానున్న యాసంగిలో కూడా రైతులకు బోనస్ ఇస్తామని తెలిపారు. ఈ సందర్బంగా నూతన రేషన్ కార్డుల మంజూరు, గత 21 నెలల్లో ప్రభుత్వం అందిస్తున్న పధకాల గురించి వివరించి రానున్న కాలంలో ప్రభుత్వానికి ప్రజలు మరింత మద్దతు తెలపాలని మంత్రి పొంగులేటి కోరారు. కార్యక్రమంలో భాగంగా మహిళలకు రేషన్ కార్డుల అందజేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




