ఇద్దరికీ అభివాదాలు : ఒకరు వీర తెలంగాణ, ఇంకొకరు జీవ తెలంగాణ

“బతుకమ్మ పండుగ వస్తుండగా, అది విమోచనా లేదా విలీనమా అది కాకుండా మరొకటా అంటూ ఎడతెగని చర్చ ప్రతి ఏటా సెప్టెంబర్ 17న చర్చ జరిగే రోజున, ఈ సమయాన ఇద్దరు కళాకారులు మదిలోకి వస్తారు. వారిద్దరూ ఫొటోగ్రాఫర్లే. అందులో ఒకరు మహత్తర తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఛాయాచిత్రాల్లో పదిలపరిచిన ఫొటోగ్రాఫర్ శ్రీ సునీల్ జనా. రెండవ వారు మలిదశ తెలంగాణ ఉద్యమానికి పూర్వమే చెరగిపోని తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వమైన బతుకమ్మను ఆపురూపంగా పదిలపరిచిన భరత్ భూషణ్. ఒకరు పోరాట వారసత్వాన్ని చరిత్రలో పదిలపరిచారు. మరికరు జీవన పోరాటంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అడుగంటి పోని మన సంస్కృతిని అజరామరం చేశారు. ఒకరిది వీర తెలంగాణ ఐతే మరొకరిది జీవ తెలంగాణ.”

బతుకమ్మ పండుగ వస్తుండగా, అది విమోచనా లేదా విలీనమా అది కాకుండా మరొకటా అంటూ ఎడతెగని చర్చ ప్రతి ఏటా సెప్టెంబర్ 17న చర్చ జరిగే రోజున, ఈ సమయాన ఇద్దరు కళాకారులు మదిలోకి వస్తారు. వారిద్దరూ ఫొటోగ్రాఫర్లే. అందులో ఒకరు మహత్తర తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఛాయాచిత్రాల్లో పదిలపరిచిన ఫొటోగ్రాఫర్ శ్రీ సునీల్ జనా. రెండవ వారు మలిదశ తెలంగాణ ఉద్యమానికి పూర్వమే చెరగిపోని తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వమైన బతుకమ్మను ఆపురూపంగా పదిలపరిచిన భరత్ భూషణ్.

ఒకరు పోరాట వారసత్వాన్ని చరిత్రలో పదిలపరిచారు. మరికరు జీవన పోరాటంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అడుగంటి పోని మన సంస్కృతిని అజరామరం చేశారు. ఒకరిది వీర తెలంగాణ ఐతే మరొకరిది జీవ తెలంగాణ.ఒకరు బెంగాల్ లో జన్మించి అమెరికాలో స్థిరపడి అక్కడే మరణించారు. మరొకరు ఇక్కడే ఉండి నానా ఇబ్బందులు పడి 2022లో కాలం చేశారు. సునీల్ జనాకి 2012 లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ ఇవ్వడం విశేషం. భరత్ భూషణ్ గారు పద్మశ్రీ అందుకోకుండానే కన్నుమూయడం విచారకరం.సునీల్ జనా తెలంగాణ సాయుధ పోరాటాన్ని చరిత్రలో భావితరాలు ఒక నమ్మదగిన అధ్బుతం, అసాధారణ పోరాటం అనడానికి గాను ఎంతో విశ్వసనీయ చారిత్రక ఆధారాలుగా పలు ఛాయాచిత్రాలను మనకు వదిలి వెళ్లారు. ఆ చిత్రాల కంపోజిషన్స్ వారి కళా కౌశాలన్నే కాదు, వీరోచిత పోరాటం పట్ల వారికున్న అచంచల విశ్వాసాన్ని కూడా వ్యక్తపరిస్తాయి. ప్రసిద్ధ చిత్రకారులు చిత్రప్రసాద్ బొమ్మలతో బెంగాల్ కరువును చిత్రించగా సునీల్ జనా ఫోటోగ్రఫీ చేశారు.

సునీల్ జనా సాయుధ పోరాట చిత్రాలను అమెరికాలో ఉండే వారి కుమారులు అర్జున్ జనా దగ్గరి నుంచి ఒరిజినల్స్ సంపాదించి మనం జాగ్రత్త చేసుకోవాల్సి ఉంది. ఐతే, కొన్నేళ్ళ క్రితం ఈ వ్యాసకర్త రాసిన ఉత్తరానికి వారు జవాబు రాస్తూ, తానున్న ప్రస్తుత స్థితిలో తండ్రి ఫోటోగ్రాఫ్స్ గురించి అలోచించి మనకు అందించే స్థితిలో లేనని జవాబిచ్చారు. నిజానికి తన సోదరి అంటే సునీల్ జనా కూతురు తండ్రి వారసత్వ సంపదను భధ్రపరిచారట. కానీ ఆమె అకస్మాత్తుగా మరణించిన కారణంగా వాటి పట్ల శ్రద్ధ చూపే వారెవరూ కుటుంబంలో లేరు. కాగా, ఆ చిత్రాలు సునీల్ జనా ఉన్నప్పుడే డిల్లీలో ప్రదర్శితమాయ్యాయి. కార్టూనిస్ట్ మోహన్ గారు చొరవ తీసుకుని వాటి జిరాక్స్ ప్రతులను అట్టలకు అతికించిన A 4 సైజు బొమ్మలుగా చాలాకాలం చూపించారు. వాటిని తీసుకుని నేను నిర్వహించే సామాన్యశాస్త్రం గ్యాలరీలో వీక్షకుల సందర్శనార్థం ఉంచాను. బతుకమ్మ ఎడిటర్ గా ఉన్నప్పుడు వాటిని స్కాన్ చేసి కొన్ని మాసాలు సీరియలైజ్ చేశాను కూడా. ఈ బొమ్మలనే ప్రజాశక్తి వారు ఒక చిన్న పుస్తకంగా తెచ్చారు. ఐతే, ఫోటోగ్రాఫర్ రవీందర్ రెడ్డి గారి వద్ద కూడా ఆ మొత్తం చిత్రాల్లో అధికభాగం మరింత క్వాలిటీతో జాగ్రత్త చేసి పెట్టారు. వాటిని ప్రింట్ చేసి శాశ్వతంగా ఈ ఘన చరిత్రను ప్రజల వద్దకు చేర్చడం గొప్ప స్ఫూర్తిదాయకం.

timestampe=1758020846

ఈ తరుణంలో సునీల్ జనాతో పాటు తప్పక యాది చేసుకునే వ్యక్తి భరత్ భూషణ్ గారు. వారు కాగితం పూల బతుకమ్మలతో పండుగ జరుపుకున్న ఒకనాటి తెలంగాణని మాత్రమే గాక, జాజు సున్నం గోడల మధ్య నుంచి బతుకమ్మతో నడిచి వచ్చే మన అచ్చమైన ఆత్మను, జానపద చేతనను ఎంతో గొప్పగా పట్టుకుని ప్రపంచంలోకి శక్తి కొద్ది తెచ్చారు. ఇప్పటి యాంత్రిక జీవనంలో, నూతన హంగు ఆర్భాటాలతో సాగే నేటి బతుకమ్మకు వారి చిత్రాలు భిన్నమైనవి. దాదాపు ఒక వంద చిత్రాలతో వారు తన ఇంట్లోనే ఎంతోమంది కవులు, రచయితలు, కళాకారులు, మేధావులకు చూపించి వారి అభిప్రాయాలను అక్షరాలా రాయించారు. అవన్నీ వారి చిత్రాలతో గనుక ఒక కాఫీ టేబుల్ బుక్ గా వస్తే అది భావితరాలకు గొప్ప కానుకే అవుతుంది.

భరత్ భూషణ్ ‘బతుకమ్మ’, సునీల్ జనా ‘పోరు బతుకమ్మ’. ఈ రెండూ తెలంగాణ ప్రజల సందర్శనార్థం రెండు అపురూప గ్యాలరీలుగా ఎప్పటికైనా ఉండవలసినవి. ప్రభుత్వాలు తప్పనిసరిగా చేయదగ్గ పని. భరత్ భూషణ్ గారేకాక బతుకమ్మను చాలామంది చిత్రించారు. కానీ వీరి చిత్రాల్లో ఈ పండుగ బొడ్డెమ్మ నుంచి బతుకమ్మ దాకా నమోదైన తీరు అద్వితీయం. వారే గనుక బతుకమ్మను అంత చక్కటి ఈస్తటిక్స్ తో గనుక చిత్రించి పెట్టకపోతే ఒక తరం ఆటా పాటా – బొడ్డెమ్మ, బతుకమ్మ తాలూకు వినిర్మల జీవన లాస్యం కనుమరుగే అయ్యేది. అలాగే సునీల్ జనా ఫొటోలే లేకుంటే తెలంగాణా ఘనమైన పోరాట చరిత్ర ఎప్పటికీ అమూర్తంగా ఉండేది. ఆ పోరాటాన్ని మన పెద్దలు ఎట్లా ఆర్గనైజ్ చేశారూ అన్నది కేవలం సాహిత్యం మీదే ఆధారపడి పోల్చుకోవాల్సిన దుస్థితి వచ్చేది. వీరిద్దరినీ ఒక్క చోట చెప్పడం ఎందుకంటే, ఒకరు చరిత్రలో సాయుధ పోరాటం అన్నది కల్పన అని కొట్టిపారేయలేని విధంగా పదిలం చేయగా మరొకరు చరిత్రలో తెలంగాణ పునరుజ్జీవన సంకేతాన్ని ముందస్తుగా బతుకమ్మ ద్వారా చిత్రీకరించి పెట్టినందున. ప్రతి ఏటా… ఒక విముక్తి సందర్భాన.. పండుగ సంబురాన…వారి స్మృతి సదా మననంలోకి వస్తుంది. మన గత చరిత్రకు దాఖలాలుగా నిలిచిన వారిని స్మరించుకోవడం కళాకారులుగా మన కనీస ధర్మం.

కందుకూరి రమేష్ బాబు
స్వతంత్ర పాత్రికేయులు, ఛాయాచిత్రకారులు
మొబైల్ – 9948077893

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *