– ఖమ్మం జిల్లాలో ప్రజాపాలన దినోత్సవం
-ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని ఖమ్మం కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖల మంత్రి భట్టి విక్రమార్క ప్రసంగిప్తూ జిల్లాలో అమలవుతున్న వివిధ పథకాల గురించి, ఆయా లబ్ధిదారులకు కలుగుతున్న ప్రయోజనాల గురించి వివరించారు. తెలంగాణ గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా 2030 నాటికి రూ.లక్షా 98 వేల కోట్ల పెట్టుబడితో 20 వేల మెగావాట్ల పునర్వినియోగ శక్తి ఉత్పత్తి, లక్షా 14 వేల మందికి ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యంగా ముందుకు వెళుతున్నామన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాల ద్వారా 2 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఉత్పత్తికి ప్రణాళికలు చేపట్టామన్నారు. ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం కింద 2025-26 ఆర్థిక సంవత్సరం లో జిల్లాలో 550 మంది లబ్దిదారులను ఎంపిక చేసి మోడల్ సోలార్ విలేజ్ స్కీంలో భాగంగా 16,837 కుటుంబాలకు 2 కిలోవాట్ రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్, 4,371 వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు 7.5 కిలోవాట్ సోలార్ ప్లాంట్ ఉచితంగా అందిస్తున్నామన్నారు. అలాగే జిల్లాలో ఇప్పటివరకు నూతనంగా మంజూరు చేసిన తెల్ల రేషన్ కార్డులు, లబ్ధిదారుల, ఆరు గ్యారంటీ పథకాల గురించి వివరించారు. సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలో లక్షా 38 వేల 790 ఎకరాలలో కొత్త ఆయకట్టుకు సాగునీటి వసతి కల్పిస్తున్నామని, దీని ద్వారా నాగార్జునసాగర్ ఎడమ కాలువ, వైరా, లంక సాగర్ ప్రాజెక్టులు, చిన్న నీటివనరుల సాగునీటి సప్లిమెంట్ చేసేందుకు పాలేరు లింక్ కాలువ నిర్మాణ పనులు చేపట్టామని భట్టి వివరించారు. రఘునాథపాలెం మండలంలో చెరువుల కింద సాగునీటి సరఫరా చేసేందుకు మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి 455 ఎకరాలకు కొత్త ఆయకట్టు, 1957 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ పూర్తి చేశామన్నారు. మున్నేరు నుండి సీతారామ ఎత్తిపోతల పథకం లింక్ కెనాల్ పనులు రూ.107 కోట్లతో మంజూరు చేశామని, మున్నేరు నది ఇరువైపులా రూ.525 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం, మధిర మండలాల్లో నాగార్జునసాగర్ జోన్-3 ఆయకట్టు రైతులకు సాగునీరందించేందుకు రూ.630 కోట్లతో చేపట్టిన జవహర్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశామని ఆయన తెలిపారు. ఈ పనులు పూర్తిచేసి 33 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరిస్తామన్నారు. జిల్లాలో ఆర్‌నండ్‌బీ శాఖ ద్వారా రూ.180 కోట్లతో మున్నేరు నదిపై తీగల వంతెన నిర్మాణ పనులు, రూ.130 కోట్లతో వైద్య కళాశాల భవన నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. రూ.139 కోట్లతో పది రెండు వరుసల రహదారులను నాలుగు వరుసల రహదారులుగా విస్తరించామన్నారు. పర్యావరణ సమతుల్యత పాటించడానికి, భూతాపాన్ని తగ్గించడానికి ప్రభుత్వం వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు.
కార్యకర్త ఇంట్లో కాఫీ తాగిన ఉప ముఖ్యమంత్రి
చింతకాని మండలం నాగిలికొండ గ్రామంలో పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పగడాల రాజు ఇంట్లో భట్టి విక్రమార్క కాఫీ తాగారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, ప్రజలతో మాట్లాడుతూ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. సంక్షేమ పథకాలు అందుతున్న తీరుపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు, రూ.500లకే సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరా మహిళా డైరీ వంటివి నిరుపేదలకు ఒక వరంగా నిలిచాయని ప్రజలందరూ ముక్తకంఠంతో చెప్పారు. సంక్షేమ ఫలాలు చిట్టచివరి వ్యక్తి వరకు అందించడమే ప్రజా ప్రభుత్వం ముఖ్య లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





