– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
– ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 15: సర్దార్ వల్లభాయ్ పటేల్ 560కి పైగా చిన్నచిన్న రాజ్యాలను ఏకీకృతం చేసి ఒక మహత్తరమైన భారత దేశాన్ని నిర్మించిన మహానుభావుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు కొనియాడారు. ఉక్కు మనిషిగా పేరుగాంచిన భారత ప్రథమ హోం శాఖ మంత్రి సర్దార్ పటేల్ వర్ధంతి సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రామచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ ఆ రోజుల్లో హైదరాబాద్ స్టేట్ దేశంలో భాగమై ఈ రోజు మనం గర్వంగా భారతీయులమని చెప్పుకుంటున్నామంటే అందుకు కారణం పటేల్ అని చెప్పారు. దేశానికి మొదటి హోంశాఖ మంత్రిగా ఉన్న సర్దార్ పటేల్‌ని జవహర్‌లాల్ నెహ్రూ ఎదుర్కొన్నారని, రాజకీయంగా ముందుకు వెళ్లాలంటే అవసరమైతే రాజ్యాంగాన్ని కూడా పక్కన పెట్టొచ్చు అనే వ్యాఖ్యలు చేసిన సందర్భాలున్నాయని గుర్తు చేశారు. తరువాత కాలంలో ఇందిరా గాంధీ రాజ్యాంగాన్ని కాలరాసి ఎమర్జెన్సీని ప్రకటించారన్నారు. నెహ్రూని ఎదిరించి రాజ్యాంగాన్ని కాపాడాలనే దృఢమైన వైఖరితో నిలబడిన నాయకుడు సర్దార్ పటేల్ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. నిన్న దిల్లీిలో కాంగ్రెస్ నాయకులు ‘ఓట్ చోరీ’ అంటూ మాట్లాడారు. ప్రియాంకా గాంధీ ఎలక్షన్ కమిషన్‌ను బెదిరించే స్థాయికి వెళ్లారు. ఇదేనా వారి రాజ్యాంగబద్ధమైన ఆలోచన అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీిలో మాట్లాడుతూ మీ అధికారం పోతుంది.. మీ ఓట్లు పోతాయి.. ఓట్లు పోతే ఆధార్ కార్డు పోతుందంటూ బెదిరించారన్నారు. చొరబాటుదారుల మీద ఇంత అనురాగం ఎందుకు? వాళ్ల ఓట్లు తీసేస్తే మీకు ఇబ్బంది ఏంటి అని రామచందర్‌రావు ప్రశ్నించారు. భారతీయులు కాని వారికి ఓటరు లిస్టులో పేరు ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించి అమలు చేసేది బీజేపీ మాత్రమేనని, బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే రాజ్యాంగం సురక్షితంగా ఉంటుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నాయకుల విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో పంచాయతీలలో బీజేపీకి గతంలో 163 సీట్లు మాత్రమే వచ్చాయని, ఈరోజు ఇప్పటికే 600కి పైగా సర్పంచ్ స్థానాలు గెలిచింది.. 45 వేల మందికి పైగా వార్డు మెంబర్లు బీజేపీ తరఫున గెలిచారు.. మూడో విడతలోనూ మరిన్ని స్థానాల్లో గెలుస్తామని చెప్పారు. బీజేపీపై నమ్మకంతో ఓటు వేసినందుకు గ్రామీణ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గౌతం రావు, సీనియర్ నాయకుడు చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి అండ్ మీడియా ఇన్‌చార్జి ఎన్.వి.సుభాష్, తదితర నాయకులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





